కాడి వదిలి రోడ్డెక్కి.. | Farmers Ready For Annadata Poru All Over Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కాడి వదిలి రోడ్డెక్కి..

Sep 9 2025 5:10 AM | Updated on Sep 9 2025 5:15 AM

Farmers Ready For Annadata Poru All Over Andhra Pradesh

ఎన్టీఆర్‌ జిల్లా గుళ్లపూడిలో యూరియా కోసం నిరీక్షించలేక క్యూలైన్‌లో చెప్పులు ఉంచిన రైతులు

బస్తా యూరియా కోసం పొలం పనులు వదిలేసి రైతన్నల అగచాట్లు

అదునులో యూరియా కరువు.. పంటలకు ‘మద్దతు’ లేదు

ఆందోళనలో అన్నదాతలు.. అప్పులు పాలై ఆత్మహత్యలు

తొలి ఏడాది అన్నదాత సుఖీభవకు ఎగనామం

రెండో ఏడాదీ అరకొరే.. అటకెక్కిన ఉచిత పంటల బీమా 

నిమ్మకు నీరెత్తినట్టు కూటమి సర్కార్‌

నేడు రాష్ట్రవ్యాప్తంగా ‘అన్నదాత పోరు’లో కదం తొక్కేందుకు రైతన్నలు సిద్ధం

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగానే ‘వ్యవసాయాన్ని దండగ’గా మార్చేస్తున్నారు! పొలం పనుల్లో కోలాహలంగా కనిపించాల్సిన రైతన్నలు రోడ్డెక్కి ఆక్రోశిస్తున్నారు! పంట కాపాడుకునేందుకు నోరు విప్పి ఎరువులు అడుగుతుంటే సంఘ విద్రోహ శక్తుల మాదిరిగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు!  

టీడీపీ కూటమి సర్కారు పాలనలో వ్యవసాయ రంగం కుదేలవుతోంది. అన్నదాత అధోగతి పాలవుతున్నాడు. ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించి రైతులు పండించిన పంటలకు భద్రత లేకుండా చేశారు. తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టారు. విత్తు నుంచి విక్రయం వరకు ఐదేళ్ల పాటు రైతులకు అండగా నిలిచిన ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. నాన్‌ సబ్సిడీ విత్తనాల సరఫరాను నిలిపివేశారు. 

సబ్సిడీ విత్తనాల్లో కోత పెట్టి అందకుండా చేశారు. అదునులో యూరియా ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒక్క కట్ట కోసం తిండి తిప్పలు మానుకుని క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి కలి్పంచారు. ధాన్యం నుంచి టమాటా వరకు, మిరప నుంచి మామిడి, బత్తాయి వరకు కనీసం మద్దతు ధర దక్కకపోవడంతో అన్నదాతలు హతాశులయ్యారు. 

ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను కొనేవారు లేక.. అప్పులు తీర్చే దారి లేక.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతుంటే కావాలనే నాటకాలు ఆడుతున్నారంటూ ప్రభుత్వ పెద్దలు నిస్సిగ్గుగా ఎదురు దాడి చేస్తున్నారు. 

ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో.. యూరియా దొరక్క, మద్దతు ధర కరువై అల్లాడుతున్న అన్నదాతలకు వైఎస్సార్‌ సీపీ బాసటగా నిలుస్తోంది. రైతన్నలతో కలసి పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అన్నదాత పోరు’లో పెద్ద ఎత్తున పాల్గొని సత్తా చాటేందుకు సిద్ధమైయింది.  

ఆంక్షలతో ‘కట్ట’డి..  
రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా యూరియా కట్ట కోసం రైతులు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. సీజన్‌ ఆరంభంలోనే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు దారి మళ్లించడంతో ప్రస్తుతం యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది. అదునులో యూరియా అందక వరి, మొక్కజొన్న రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కట్ట.. అరకట్ట అంటూ రేషన్‌ సరుకుల మాదిరిగా విదిలిస్తుండటంతో గత్యంతరం లేక ప్రైవేట్‌ వ్యాపారుల చేతిలో దోపిడికీ గురవుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో రెట్టింపు ధరలకు అమ్ముతుంటే కొరడా ఝళిపించాల్సిన సర్కారు కళ్లుమూసుకుంది.

ఏ పంటకూ కనీస మద్దతు ధర లేదు..
గడిచిన ఏడాదిగా ధాన్యం మొదలు టమాటా వరకు, మిర్చి నుంచి పొగాకు దాకా ఏ పంట చూసినా మార్కెట్‌లో గిట్టుబాటు ధర కాదు కదా.. కనీసం మద్దతు ధర కూడా దక్కక, పెట్టుబడి ఖర్చులు కూడా రాక అన్నదాతలు అల్లాడుతున్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీమ్‌తో వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేసి ధరలు పతనం కాకుండా అడ్డుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. 

మద్దతు ధర దక్కక పోవడంతో గడిచిన ఏడాదిలో రైతులకు రూ.50 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. చేసిన అప్పులు తీర్చే దారిలేక గడిచిన 15 నెలల్లో దాదాపు 250 మంది రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకుండా పోయింది. వరి, మిరప, మామిడి రైతులను ముంచినట్లే ఉల్లి రైతులనూ కూటమి ప్రభుత్వం మంచేస్తోంది. 

ధర లేక మిరప రైతులు గగ్గోలు పెడితే క్వింటా రూ.11,781 చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పి చివరికి మొండిచేయి చూపింది. తోతాపురి మామిడిని కిలో రూ.12 చొప్పున తామే కొంటామని చెప్పిన ప్రభుత్వం చివరికి రూ.4 సబ్సిడీ రూపంలో అందిస్తామని నమ్మబలికి మోసం చేసింది. అదే రీతిలో ఉల్లి క్వింటాల్‌ రూ.1,200 చొప్పున కొంటామని మభ్యపుచ్చి కొనుగోళ్ల ప్రక్రియను మూణ్ణాళ్ల ముచ్చటగా మార్చేసింది. 

తాజాగా మార్కెట్‌–మద్దతు ధరలకు మధ్య వ్యత్యాసం మొత్తాన్ని జమ చేస్తామంటూ కొత్త పల్లవి అందుకుంది. ప్రస్తుతం కర్నూలు మార్కెట్‌ యార్డులో మూడో వంతు సరుకును నాణ్యత లేదనే సాకుతో తిరస్కరిస్తుండగా మిగిలిన ఉల్లిని క్వింటా రూ.100–600కి మించి వ్యాపారులు కొనడం లేదు.  

ఏలూరు డీసీఎంఎస్‌ వద్ద ఎరువుల కోసం బారులు తీరిన రైతులు  

ఎటుచూసినా రైతుల ఆందోళనలు, ఆక్రందనలే..
గిట్టుబాటు ధర లేక బత్తాయి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో టన్ను రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు పలికిన బత్తాయి ప్రస్తుతం అధఃపాతాళానికి పడిపోయింది. పులివెందుల మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక సోమవారం రైతులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

క్వాలిటీ ఉన్న బత్తాయికి వేలం పాట నిర్వహించగా, గరిష్టంగా 5 శాతం కాయలకు టన్ను రూ.14,200 పలుకగా, నాణ్యత లేని కాయను రూ.5 వేల నుంచి రూ.8 వేల మధ్య మాత్రమే కొనుగోలు చేశారు. అనంతపురంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అక్కడ కాస్త క్వాలిటీ బాగున్న 5–10 శాతం కాయలకు  టన్ను రూ.16,500 లభించగా నాణ్యత లేదనే సాకుతో మిగిలిన పంటకు సగటున రూ.6 వేల నుంచి రూ.7 వేల మధ్య లభించింది. 

గతంలో ఎప్పుడూ ఇంత కనిష్ట స్థాయికి ధరలు పడిపోలేదని, ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ బత్తాయి రైతులు గత వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు టమాటా రైతులు సైతం మద్దతు ధర లేక పంటను చేలల్లోనే పశువులకు మేతగా వదిలేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది.
కృష్ణా జిల్లా కురుమద్దాలి రైతు భరోసా కేంద్రం వద్ద యూరియా కోసం రైతుల పడిగాపులు   

15 నెలల్లో రూ.23,584 కోట్లు ఎగ్గొట్టారు..!  
అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్‌ సిక్స్‌లో చంద్రబాబు హామీ ఇచ్చారు. వాస్తవంగా ఏటా రూ.10,716 కోట్ల చొప్పున రెండేళ్లకు రూ.21,432 కోట్లు జమ చేయాల్సి ఉండగా, తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం రెండో ఏడాది  అరకొరగా విదిల్చింది. పీఎం కిసాన్‌తో కలిపి రూ.26 వేల చొప్పున ఇవ్వాల్సి ఉండగా, ఈ ఏడాది తొలివిడతగా రూ.5 వేల చొప్పున రూ.2,342.92 కోట్లతో సరిపెట్టారు. 

మరొక పక్క 2023–24 సీజన్‌కు సంబంధించి రూ.930 కోట్ల మేర రైతుల వాటా ప్రీమియం సొమ్ములు చెల్లించకపోవడంతో.. ఆ సీజన్‌లో కరువు వల్ల పంటలు దెబ్బతిన్న దాదాపు 11 లక్షల మంది రైతులకు రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందకుండా చేశారు. ఇక 2024–25 ఖరీఫ్‌లో 833.92 కోట్లు, రబీలో రూ.88.09 కోట్లు ఇప్పటి వరకు కంపెనీలకు జమ చేయకపోవడంతో రైతులకు రూ.2 వేల కోట్లకుపైగా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో యూరియా కోసం క్యూ కట్టిన  రైతులు    

ఇంకోవైపు కరువు ప్రభావంతో పంటలు దెబ్బతిన్న 3.91 లక్షల మంది రైతులకు  రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు ఎగ్గొట్టారు. సున్నా వడ్డీ రాయితీ  కింద ఖరీఫ్‌–2023 సీజన్‌కు సంబంధించి 6.31 లక్షల మందికి రూ.132 కోట్ల వరకు జమ చేయలేదు. పంట నష్ట పరిహారం కింద 4.50 లక్షల మంది రైతులకు మరో రూ.650 కోట్లు ఎగ్టొట్టారు. 

ఇలా ఏడాదిలో అన్నదాతా సుఖీభవ, పంటలబీమా, పంట నష్టపరిహారం, కరువు సాయం, సున్నా వడ్డీ రాయితీ బకాయిలు వెరసి మొత్తం దాదాపు రూ.23,584 కోట్లకుపైగా చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టింది! అయితే.. మద్దతు ధర లేక రైతులు నష్టపోయిన మొత్తానికి అంతే లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement