ప్రజల గొంతు వినిపించకూడదా?: వైఎస్‌ జగన్‌ | YS Jaganmohan Reddy Fires On Chandrababu Naidu coalition govt | Sakshi
Sakshi News home page

ప్రజల గొంతు వినిపించకూడదా?: వైఎస్‌ జగన్‌

Sep 19 2025 5:45 AM | Updated on Sep 19 2025 5:45 AM

YS Jaganmohan Reddy Fires On Chandrababu Naidu coalition govt

అందుకేనా వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా నిరాకరణ 

చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ జగన్‌ మండిపాటు

ప్రజల కష్టాలు వినడానికి ఈ ప్రభుత్వం ఇష్టపడటం లేదు 

అసెంబ్లీలో అటూ ఇటూ వారే డబుల్‌ యాక్షన్‌ 

‘నువ్వు కొట్టు.. నేను ఏడుస్తా’ అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు 

ప్రజలను ఏడిపించేది ఈ ప్రభుత్వమే..

అయ్యో మీ తరఫున మేం ఏడుస్తామనేదీ ఈ ప్రభుత్వమే 

ఇలా ఏడ్చినట్లు నటించినంత మాత్రాన సానుభూతి రాదు 

విపక్షంగా మేము సమస్యలు లేవనెత్తితేనే నిజాయితీ ఉంటుంది 

విద్య, వైద్యం, వ్యవసాయం సహా అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం 

తిరోగమనం.. ప్రజలకు కనీసంగా చేయాల్సినవి ఏవీ చేయడం లేదు 

ప్రభుత్వం అనేది ఉందా? లేదా? అని ప్రజలకు సందేహం కలుగుతోంది.. శాంతి భద్రతల పరిస్థితి మరింత దారుణం 

వీటన్నింటిపై సభలో మాట్లాడే సమయం ఇచ్చే పరిస్థితి లేనందుకే మీడియా వేదికగా నిలదీత.. మండలిలో మన పారీ్టకి మంచి బలం ఉంది

ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలి.. 

శాసనసభ, మండలి సమావేశాల సందర్భంగా సభ్యులకు దిశా నిర్దేశం  

సాక్షి, అమరావతి: అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపించాలన్న తపన, ఆలోచన చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ఏ కోశానా∙లేదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. అందుకే మనకు మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని ప్రతిపక్షంగా గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘నాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ నుంచి వారంలోనే ఐదుగురు మనవైపు వచ్చి కూర్చున్నారు. అలా ఇంకొందరిని లాక్కుని, చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా లేకుండా చేద్దామని చాలా మంది సలహా ఇస్తే నేను వద్దన్నాను. విపక్షం గొంతు వినాల్సిన అవసరం ఉందని చెప్పాను. 

ఆ మేరకు వారికి అవకాశాలు ఇచ్చాం. సభలో వారు చెప్పింది విన్నాం. కానీ, ఈ రోజు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్షం ఉండ­కూడదని కోరుకుంటోంది’ అని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. శాసనసభ, మండలి సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైందన్నారు. 

అసలు రాష్ట్రంలో ప్రభు­త్వం ఉందా.. అన్న సందేహం ప్రజలకు కలుగుతోందని చెప్పా­రు. రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వంపై ఇంత తక్కువ వ్యవధిలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఎత్తిచూపారు. ఈ సమయంలో శాసనసభలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు మనకు తగిన సమయం కేటాయించడం ఇష్టం లేకనే వైఎస్సార్‌సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని స్పష్టం చేశారు. 

మొత్తం సభ్యులతో కలిపి కేవలం ఒక ఎమ్మెల్యేకు మాత్రమే ఇచ్చే అతి తక్కువ సమయంలో ప్రజా సమస్యలు ఎలా ప్రస్తావిస్తామని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో దారుణంగా విఫల­మైన ప్రభు­త్వాన్ని నిలదీసేందుకు, ప్రశ్నించేందుకు అవసరమైన సమగ్ర సమాచారం సిద్ధంగా ఉన్నప్పటికీ, మాట్లాడేందుకు తగిన సమ­యం ఇవ్వడం లేదు కాబట్టే.. సభకు హాజరుకావడం లేదని తేల్చి చెప్పారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..


వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

వారే డబుల్‌ యాక్షన్‌ చేయాలనుకుంటున్నారు
అసెంబ్లీలో అధికార పక్షం డబుల్‌ యాక్షన్‌ చేయాలనుకుంటోంది. ‘నువ్వు కొట్టు.. నేను ఏడుస్తా’ అన్న రీతిలో వారు వ్యవహరిస్తున్నారు. ప్రజల్ని ఏడిపించేది ఈ ప్రభుత్వమే. మళ్లీ వారు ఏడుస్తున్నారని, వారి తరఫున తామే ఏడు­స్తామంటూ డబుల్‌ రోల్‌ ప్లే చేస్తామంటోంది ఈ ప్రభుత్వమే. ఇలా రెండు వైపులా యాక్షన్‌ చేస్తోంది. నిజం చెప్పాలంటే వారు ఏడ్చినట్లు నటించినంత మాత్రాన ప్రజల్లో సానుభూతి రాదు. విపక్షంగా మనం ప్రజా సమస్యలు లేవనెత్తితేనే అందులో నిజాయితీ ఉంటుంది.

⇒ నాడు చంద్రబాబు కూడా అసెంబ్లీకి రాలేదు. ఆయన్ను ఎవరూ ఏమీ అనకున్నా.. బయటకు వెళ్లి ఏడ్చాడు. నేను రికార్డులన్నీ చూశాను. మన సభ్యులు ఎవరూ ఏమీ అనలేదు. అయినా అబద్ధాలు చెప్పి, సభకు రాలేదు. అదే మనం జాయింట్‌ సెషన్‌లో గవర్నర్‌ అడ్రస్‌ సమయంలో అటెండ్‌ అయ్యాం. ఏటా అలా వెళ్తున్నాం. గవర్నర్‌ ఎదుట మన సమస్య ప్రస్తావించి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పి వస్తున్నాం.

⇒ అసెంబ్లీలో ప్రజల గొంతు వినపడాలనే తపన ఈ ప్రభుత్వానికి లేదు. అందుకే మనకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని అనుకుంటోంది. ఇటీవల నేను ప్రెస్‌మీట్‌లో మూడు అంశాలపై గంటన్నర మాట్లాడాను. అలా మనకు అసెంబ్లీలో కూడా అవకాశం ఇస్తేనే, ప్రజా సమస్యలు ప్రస్తావించగలం. అలా కాకుండా మనల్ని ప్రతిపక్షంగా గుర్తించకుండా, ఒక ఎమ్మెల్యే మాదిరిగా కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఇస్తే ఏం మాట్లాడగలం?

⇒ నిజానికి సభలో ఉన్నవి నాలుగే నాలుగు పార్టీలు. అందులో మూడు.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా అధికారంలో ఉన్నాయి. ఇక మిగిలిన ఒకే ఒక పార్టీ మనది విపక్షం. కానీ దాన్ని గుర్తించబోమని ఈ ప్రభుత్వం చెబుతోంది. ఎందుకంటే సభలో ప్రజల గొంతు వినడం ప్రభుత్వానికి ఇష్టం లేదు కాబట్టి. అందుకే సభకు వెళ్లకుండా ఇక్కడ ప్రెస్‌మీట్‌లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించాం.

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యం 
⇒ రాష్ట్రంలో కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తం ఏడు త్త్రెమాసికాలు పెండింగ్‌.  మొత్తం ఏడు క్వార్టర్లు.. అంటే దాదాపు రూ.4,900 కోట్లు బకాయి ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చింది రూ.900 కోట్లే.

⇒ వసతి దీవెన గత ఏడాది రెండు దఫాలు, ఈ ఏడాది మరో దఫా పెండింగ్‌ ఉంది. ఈ పథకం కింద మరో రూ.2,200 కోట్లు బకాయి పడ్డారు. అలా ఈ రెండు పథ­కాలకే రూ.6,200 కోట్లు బకాయి పడ్డారు. కాలేజీలు కూడా చేతులెత్తేసే పరిస్థితులు వచ్చాయి. స్కూళ్లలో నాడు–నేడు పనులన్నీ గాలికి ఎగిరిపోయాయి. గోరుముద్ద నాశనం అయ్యింది. ట్యాబులిచ్చే కార్యక్రమం ఆగిపోయింది. సీబీఎస్‌ఈని రద్దు చేశారు. సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్‌ ఎగిరిపోయింది. స్కూళ్లలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఆగిపోయాయి. పిల్లలకు ఇచ్చే చిక్కీలు కూడా ఆపేశారు.

⇒ వైద్య రంగం పరిస్థితి చూస్తే మరింత ఘోరంగా ఉంది. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీని ఆపేశారు. ఆరోగ్య శ్రీకి రూ.3,500 కోట్లకు పైగా బకాయి పడ్డారు. దీంతో ఈ పథకం కింద వైద్యం చేయలేమని ఆస్పత్రుల్లో బోర్డులు పెట్టేస్తు­న్నా­రు. ఆరోగ్య ఆసరా కింద రూ.600 కోట్లు బకాయి పడ్డారు.

⇒ మన ప్రభుత్వంలో ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల పనులు మొదలుపెట్టి, ఏడు కాలేజీలు పూర్తి చేశాం. మనం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మెడికల్‌ కాలేజీ పనులు మొదలుపెట్టాం. దాని వల్ల అక్కడ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్య సేవలందుతాయి. నిరుపేద పిల్లలకు మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి.

⇒ రైతులకు యూరియా కూడా సరఫరా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. మొత్తం బ్లాక్‌ మార్కెట్‌. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మన ప్రభుత్వం హయాంలో మార్కెట్‌లో జోక్యం చేసుకుని రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం. కానీ ఈ ప్రభుత్వంలో ఏమీ లేవు. ఉచిత పంటల బీమాను కూడా రద్దు చేశారు. అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లకు రూ.40 వేలకుగాను కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారు.  

ఎక్కడికక్కడ దోపిడీ.. నీకింత.. నాకింత
శాంతి భద్రతల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వ్యవస్థల్లో ఇంత లంచాలు ఎప్పుడూ చూడలేదు. ఎక్కడికక్కడ సిండికేట్లుగా మారి వసూళ్లు చేస్తున్నారు. పెదబాబుకు ఇంత, చిన బాబుకు ఇంత అని పంచుతున్నారు. లిక్కర్‌ను ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.  ఇసుక ఎక్కడా ఉచితంగా లభించడం లేదు. ఇంకా లేటరైట్, క్వార్ట్‌జ్, సిలికా.. దేన్నీ వదిలి పెట్టడం లేదు. చివరకు ఫ్లైయాష్‌ కూడా అమ్మేసుకుంటున్నారు.

అన్నింటా విఫలమైనా నిస్సిగ్గుగా సూపర్‌ హిట్‌ సభ
ఈ ప్రభుత్వం అన్నింటా దారుణంగా విఫలమైనా..  ఇటీవల సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ హిట్‌ పేరుతో కార్యక్రమం చేశారు. ఆ సభ సందర్భంగా ఇచ్చిన అడ్వర్టయిజ్‌మెంట్‌ను, ఎన్నికల నాటి యాడ్‌తో పోల్చి చూస్తే పూర్తిగా మారిపోయింది. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు. 50 ఏళ్లు నిండిన వారందరికీ పెన్షన్‌ రూ.4 వేలు ఈ ప్రకటనలో లేవు. పథకాలు కూడా మారిపోయాయి.

వీటన్నింటిపై గట్టిగా నిలదీయండి
మనకు కౌన్సిల్‌లో మంచి బలం ఉంది. రాజకీయంగా ఎదగడానికి పార్టీకి చెందిన ఎమ్మెల్సీలకు ఇది మంచి అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకోండి. చూస్తుండగానే ఏడాదిన్నర గడిచిపోయింది. మిగిలింది మరో రెండున్నర ఏళ్లు మాత్రమే. మరో అసెంబ్లీ సెషన్‌ తర్వాత.. చూస్తుండగానే మరో ఏడాది గడుస్తుంది. కాబట్టి, మీరు కౌన్సిల్‌లో గట్టిగా నిలబడండి. గట్టిగా మాట్లాడండి. ప్రజా సమస్యలు లేవనెత్తండి. ప్రభుత్వాన్ని కింది అంశాలపై నిలదీయండి.

సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ వైఫల్యం
⇒ రీ వెరిఫికేషన్‌ పేరిట దివ్యాంగులకు ఇబ్బందులు.. పెన్షన్‌ కోతలు.
⇒ ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు
⇒ యూరియా సహా ఎరువుల కొరత, రైతుల అగచాట్లు
⇒ పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం
⇒ రైతుల ఆత్మహత్యలు
⇒ కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ
⇒ పేదలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలు లాక్కోవడం
⇒ ఆరోగ్య శ్రీ బంద్‌.
⇒ విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ
 ప్రభుత్వంలో అడుగడుగునా అవినీతి, దోపిడీ
⇒ ఉద్యోగస్తుల సమస్యలు, డీఏలు, పీఆర్సీలు, ఐఆర్, సరెండర్‌ లీవ్స్‌ తదితర బకాయిలు, వారిపై వేధింపులు
⇒ పులివెందుల జెడ్పీటీసీ బైపోల్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ
⇒ అమరావతిలో తొలి విడత రైతులకు ఏమీ చేయకుండానే రెండో విడత ల్యాండ్‌ పూలింగ్‌
⇒ అసైన్డ్‌ అన్న పదం తొలగింపు.. మళ్లీ బినామీల పేర్లతో కొనుగోలు
⇒ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం
⇒ 15 నెలల్లోనే రూ.19 వేల కోట్ల కరెంటు ఛార్జీల బాదుడు

రాష్ట్ర ఆదాయానికి దారుణంగా గండి
రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రావడం లేదు. అదంతా అధికార పార్టీ నేతల జేబుల్లోకి పోతోంది. ఇసుక అమ్మకం ద్వారా మన హయాంలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్లు రాగా, ఇప్పుడు అది రావడం లేదు. మద్యం ఆదాయం మన హయాంలో ప్రభుత్వానికి వచ్చేది. కానీ, ఇప్పుడేం జరుగుతోంది? వీళ్లే బెల్టు షాప్‌లు పెట్టించి, ఎక్కువ రేట్లకు అమ్మి అంతా జేబుల్లో వేసుకుంటున్నారు. హార్బర్లలో వాళ్లే పెట్రోల్, డీజిల్‌ అమ్ముతున్నారు. మండలిలో మనకు మంచి బలం ఉంది కాబట్టి ప్రజల కోసం గట్టిగా పోరాటం చేయాలి.

మెడికల్‌ కాలేజీలను కాపాడుకోవాలి
మెడికల్‌ కాలేజీలు అనేవి తరతరాల ఆస్తి. అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు. పైగా అందులో ఫీజులు దారుణంగా ఏకంగా ఏటా రూ.57 లక్షలకు పెంచేస్తున్నారు. ఆ కాలేజీలు తన అత్తగారి సొత్తు అన్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మేస్తున్నారు. అవి ప్రభుత్వ రంగంలో ఉంటేనే పేదలకు ఉచితంగా వైద్యం అందుతుంది. అందుకే మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేయాలి. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అన్ని రకాల మార్గాలను అన్వేషించాలి. చంద్రబాబు తన వాళ్లకు కట్టబెట్టడానికి ఏమైనా చేస్తాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement