
వైఎస్సార్ కడప జిల్లా నల్లపురెడ్డిపల్లెలో స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ , తాళ్లపల్లెలో ఉల్లి రైతుల సమస్యలు వింటున్న వైఎస్ జగన్
రాష్ట్రంలో ఉల్లి, అరటి, చీనీ, మినుము రైతులు ధరలు లేక అల్లాడుతున్నారు
చంద్రబాబు సర్కారుపై మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
యూరియా కొరతతో బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్న దుస్థితి
కమీషన్ల కోసం ప్రభుత్వ పెద్దలే బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు
ఆర్బీకేలు, పీఏసీఎస్‌లకు యూరియా ఎందుకు కేటాయించడం లేదు?
రైతన్నలకు రెండేళ్లకుగాను ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఒక్కొక్కరికి రూ.40 వేలు
ఇప్పటివరకు అన్నదాతా సుఖీభవ కింద ఇచ్చింది కేవలం రూ.5 వేలే
వైఎస్సార్‌సీపీ హయాంలో ఉచిత పంటల బీమా అమలు చేశాం
చంద్రబాబు సీఎం అయిన తరువాత దీన్ని పూర్తిగా ఎగ్గొట్టేశారు
పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం తాళ్లపల్లెలో ఉల్లి, బత్తాయి రైతులను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదని, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు రైతులను పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ మంగళవారం పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం తాళ్లపల్లె వద్ద ఉల్లి, బత్తాయి రైతులను పరామర్శించారు.
కూటమి ప్రభుత్వంలో పంటలకు కనీస గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నదాతలు ఆవేదన వెలిబుచ్చారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వం తమను ఆదుకుందని, ఇప్పుడు పంటలకు రేటు లభించక అప్పుల పాలవుతున్నామంటూ రైతులు వాపోయారు. వైఎస్ జగన్ వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం తక్షణం కళ్లు తెరిచి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
హెరిటేజ్‌లో కిలో రూ.35.. రైతులకు ఇస్తున్నది రూ.6
‘ఈ రోజు చీనీ రేటు క్వింటాలు రూ.12వేల నుంచి రూ.6వేలకు పతనమైనా కొనుగోలు చేసే నాథుడు లేడు. ఇందులో కూడా పదికి రెండున్నర టన్నులు సూట్ కింద కమీషన్ వసూలు చేస్తున్నారు. అదే వైఎస్సార్‌సీపీ హయాంలో క్వింటాల్ కనీసం రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు రేటుతో రైతులు అమ్ముకున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఉల్లి క్వింటాల్ కనీసం రూ.4 వేలనుంచి రూ.12 వేలు చొప్పున అమ్ముడుపోయింది.
ప్రస్తుతం రైతుల నుంచి క్వింటాకు గ్రేడ్ బాగుంటే రూ.600 నుంచి రూ.800 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. లేదంటే క్వింటాలు రూ.300 నుంచి కొనుగోలు చేస్తున్నారు. అంటే సగటున క్వింటాలుకు నాలుగైదు వందలు కూడా రేటు రావడం లేదు. ఉల్లి పండించిన రైతులకు కనీసం కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల నుంచి కనీసం రూ.2,500 చొప్పున ఉల్లి కొనుగోళ్లు చేపట్టాలి.
ప్రభుత్వమే ఈ పంటను బయటి రాష్ట్రాలకు గానీ రైతుబజార్ల ద్వారా గానీ విక్రయించేలా చూడాలి. ఇదే ఉల్లిని హెరిటేజ్‌లో కేజీ రూ.35 చొప్పున అమ్ముతున్నారు. కానీ ఇక్కడ రైతుకు ఇచ్చేది కేవలం రూ.6 మాత్రమే. రైతులకు కేజీ రూ.25 చొప్పున చెల్లించి చంద్రబాబు తమ లాభాలను కొద్దిగా తగ్గించుకున్నా కూడా రూ.35కి అమ్ముకోవచ్చు కదా? హెరిటేజ్‌లో లాభాలు తగ్గకూడదు.. చంద్రబాబు వ్యాపారాలు జరగాలి.. ఇదీ పరిస్థితి! అరటి దుస్థితి కూడా ఇలాగే ఉంది. రూ.3వేలకు కూడా కొనేవారు కనిపించడం లేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.25 వేల నుంచి రూ.30 వేలకు రైతులు అమ్ముకున్నారు.
యూరియా కూడా అందించలేకపోతున్నారు
వైఎస్సార్‌సీపీ హయాంలో యూరియా ఎప్పుడూ బ్లాక్‌లో విక్రయాలు జరిగిన పరిస్థితి లేదు. ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు తన గ్రామంలోనే యూరియా లభించేలా చర్యలు తీసుకున్నాం. కమీషన్లు, బ్లాక్‌లో అమ్ముకోవడం అనే ప్రసక్తే లేకుండా చేశాం. ఈ రోజు యూరియాకు కమీషన్లు తీసుకుని బ్లాక్‌లో రైతులకు విక్రయిస్తున్నారు. కనీసం రూ.200 అధికంగా వసూలు చేస్తున్నారు.
లేదంటే తమ వద్ద ఉన్న పురుగుమందులు కొనుగోలు చేయాలని రైతులను ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఆర్బీకేలు, పీఎస్‌సీఏలకు ఎందుకు యూరియా కోటా ఇవ్వడం లేదు? మా హయాంలో రూ.265కి యూరియా బస్తా లభించేది. తమ గ్రామంలోనే రైతన్నలు యూరియాను కొనుగోలు చేసేవారు. సొసైటీలు, ఆర్బీకేలు వారికి అందుబాటులో ఉంటూ పనిచేశాయి.
నేడు సొసైటీలు, ఆర్బీకేలు లేవు. వాటి ద్వారా సరఫరా చేస్తే ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు రావని బ్లాక్ మార్కెట్‌ను దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారు. ఉల్లి, చీని, అరటి, మినుము.. ఇలా ఏ పంట చూసినా రేటు లేని పరిస్థితిలో ఇవాళ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం చూస్తే.. అన్నదాతా సుఖీభవ కింద ఇరవై వేల చొప్పున రెండేళ్లకుగానూ చంద్రబాబు ఒక్కో రైతుకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉన్నా, ఇంతవరకు ఇచ్చింది రూ.5 వేలు మాత్రమే. మా హయాంలో రైతులకు ఇచ్చిన ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టేసింది. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి, నరేన్ రామాంజులరెడ్డి, సంబటూరు ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.