ముంబై: సుమారు 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. విభేదాలతో విడిపోయిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ ఒక్కటయ్యారు. నేడు (బుధవారం) జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ఇద్దరూ కలసి పాల్గొన్నారు. జనవరి 15న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో శివసేన (ఠాక్రే వర్గం),మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు.
కుటుంబ సభ్యుల సమక్షంలో..
ముంబైలోని ఒక వేదికపై ఇద్దరు సోదరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి కనిపించడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం పెల్లుబికింది. ఈ కలయికను ఉద్దేశించి సీనియర్ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, దీనిని ఒక శుభప్రదమైన ప్రారంభంగా అభివర్ణించారు. ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ)తో పాటు ఇతర కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరాలంటే ఈ కలయిక అనివార్యమని ఆయన అన్నారు.
వారసత్వ పోరాటమే స్ఫూర్తి
ఈ సభలో ఉద్ధవ్ ఠాక్రే భావోద్వేగంతో మాట్లాడారు. తమ తాత ప్రబోధన్‌కర్ ఠాక్రే, తండ్రి బాలాసాహెబ్ ఠాక్రేల ఆశయాల గురించి గుర్తు చేసుకుంటూ, తాము ఇక్కడ కేవలం ఇద్దరు వ్యక్తులుగా కాకుండా ఠాక్రే సోదరులుగా నిలుచున్నామని అన్నారు. శివసేన స్థాపించి 60 ఏళ్లు అవుతున్న తరుణంలో, మరాఠీ ప్రజల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ముంబై రక్షణే పరమావధి
మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. కొందరు నేతలు ముంబైని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము విడిపోయి పోరాడితే అది ఇక్కడి అమరవీరులకు చేసే అవమానమవుతుందన్నారు. రాజ్ ఠాక్రే తన ప్రసంగంలో సంఘీభావం చాటారు. వ్యక్తిగత అపార్థాల కన్నా మహారాష్ట్ర గౌరవమే గొప్పదన్నారు. సీట్ల పంపకాల కంటే ముంబై ప్రయోజనాలే తమకు ముఖ్యమని, నాసిక్ వంటి ఇతర కార్పొరేషన్లలో కూడా ఈ పొత్తు కొనసాగుతుందని అన్నారు. కాగా ఈ పొత్తు ద్వారా ముంబై పీఠాన్ని దక్కించుకుంటామని రాజ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: ‘విజయ్‌తో రాహుల్’.. సీక్రెట్ వెల్లడించిన టీవీకే నేత


