సాక్షి, నారాయణపేట్: పదేళ్లలో పాలమూరు ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారని.. ఇక్కడి నుంచి ఎంపీగా నెగ్గి కూడా కేసీఆర్ ఈ ప్రాంతాన్ని ఎండబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం సాయంత్రం కోస్గిలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళానికి హజరైన ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ కీలక నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచు,ఉప సర్పంచు, వార్డుసభ్యులు ప్రజల ఆశలను వమ్ముచేయకుండా పని చేయాలి. గాందీ కలలు గన్నట్టు గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధికి చిహ్నం. కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు స్దానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎన్నికలు పూర్తి అయ్యాయి ఇక రాజకీయాలు వద్దు అభివృద్ధి ద్యేయంగా పార్టీలకు అతీతంగా పని చేయాలి. చిన్నచిన్న విభేదాలు ఉంటే పక్కన పెట్టాలి గ్రామల్లో కక్షలు పెంచుకోవద్దు. నాకు వచ్చిన ఈ అవకాశం మీ అభివృద్ధికే..
రాష్ట్రంలోని 12706 గ్రామపంచాయితీలకు స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద నిదులు ఇస్తాం. చిన్న పంచాయితీలకు 5 లక్షలు పెద్దగ్రామ సర్పంచులకు 10 లక్షలు నూతన సంవత్సరంలో ఇస్తాం. సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబందించిన ప్రణాళికలు సిద్దం చేయండి. ప్రతి ఇంటికి రేషన్ కార్డులు ఇస్తాం. గ్రామాల్లో ఎవరికైన అర్హులకు సంక్షేమ పథకాలు రాకుంటే పేర్లు ఇస్తే వారికి ఇస్తాం. ఇందిరమ్మ చీరలు మేం ఇస్తున్న సారె లాంటిది. చదువే జీవితాల్లో వెలుగు తెస్తుంది పిల్లలకు మంచి విద్యను అందిస్తాం. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పహారం,నాణ్యమైన భోజనం అందిస్తాం. మార్చి 31 లోగా కేంద్రం నుంచి 3 వేల కోట్ల నిధులు గ్రామపంచాయితీలకు తీసుకోస్తా
కేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా?. పదేళ్లు బీఆర్‌ఎస్ తెలంగాణకు అన్యాయం చేసింది. పాలమూరుకు వలస వచ్చి కేసీఆర్ ఎంపీ అయ్యాడు. కానీ, నీళ్ల కూడా ఇవ్వకుండా ఈ ప్రాంతాన్ని ఎండగట్టాడు. బీఆర్‌ఎస్ ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. వాళ్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నో పాపాలు చేశారు. లక్షా 80 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి.. కమిషన్లు దండుకున్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు.
నన్ను జైలుకు పంపారు. నా కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారు. కేసీఆర్ ఆయన పాపాలకు ఆయనే పోతాడని.. నేనేమీ అనలేదు. అధికారంలోకి వచ్చాక నేను పగ రాజకీయాలు చేయలేదు. ఒక్క కేసు కూడా పెట్టలేదు. కక్ష సాధింపులకు పాల్పడలేదు. ప్రమాణస్వీకారం చేసిన రోజునే మంచం మీద నుంచి పడి మక్కెలిరగొట్టుకున్నాడు.
రెండేళ్ల నుంచి ఫాంహౌజ్‌నే కేసీఆర్ జైలుగా మార్చుకున్నారు. మొన్నే బయటకు వచ్చాడు. తోలు తీస్తానంటూ ఏదో మాట్లాడారు. రెండేళ్లు ఫామ్‌హౌజ్‌లో అదే పని చేశారా?.. మా సర్పంచ్‌ల దగ్గరికి రా ఎవరి తోలు తీస్తారో చూద్దాం. చింతకమడకలో చీరి చింతకు కడతారు. నేకేసీఆర్ చేయని పాపం అంటూ లేదు. సొంతల్లుడి ఫోన్‌నే ట్యాపింగ చేయించాడు. సొంత బిడ్డకే చీర పెట్టలేనోడు.. మాపై మాట్లాడతారా?. ఇన్ని ఎన్నికలు జరుగుతున్నా.. జనం బండకేసి కొడుతున్నా.. సిగ్గు రావడం లేదు. కేసీఆర్ ఉడత ఊపులకు భయపడేవాడిని కాదు నేను.
పండక్కి చెల్లెల్ని కూడా ఇంటికి పిలవలేనోడు కేటీఆర్. తండ్రి గాలికి సంపాదించిన వాటా పంచాల్సి వస్తుందని సొంత చెల్లినే మెడలు పట్టి బయటకు పంపించావ్. సొంత చెల్లికే సమాధానాలు చెప్పలేనోడు నాకే సవాల్ విసరుతాడా?.. కేటీఆర్ నువ్వెంత.. నీ స్థాయి ఎంత..? నీలా అమాయకుల్ని నేను మోసం చేయలేదు. అలాంటిది నేను నీకు భయపడతానా?.. హరీష్‌రావు ఆరడుగులు పెరిగిండు.. కానీ తలకాయే లేదు. నీ కండలు కరిగి.. తొలు మిగిలింది. నీకా నేను భయపడేది.
2029లో 80 శాతంపైగా సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తాం. రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా.. ఇదే నా సవాల్. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్‌ను అధికారంలోకి రానివ్వను.. ఇదే నా శపథం.
తండ్రీ కొడుకులు కల్లు కాంపౌండ్ మాటలు మాట్లాడొద్దు. సోయిలేని మాటలు.. స్థాయిలేని విమర్శలు. పార్టీ ఆఫీసులో కాదు.. అసెంబ్లీకి రండి. నీళ్లు, నియామకాలు.. నిధులు.. వేటిపైన అయినా అసెంబ్లీలో చర్చకు నేను సిద్ధం. కూలిన కాళేశ్వరం.. ఫోన్ ట్యాపింగ్.. ఏ అంశంపైనా అయినా సరే చర్చిద్దాం. ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు చర్చ పెడతాం. మీరు సిద్ధమా? అని రేవంత్ అన్నారు.


