
చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ పేరుతో ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్‌మెంట్‌ను, ఈరోజు ఇచ్చిన అడ్వర్టైజ్‌మెంట్‌ను చూస్తే బాబు మోసం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది
ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలకు పింఛన్ హామీలను సూపర్ సిక్స్ నుంచి లేపేశారు
18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1,500 చొప్పున రెండేళ్లలో రూ.36 వేలు చెల్లించావా? ఇది మోసం కాదా?
50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేల చొప్పున రెండేళ్లలో 96 వేల పెన్షన్ చెల్లించావా? ఇది మోసం కాదా?
నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున రెండేళ్లలో రూ.72 వేలు చెల్లించావా? ఇది మోసం కాదా?
అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే కేవలం రూ.5 వేలే ఇచ్చావ్.. ఇది మోసం కాదా?
తల్లికి వందనంలో ఆంక్షల పేరుతో 30 లక్షల మందికి ఎగరగొట్టావ్
ఇచ్చిన అరకొర మందికి కూడా రూ.9 వేలు, రూ.10 వేలు ఇచ్చావ్
ఏటా 3 సిలిండర్లు అన్నావ్.. రెండేళ్లలో 6 సిలిండర్లు ఇవ్వాల్సి ఉంటే కేవలం ఒక్కటే ఇచ్చావ్.. ఇది మోసం కాదా?
ఎక్కడికైనా ఉచిత బస్సు అన్నావ్.. ఇప్పుడు సవాలక్ష ఆంక్షలు పెట్టావ్.. ఇది మోసం కాదా?.. జగన్ ఇస్తున్న సంక్షేమ
పథకాలన్నీ కొనసాగిస్తానని ప్రతి ఎన్నికల సభలో చెప్పావ్.. ఇప్పుడు ఆ పథకాలన్నీ రద్దు చేశావ్.. ఇది మోసం కాదా?
ఈ రోజు (బుధవారం) ఈనాడులో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన చూస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ప్రస్తావన ఎగిరిపోయింది. ఆడబిడ్డ నిధి నెలనెలా రూ.1500.. ఏడాదికి రూ.18 వేలు హామీ మాయమైంది. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఎగిరిపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రకటనలకు.. ఇప్పుడిచ్చిన ప్రకటనలకు పొంతనే లేదు. చంద్రబాబు మాదిరిగా కళ్లార్పకుండా అబద్ధాలు ఆడగలిగిన నేర్పరి ప్రపంచంలో మరొకరు ఉంటారా?
వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా, ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్డెక్కడం, అగచాట్లు పడటం చూశారా? ఇప్పుడే ఎందుకిలా జరుగుతోంది? అప్పుడు, ఇప్పుడు అదే ముఖ్యమంత్రి పదవే. అప్పుడున్న అధికారులే ఇప్పుడూ ఉన్నారు. కానీ అప్పుడు ఈ దుస్థితి లేదు. ఎందుకంటే అప్పుడు సీఎంగా జగన్ ఉన్నాడు. జగన్ అనే వ్యక్తికి రైతులు కష్టాలు పడకూడదు అనే తపన, తాపత్రయం ఉంది. రైతులకు మంచి చేయాలి అనే ఆలోచనలు ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు. అదే అప్పటికీ, ఇప్పటికీ తేడా.
–మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘సూపర్ సిక్స్, సూపర్ సెవెన్.. సినిమా అట్టర్ ఫ్లాప్ అని ప్రజలందరికీ అర్థమైంది. ఇలాంటి అట్టర్ ఫ్లాప్ సినిమాకు అనంతపురంలో బలవంతపు విజయోత్సవాలు చేస్తున్నారు’ అంటూ సీఎం నారా చంద్రబాబునాయుడును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఒక వైపు దారుణమైన పాలన సాగిస్తూ, మరో వైపు మోసం చేస్తూ హామీలన్నీ ఎగ్గొడుతున్నారంటూ ఎత్తిచూపారు.
కళ్లార్పకుండా జంకు బొంకు లేకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు అత్యంత నేర్పరి అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చంద్రబాబు చేసిన మోసాలు, చెప్పిన అబద్ధాలు, పొడిచిన వెన్నుపోట్లతో ప్రజల జీవితాలు తగలబడుతుంటే.. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తున్నట్టుగా చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సూపర్ హిట్ అంటూ అనంతపురంలో బలవంతపు సంబరాలు చేసుకుంటున్నారని ఏకి పారేశారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలపై ‘ఈనాడు’లో ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఇచ్చిన అడ్వర్టైజ్‌మెంట్ (ప్రకటన)ను.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో అనంతపురంలో సభ నిర్వహిస్తున్న సందర్భంగా బుధవారం సంచికలో ఇచ్చిన ఇచ్చిన అడ్వర్టైజ్‌మెంట్‌ను చూపిస్తూ.. వాటిలో ఎగ్గొట్టిన హామీలను ఎత్తిచూపుతూ.. చంద్రబాబు ఏ స్థాయిలో అబద్ధాలు ఆడుతారో, ఏ స్థాయిలో మోసం చేస్తారో చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమేనంటూ తూర్పారబట్టారు.
ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలపై చంద్రబాబు మాట్లాడిన మాటల వీడియోలు, ఆ హామీల అమలు వల్ల ఒనగూరే ప్రయోజనంపై ఇంటింటికీ బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇచ్చిన బాండ్లను, ఇప్పుడు ఆ హామీల అమలు తీరును ఎత్తిచూపుతూ చంద్రబాబు మోసాలను సాక్ష్యాధారాలతో వివరించారు.
సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టడం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ఆరోగ్యశ్రీకి మంగళం పాడటం.. యూరియా, ఇతర ఎరువులు దొరక్క రైతుల కష్టాలు.. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక పోవడం, ఉచిత పంటల బీమాను ఎగ్గొట్టడంపై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా నాణేనికి ఒక వైపు మాత్రమే చెబుతోందని.. మరో వైపు ఏం జరుగుతోందో ప్రజలకు వివరించడానికే మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
ప్రపంచంలో చంద్రబాబులా అబద్ధాలు చెప్పగలిగే నైపుణ్యం ఎవరికైనా ఉందా?
⇒ చంద్రబాబు ఏ స్థాయిలో అబద్ధాలు ఆడతారో, ఏ స్థాయిలో మోసం చేస్తున్నారో చెప్పడానికి ఇదో ఉదాహరణ. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌పై ఎన్నికలకు ముందు 2024 మే 9న ఈనాడులో ఇచ్చిన ప్రకటనలో యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి.. స్కూళ్లకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయం, ప్రతి ఇంటికీ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని ఆ ప్రకటనలో ప్రచారం చేశారు.
⇒ ఈ రోజు (బుధవారం) అదే ఈనాడులో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన చూస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ప్రస్తావన ఎగిరిపోయింది. ఆడబిడ్డ నిధి నెలనెలా రూ.1500.. ఏడాదికి రూ.18 వేలు హామీ మాయమైంది. ఆ స్థానంలోకి 204 అన్న క్యాంటీన్లు వచ్చాయి. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఎగిరిపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రకటనలకు.. ఇప్పుడిచ్చిన ప్రకటనలకు పొంతనే లేదు. చంద్రబాబు మాదిరిగా కళ్లార్పకుండా అబద్ధాలు ఆడగలిగిన నేర్పరి ప్రపంచంలో మరొకరు ఉంటారా? అన్న క్యాంటీన్లు సూపర్ సిక్స్ హామీల్లో గతంలో ఇచ్చినట్టు మనం అనుకోవాలట!
⇒ ఎన్నికల ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల ప్రకటనతో మోసం చేయడమే కాకుండా ప్రతి ఇంటికీ బాండ్లు పంపించారు. ప్రతి ఫోన్‌కు మెసేజ్ పంపించారు. అందులో ముందుగా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీలో బటన్ నొక్కితే ఆ కుటుంబానికి సూపర్ సిక్స్ పథకాల వల్ల ఒనగూరే ప్రయోజనం ఎంత అన్నది వస్తుంది. మెహరాజ్ బేగం షేక్‌కు ఇచ్చిన బాండుకు సంబంధించి బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యారెంటీలో మీ నమోదు సంఖ్య ఇది.. మీ సంక్షేమ వివరాలకు బటన్ నొక్కండి.. అని ఉంది. మెహరాజ్ బేగం షేక్ యూనిక్ కోడ్.. వయసు, లింగం, కులం, వృత్తి, మొత్తం కుటుంబ సభ్యుల వివరాలు వచ్చాయి.
వారికి ఆడబిడ్డ నిధి కింద రూ.1,500.. అంటే ఇంట్లో ఇద్దరు మహిళలు ఉన్నందున ఏటా రూ.36 వేలు, తల్లికి వందనం రూ.15 వేలు చొప్పున ఇద్దరికి రూ.30 వేలు, అన్నదాత సుఖీభవ కింద రైతులు లేరు కాబట్టి సున్నా.. యువగళం కింద ఎవరూ లేరు కాబట్టి సున్నా.. అని పెట్టారు. మొత్తంగా ఆ కుటుంబంలో రూ.3.33 లక్షలు లబ్ధి పొందేందుకు అర్హత సాధించారని.. 2024 జూన్ నుంచి ఈ మొత్తం వారి అకౌంట్లలో జమ చేయడం ప్రారంభమవుతుందని గ్యారంటీ ఇస్తూ.. వాటిని త్రికరణశుద్ధిగా అమలు చేస్తామని ప్రమాణం చేస్తూ బాబు సంతకం చేసి మరీ ఇచ్చారు. ఇలా ఇంటింటికీ బాండ్లు పంపిణీ చేశారు.

⇒ టీడీపీ, జనసేన కూటమి సంయుక్తంగా ఓ వైపు చంద్రబాబు ఫొటో.. మరో వైపు పవన్ కళ్యాణ్ ఫొటో ముద్రించిన బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో కూటమి నేతలు ఇంటింటికీ బాండ్లు పంపిణీ చేశారు.
⇒ టీడీపీ కూటమి నేతలు ఏ ఇంటికి వెళ్లినా.. చిన్న పిల్లలు కన్పిస్తే నీకు రూ.15 వేలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు కనపడితే నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు.. చిన్నపిల్లల అమ్మమ్మలు కనిపిస్తే మీ వయసు 50 ఏళ్లు కాబట్టి మీకు రూ.48 వేలు, 20 ఏళ్ల పిల్లోడు బయటకొస్తే నీకు రూ.36 వేలు, రైతు కనిపిస్తే పీఎం కిసాన్ కింద ఇచ్చేది కాక అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని హామీ ఇస్తూ బాండ్లు ఇచ్చారు. ఇంటిలో ఎవరు కనపడితే వాళ్లకు ప్రతి ఒక్కరికీ బాండ్లు చూపించి మోసం చేశారు.
నాడు చంద్రబాబు ఏమన్నారో వినండి
⇒ ‘ఒకటే హామీ ఇస్తున్నా. జగన్‌మోహన్‌రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నా’
⇒ ‘రైతులకు సంవత్సరానికి ఇప్పుడిచ్చేది కాకుండా రూ.20 వేలు ఇస్తాం. దీనిని టీడీపీలో నిర్ణయించాం. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలున్నా ఒక్కొక్కరికీ రూ.15 వేలు.. ఆంక్షలు లేవు.. కటింగ్‌లు లేవు. పూర్తిగా మా ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత మాది’.
⇒ ‘ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. నేనే డ్రైవర్‌ని.. సేఫ్ డ్రైవర్‌ని. మీరు బస్సు ఎక్కితే.. ఒక్కటే చెప్పండి.. మా చంద్రన్న చెప్పాడు.. నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వు ఏమీ అడగడానికి వీలులేదు. ఇది చంద్రన్న నాకిచ్చిన హక్కు అని గట్టిగా చెప్పండి. ఏమీ భయపడక్కర్లేదు’.
⇒ ‘నా ఆడ బిడ్డల కష్టాలు చూసి ఆలోచించా. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఆలోచించా. మీ ఖర్చులు పెరిగాయి. దుర్మార్గుడు దీపం ఆర్పేస్తున్నాడు. అందుకే మళ్లీ దీపం వెలిగిస్తా. మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా’.
⇒ ‘ప్రతి ఒక్క మహిళను మహా శక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం. కుటుంబ బాధ్యత మీకు అప్పజెప్పాలని నా ఆలోచన. అందుకే ఈ రోజు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 నేరుగా మీ అకౌంట్‌లో వేస్తాం’.
⇒ ‘ఇప్పుడు హామీ ఇస్తున్నా.. ఏపీలోని యువతను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాం. ఇక్కడికి పరిశ్రమలు తెస్తాం. ఉద్యోగాలు ఇస్తాం. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత టీడీపీది. అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తాం. ఎంత తమ్ముళ్లూ.. ఎంత.. రూ.3 వేలు ఇస్తాం’.
చంద్రబాబూ.. ఇవన్నీ మోసాలు కావా?
⇒ ఈ రోజు (బుధవారం) అనంతపురంలో సూపర్‌హిట్ పేరుతో సభ పెట్టావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను.. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇచ్చావా? ఆడబిడ్డ నిధి కింద రెండేళ్లకు రూ.36 వేలు బాకీ పడ్డావు. ఇది మోసం కాదా?
⇒ నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు. రెండేళ్లకు రూ.72 వేలు బాకీ పడ్డావు. అవి ఇవ్వక పోవడం మోసం కాదా? అది నీ సూపర్‌సిక్స్ హామీ కాదా?
⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ నెలకు రూ.4 వేలు. ఏడాదికి రూ.48 వేలు. రెండేళ్లకు రూ.96 వేలు బాకీ. ఇది మోసం కాదా? పెన్షన్ల సంఖ్య గత ఏడాది మార్చి నాటికి 66,34,742 ఉంటే, ఈ నెలలో మీరు ఇచ్చిన పెన్షన్లు 61,92,864. అంటే దాదాపు 5 లక్షలు కోత. ఇది మోసం కాదా?.
⇒ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి పోవాలన్నా బస్సుల్లో ఫ్రీ (ఉచితం) అన్నావు. కానీ పరిమిత బస్సుల్లోనే అనుమతివ్వడం మోసం కాదా?
⇒ ప్రతి ఇంటికీ ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ (ఉచితం) అన్నావు. కానీ గత ఏడాది ఒక్కటే ఇచ్చావు. ఈ ఏడాది ఒక్కటి కూడా లేదు. అంటే 6 సిలిండర్లకు గాను, కేవలం ఒక్కటే ఇవ్వడం మోసం కాదా?
⇒ పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్నావు. అలా రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా?
⇒ తల్లికి వందనం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి కోతలు లేకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా ఏడాదికి రూ.15 వేలు ఇస్తానన్నావు. తొలి ఏడాది రూ.15 వేలు ఎగ్గొట్టావు. రెండేళ్లకు రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా, 30 లక్షల మందికి ఎగ్గొట్టావు. మిగిలిన వారికి కేవలం రూ.13 వేలు మాత్రమే, ఇంకా చాలా మందికి రూ.8 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా?
⇒ గత ప్రభుత్వంలో అమలైన పథకాలు రద్దు చేయడం మోసం కాదా? చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, తోడు, చేదోడు, ఉచిత పంటల బీమా, విద్యా దీవెన, వసతి దీవెన, పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ రద్దు చేశావు. ఇది మోసం కాదా?
యథేచ్ఛగా దోపిడీతో సంపద పెంచుకుంటున్న చంద్రబాబు ముఠా
⇒ ఇసుకతో పాటు లిక్కర్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా కళ్లెదుటే దోచుకుంటోంది. ప్రతి గ్రామంలోనూ బెల్ట్‌షాపులు వెలిశాయి. అనధికారిక పర్మిట్ రూములు నడుస్తున్నాయి. అక్కడ ఎమ్మార్పీ కంటే అధిక ధరకు మద్యం విక్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. మద్యం మాఫియా దోచేస్తోంది. సిలికా, క్వార్ట్జ్ , లేటరైట్ ఇలా అన్ని వనరులను మింగేస్తూ చంద్రబాబు ముఠా సొంత సంపదను పెంచుకుంటోంది.
⇒ అమరావతిలో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10 వేలు. నిజానికి చదరపు అడుగు రూ.4500తో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలలో ఫైవ్ స్టార్ వసతులతో లగ్జరీ నిర్మాణాలు చేయొచ్చు. కానీ.. రాజధాని అమరావతిలో చదరపు అడుగు నిర్మాణానికి రూ.పది వేలు వెచ్చిస్తూ దోచుకుంటున్నారు.
⇒ ఇంకా శనక్కాయలు, పప్పు బెల్లాలకు ఇష్టం వచ్చినట్లుగా లూలూ ఉల్లూ.. ఉర్సా బర్సా.. అంటూ ఇష్టం వచ్చినోళ్లకు చంద్రబాబు భూములు పంచి పెడుతున్నారు. కుడి, ఎడమల దోపిడీ సాగిస్తున్నారు. రాష్ట్రంలో దోపిడీకి పరాకాష్ట 17 మెడికల్ కాలేజీలను స్కామ్‌లకు పాల్పడుతూ అమ్మేయడం. ఒకవైపు రాష్ట్ర ఆదాయం తగ్గుతోంటే.. మరోవైపు చంద్రబాబు ఆదాయం, ఆయన అనుయాయుల సంపద పెరుగుతోంది. చంద్రబాబు ముఠా దోచేస్తోంది కాబట్టే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతోంది.
రికార్డు స్థాయిలో అప్పు.. అది ఎవరి జేబులోకి వెళ్తోంది?
⇒ 15 నెలల్లో దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇది ఎవరి జేబులోకి పోతోంది? ఈ స్థాయిలో అప్పు చేసిన దాఖలాలు రాష్ట్ర చరిత్రలోనే లేవు.
⇒ 2014లో రాష్ట్రం విడిపోయే నాటికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన, ఇవ్వని అన్ని రకాల అప్పులు కలిపి మొత్తం రూ.1,40,717 కోట్లు.. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ఆ అప్పు ఏకంగా రూ.3,90,247 కోట్లకు చేరింది. అంటే 2014–19 మధ్య రూ.2,49,350 కోట్ల అప్పు చేశారు. ఏటా అప్పుల్లో వార్షిక సగటు వృద్ధి రేటు (సీఏజీఆర్) 22.63 శాతం.
⇒ మా ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉన్న అప్పులు రూ.3,90,247 కోట్లు కాగా, గత ఏడాది మేము దిగిపోయే నాటికి ఆ మొత్తం రూ.7,21,918 కోట్లకు చేరుకుంది. అంటే మా హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు. ఏటా అప్పుల సగటు పెరుగుదల (సీఏజీఆర్) 13.57 శాతం మాత్రమే.
⇒ మా ప్రభుత్వ హయాంలోని ఐదేళ్లలో మేము చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు కాగా, చంద్రబాబు కేవలం 15 నెలల్లో చేసిన అప్పు ఏకంగా రూ.1,91,361 కోట్లు. అంటే మేము ఐదేళ్లలో చేసిన అప్పులో 57.5 శాతం చంద్రబాబు కేవలం ఈ 15 నెలల్లోనే చేశారు.
⇒ రికార్డు స్థాయిలో అప్పు చేసినా, సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు.
⇒ మా ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. మరి అప్పుగా తెచ్చిన రూ.1,91,361 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) పద్ధతిలో చంద్రబాబు ముఠా జేబులోకి వెళ్లాయి.