డిప్యూటీ స్పీకర్‌ వర్సెస్‌ జనసేన! | Serious allegations against DSP Jayasuriya | Sakshi
Sakshi News home page

డిప్యూటీ స్పీకర్‌ వర్సెస్‌ జనసేన!

Oct 24 2025 6:08 AM | Updated on Oct 24 2025 6:08 AM

Serious allegations against DSP Jayasuriya

కూటమిలో చిచ్చు రేపిన భీమవరం డీఎస్పీ

డీఎస్పీ జయసూర్యపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు     

భీమవరాన్ని జూదానికి హబ్‌గా మార్చారంటూ జనసేన ఫిర్యాదు

ఎస్పీతో మాట్లాడి విచారణకు ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ 

ఆ డీఎస్పీ మంచి ఆఫీసర్‌ అంటూ డిప్యూటీ స్పీకర్‌ కితాబు

డీఎస్పీ వ్యవహారంపై పశ్చిమ ఎస్పీ విచారణ ప్రారంభం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: భీమవరం డీఎస్పీ జయ­సూర్య కేంద్రంగా కూటమి పార్టీలో చిచ్చురే­గింది. జయసూర్య తీవ్ర అవినీతి పాల్పడ్డారని, పేకాటను ప్రొత్సహిస్తూ ప్రైవేటు సెటిల్‌మెంట్లు భారీగా చేస్తున్నాడని జనసేన నేతల ఫిర్యాదుల ఆధారంగా ఉప ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించిన విష­యం తెలిసిందే. దీనికి కౌంటర్‌గా డిప్యూటీ స్పీకర్‌ రఘరామకృష్ణరాజు.. జయసూర్య మంచి ఆఫీసర్‌ అంటూ కితాబివ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది. పశ్చిమలో పేకాట సహజమని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. 

మరోవైపు ప్రభుత్వ ఆదేశా­లతో డీఎస్పీ జయసూర్యపై విచారణ నిర్వహిస్తు­న్నామని జిల్లా ఎస్పీ నయీం అస్మీ ప్రకటించారు. ఎవరైనా వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, లేదంటే స్వయంగా కలిసి ఫిర్యాదు చేసినా తీసుకుంటామని చెప్పారు. అన్ని అంశాలను విచారించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. 

ఆధిపత్య పోరేనా!
భీమవరం డీఎస్పీ వ్యవహారం రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరుగా మారింది. గతంలో భీమవరం సబ్‌ డివిజన్‌లో భీమవరం రూరల్, భీమవరం టూటౌన్‌ సీఐగా జయ సూర్య సుదీర్ఘ కాలం పని చేశారు. ఈ క్రమంలో పేకాట క్లబ్‌లు, కోడి పందాల నిర్వాహకులు, క్రికెట్‌ బుకీలు, రియల్‌ ఎస్టేట్‌ సెటి­ల్‌­మెంట్‌ ముఠాలు.. ఇలా అన్నింటిపైన పూర్తి అవ­గాహనతో పాటు వ్యక్తిగతంగా పరిచయాలు­న్నా­యి. 

ఉండి నియోజక­వర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ రఘురామ­కృష్ణరాజు ద్వారా డీఎస్పీగా భీమవరం సబ్‌ డివిజన్‌కు వచ్చిన జయసూర్య తొలుత భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇద్దరితోనూ రెండు పార్టీల కేడర్‌తోనూ సత్సంబంధాలు కొన­సాగించారు. తన­కున్న వ్యక్తిగత పరిచయాల ద్వారా క్లబ్‌లు మొదలు­కొని కోడి పందాల వరకు అన్నింటిలో ప్రత్యక్ష జోక్యం చేసుకున్నా­రనే ఆరోపణ­లున్నాయి. 

ఈ క్రమంలో భీమవరం జూదానికి హబ్‌గా మారిందని విస్తృత ప్రచారం జరగడం, పత్రికల్లో వరుస కథ­నాలు రావడంతో భీమవరంలో పేకాటను కొద్దిగా కట్టడి చేసినట్లు హడావుడి చేసి వ్యవహారం సద్దు­మణి­గేలా చేశారు. ఇదే సమయంలో భీమవరంలో తగ్గించి ఉండి నియోజకవ­ర్గంలో కోడి పందాలు, పేకాట, క్రికెట్‌ బెట్టింగులు ఇలా అన్నింటికి డీఎస్పీనే గేట్లు ఎత్తారనే ఆరోపణ­లు­న్నాయి. 

ఈ పరిణామాల క్రమంలో కొద్ది నెలల క్రితం డీఎస్పీపై కూటమిలో ఓ వర్గం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి, బదిలీ చేయించింది. అయితే డిప్యూటీ స్పీకర్‌ రఘు­రామకృష్ణ­రాజు ఒత్తిడి తేవడంతో బదిలీ నిలిచి­పో­యిందని ప్రచా­రం సాగు­­తోంది. దీంతో డీఎస్పీ పూర్తిగా రఘు­రామ­కృష్ణరాజు­కు అనుకూ­లంగా మారి, ఉండిలో అసాంఘిక కార్య­క్ర­మా­లకు పూర్తి స్థాయి­లో సహక­రి­ంచడంతో పాటు ఏక­పక్షంగా వ్యవ­హరించారనే రోపణలొచ్చాయి.డీఎస్పీపై ప్రభుత్వానికి ఫిర్యాదులు ఇలా..

» భీమవరం రూరల్‌ పరిధిలో ఓ రొయ్యల వ్యాపారికి సంబంధించి రూ.8 కోట్ల డబ్బు పంచాయితీ చేశారని ఆరోపణలున్నాయి. 

» గతంలో సీఐగా ఉన్నప్పుడు తన వ్యక్తిగత స్నేహితుడిగా ఉన్న పేకాటరాయుడి కోసం భీమవరం–నరసాపురం మార్గంలో పేకాట శిబిరం ఏర్పాటు చేయించి వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. 

» భీమవరంలో కీలక క్రికెట్‌ బుకీ నుంచి రూ.లక్షల్లో తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. జనసేన రాష్ట్ర ప్రొటోకాల్‌ చైర్మన్‌ మల్లినేని బాబి భీమవరంలో రియల్‌ ఎస్టేట్, బిల్డర్‌గా ఉన్నాడు. బాబికి సంబంధించి ఓ సెటిల్‌మెంట్‌లో భారీగా వసూలు చేశాడని, ఓ విద్యా సంస్థ, ఒక ప్రైవేటు సంస్థ సెటిల్‌మెంట్‌లోనూ భారీగా వసూలు చేశారని తేలింది. 

» రికవరీలు బాగా చేస్తారని పేరుంది. ఆ ముసుగులో చేయాల్సింది చేసి, ట్రాక్‌ రికార్డు కోసం నామమాత్రంగా కేసులు నమోదు చేస్తుంటారు. ఈ  వ్యవహారాలన్నీ భీమవరంలోని ఒక సీఐ చూసుకుంటారు. ఆ సీఐ.. డీఎస్పీకి షాడోగా వ్యవహరిస్తూ.. ఆర్థిక వ్యవహారాల్లో కీలకంగా ఉంటారనేది జనసేన నేతల ఫిర్యాదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement