
‘అన్నదాత పోరు’కు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సన్నద్ధం
రైతులు, రైతు సంఘాలతో కలసి అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిరసనలు
ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, యూరియా కొరతపై కన్నెర్ర
పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి
ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలి
వర్షాలతో నష్టపోయిన చోట్ల రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలి
రైతులతో కలసి డిమాండ్ పత్రాలను సమర్పించనున్న పార్టీ నేతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో కూటమి సర్కారుపై వైఎస్సార్ సీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు మంగళవారం శాంతియుత ఆందోళనలు నిర్వహించనున్నాయి. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, సరిపడా అందించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి వైఎస్సార్‌సీపీ నేతలు ఆర్డీవోలకు డిమాండ్ పత్రాలను అందించనున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని, వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో తక్షణమే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేయనున్నారు.
ఎమ్మార్పీపై బస్తాకు రూ.200 అధికం
కూటమి ప్రభుత్వంలో యూరియా కొరత రాష్ట్ర రైతాంగాన్ని తీవ్రంగా పట్టి పీడిస్తోంది. వ్యవసాయ సీజన్‌లో ఒక్క యూరియా కట్ట కోసం గంటల తరబడి ప్రైవేట్ దుకాణాలు, ఆర్బీకేలు, పీఎసీఎస్‌ల ముందు పడిగాపులు కాస్తున్న దుస్థితి సర్వత్రా కనిపిస్తోంది. నల్ల బజార్‌లో కనీసం రూ.200 అధికంగా చెల్లిస్తే గానీ బస్తా యూరియా దొరకడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని పురుగు మందులు కొనుగోలు చేస్తేనే ఎరువులు విక్రయిస్తామంటూ వ్యాపారులు ఒత్తిడి చేస్తున్నారు.
కృత్రిమంగా సృష్టించిన యూరియా కొరతను అడ్డం పెట్టుకుని కూటమి పార్టీలకు చెందిన నేతలు నల్లబజార్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్క యూరియా రూపంలోనే దాదాపు రూ.200 కోట్ల మేర రైతులపై భారం మోపి కాజేసే కుట్ర జరుగుతోందని వైఎస్సార్‌సీపీ విమర్శించింది. పలుచోట్ల అక్రమంగా తరలిపోతున్న యూరియాను రైతులే పట్టుకుని పోలీసులకు అప్పగించినా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం దీన్ని బలపరుస్తోంది. కృష్ణా జిల్లాలో పట్టుబడిన యూరియాను రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్‌లోనే మార్చేసిన ఘటనలు ఈ ప్రభుత్వ నిర్వాకాలకు అద్దం పడుతున్నాయి.
సర్కారు కళ్లు తెరిపించేలా ’అన్నదాత పోరు’..
రైతాంగం డిమాండ్లపై కూటమి సర్కారు దిగి వచ్చేలా అన్నదాత పోరును వైఎస్సార్‌సీపీ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనుంది. యూరియా బ్లాక్ మార్కెటింగ్‌ని అరికట్టి ఎమ్మార్పీ ధరలకే రైతులందరికీ సక్రమంగా పంపిణీ కోసం శ్రేణులు కదం తొక్కనున్నాయి. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులకు తక్షణమే ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలనే డిమాండ్‌ను గట్టిగా వినిపించనుంది. టమాట, ఉల్లి, చీనీ, బొప్పాయితో పాటు రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేయనుంది. వైఎస్సార్‌సీపీ హయాంలో మాదిరిగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడంతోపాటు మార్కెట్‌లో పోటీ పెంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని గళమెత్తనుంది.
ప్రైవేట్ వ్యాపారులతో ప్రభుత్వం సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ఒప్పించి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేయనుంది. ఈ క్రమంలో రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ అన్నదాత పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈనెల 6న తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో, 7న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ, 8న మండల కేంద్రాల్లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు.
ఆదుకోవాల్సింది పోయి బెదిరిస్తున్న బాబు..
ఒకవైపు యూరియా సమస్యతో అన్నదాతలు సతమతం అవుతుంటే సీఎం చంద్రబాబు వారిని బెదిరిస్తూ మాట్లాడటం, అసలు సమస్యే లేదని కొట్టిపారేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతగా క్యూలైన్లు కనిపిస్తున్నా మభ్యపుచ్చేలా, బెదిరించేలా మాట్లాడటంపై రైతులు మండిపడుతున్నారు. రైతుల ఇక్కట్లను కూడా రాజకీయం చేస్తున్న కూటమి సర్కార్‌పై రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు కేవలం అరవై శాతం మాత్రమే పంటలు సాగవుతుంటే ఇంతగా యూరియా కొరత ఎలా ఏర్పడిందన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. సీజన్‌కు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు, ఎరువుల అవసరంపై ప్రణాళికలు లేకపోవడం, సమీక్షలు నిర్వహించకపోవడం కూటమి సర్కారు బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తున్నాయి.

అన్నదాత కన్నెర్రతో కలవరం..
అన్నదాతలకు అండగా నిలవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ వైఎస్సార్ సీపీ ఆందోళనలకు సిద్ధం కావడంతో ప్రభుత్వ పెద్దల్లో గుబులు రేగుతోంది. ఇప్పటికే విఫల ప్రభుత్వం, పాలన చేతగాని సర్కారుగా ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంతో కూటమి సర్కారు పాలనను రైతన్నలు పోల్చి చూస్తున్నారు. గత ప్రభుత్వంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయడం, పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీని సకాలంలో అందించడం, సీజన్ ప్రారంభంలోనే ఆర్బీకేలు, పీఎసీఎస్‌ల ద్వారా ఎరువులను రైతు ముంగిట్లోనే అందుబాటులో ఉంచడం, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకోవడం,
అప్పుల పాలు కాకుండా అండగా నిలవడం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి అన్ని రకాల పంటలను మార్కెట్‌లో ధరలు లేని సమయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేయడం, సీఎం యాప్ ద్వారా నిరంతరం ధరలను పర్యవేక్షించడం లాంటి చర్యల ద్వారా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన మంచిని అన్నదాతలు గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఉల్లి, మినుము, చీనీ, అరటి తదితర పంటలకు మార్కెట్‌లో ధరలు పతనమైతే కూటమి సర్కారు రైతుల గోడు పట్టించుకోకుండా వదిలేయడంపై మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కారు అసమర్థ పాలనపై వైఎస్సార్‌సీపీతో కలిసి భారీ ఎత్తున కదం తొక్కేందుకు సిద్ధమమయ్యారు.