లిక్కర్ షాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ షాపులు నడిపేది బాబు మనుషులే
నకిలీ మద్యం రాకెట్‌ను సాక్ష్యాధారాలతో ఎండగడుతూ నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
రాష్ట్రంలో రోజూ లక్షల బాటిళ్లలో నకిలీ మద్యం మార్కెట్‌లోకి చేరుతోంది. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒక బాటిల్ నకిలీ మద్యం ఉంది. లిక్కర్ మాఫియా షాపుల్లో, వాళ్ల బెల్ట్ దుకాణాల్లో, ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లలో నకిలీ మద్యాన్ని అమ్మేస్తున్నారు. ఇంత వ్యవస్థీకృత పద్ధతిలో తయారు చేయడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్ అంతా వాళ్ల ఆధీనంలోనే నడుస్తోంది. ఇంత ఆర్గనైజ్డ్‌గా క్రైమ్ చేయడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సొంతం. ఆయన కొడుకు లోకేశ్ కూడా ఏమాత్రం తక్కువ తిన్నోడు కాదు.
కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నకిలీ మద్యం తయారు చేస్తూనే ఉన్నారు. డబ్బుల దగ్గర తగాదాలు వచ్చి బయట పడడంతో ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఆయనకు డైవర్షన్ పాలిటిక్స్ అలవాటే. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి ఆయన ఫ్లాష్ బ్యాక్ చూస్తే.. చేసేది ఆయనే, నెపాన్ని వేరేవాళ్ల మీదకు నెట్టేదీ ఆయనే.. దానికి వత్తాసు పలికేది ఇదే ఎల్లో మీడియా.. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా.. ఇదే మోడస్ ఆపరెండా వీళ్లది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నకిలీ మద్యం మాఫియాను వ్యవస్థీకృతం చేసి, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తూ.. మీ జేబులు నింపుకోవడానికి దిగజారిపోయారంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా చిన్నపాటి నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు కన్పిస్తున్నాయని ఎత్తి చూపారు.
నకిలీ మద్యం తయారు చేసేది, సరఫరా చేసేది.. షాపులు, అక్రమ (ఇల్లీగల్) పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ షాపుల్లో విక్రయించేది చంద్రబాబు మనుషులేనని.. ఇలాంటి మాఫియాను ప్రపంచ చరిత్రలో ఎక్కడా చూసి ఉండరన్నారు. వాటాల పంపిణీలో తేడా రావడంతోనే నకిలీ మద్యం ఉదంతం బయటకొచ్చిందన్నారు. ఈ తరహా వ్యవస్థీకృత నేరం చేయడం చంద్రబాబుకే సాధ్యమని.. ఆయన కొడుకు లోకేశ్ కూడా ఏమాత్రం తక్కువ కాదంటూ దెప్పి పొడిచారు. నేరం చేసిన చంద్రబాబు.. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి నింద మరొకరిపై వేస్తున్నారంటూ మండిపడ్డారు.

నకిలీ మద్యం కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయిస్తే తమ మూలాలన్నీ బయట పడతాయనే భయంతోనే.. తన మాఫియాలో భాగస్వామి అయిన విజయవాడ సీపీ రాజశేఖర్ నేతృత్వంలోని సిట్ విచారణకు ఆదేశించారంటూ తూర్పారబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సాక్ష్యాధారాలను చూపుతూ నకిలీ మద్యం మాఫియా అరాచకాలను ఏకిపారేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
ఎక్కడ చూసినా నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలే
» రాష్ట్రంలో వ్యవస్థీకృత పద్ధతిలో నకిలీ (ఇల్లిసిట్, స్పూరియస్) మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇలాంటి మాఫియాను ప్రపంచ చరిత్రలో ఎక్కడా చూసి ఉండం. ఎక్కడ చూసినా చిన్నపాటి నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం తయారు చేసి.. వాళ్ల మాఫియా లిక్కర్ షాపుల ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు.
» ఈ ప్రభుత్వంలో మద్యం దుకాణాలు నడుపుతున్న వారందరూ టీడీపీ వాళ్లే. ఈ ప్రైవేటు మాఫియా నకిలీ మద్యాన్ని తయారు చేస్తుంది. వాళ్ల షాపుల ద్వారానే అమ్మకాలు సాగిస్తుంది. గ్రామాల్లో ఏకంగా వేలం వేసి బెల్ట్ షాపులు పెట్టి, వాటికి పోలీస్ రక్షణ ఇచ్చి మరీ మద్యం అమ్మకాలకు ఈ మాఫియా శ్రీకారం చుట్టింది. బెల్ట్ షాపులే కాకుండా ఏకంగా అనధికారిక పర్మిట్ రూమ్‌ల ద్వారా కూడా నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు.
» ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తూ.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతోంది ప్రభుత్వం. అధికార పార్టీ నాయకులు సొంత జేబులు నింపుకునేందుకు దిగజారిపోయారు. డబ్బుల కోసం నకిలీ మద్యం తయారు చేసి, విచ్చలవిడిగా విక్రయాలు చేస్తూ దొరికిపోయారు.
నిత్యం మార్కెట్‌లోకి లక్షల బాటిళ్లలో నకిలీ మద్యం
» వాటాల్లో తేడా రావడంతో నకిలీ మద్యం ఉదంతం బయటకొచ్చింది. ఒక్క ములకలచెరువులోనే 20,208 బాటిళ్లలో నింపిన నకిలీ సరుకు దొరికింది. మరో 8,166 బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు. 30 క్యాన్లలో సిద్ధం చేసిన 1,050 లీటర్ల స్పిరిట్ లభ్యమైంది. ఇవన్నీ కూడా వాడుకుంటే మరికొన్ని వేల బాటిళ్ల నకిలీ మద్యం మార్కెట్‌లోకి వచ్చేది.
» అంతేకాదు.. ఏ పోలీస్ కమిషనర్ అయితే చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్నాడో, ఏ పోలీస్ కమిషనర్ అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వారిని వేధిస్తున్నాడో.. అదే విజయవాడ సీపీ పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయట పడింది. ఇబ్రహీంపట్నంలో దాదాపు 27,224 బాటిళ్లు దొరికాయి.
» అనకాపల్లి జిల్లా పరవాడలో, అమలాపురంలో, పాలకొల్లులో, ఏలూరులో, రేపల్లెలో, నెల్లూరులో ఇదే మాదిరిగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్లు నకిలీ మద్యం తయారు చేసి, వాళ్ల డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా ప్రైవేట్ మాఫియా మద్యం షాపుల్లోకి, బెల్ట్ షాపులకు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లకు అమ్మి సొమ్ము చేసుకున్నారు.
సిట్ పేరుతో తప్పుడు విచారణ
చంద్రబాబే నేరాలు చేస్తారు. అది బయట పడేసరికి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు దొంగల ముఠా ఎల్లో మీడియా సిద్ధం అవుతుంది. అంతా ఆర్కె్రస్టెటెడ్ (తానా తందానా)గా ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించడం కోసం.. అబద్ధాన్ని వందసార్లు చెబుతారు. టాపిక్ డైవర్షన్‌లో భాగంగా ఎదుటి వారిపై బురదజల్లుతారు. వాళ్లే కొత్త కొత్త ఆరోపణలు చేస్తారు. ఆ ఆరోపణలను నిజం చేయాలనే తాపత్రయంతో ఒక సిట్ కూడా వేస్తారు. తప్పుడు విచారణ చేస్తారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై కూడా ముద్ర వేసేస్తారు. తప్పుడు ప్రచారం చేస్తూ వారిని కూడా జైళ్లకు పంపిస్తారు.
మాఫియాలోని వారంతా చంద్రబాబు మనుషులే
» నకిలీ మద్యం వ్యవహారం వెనుక ఉన్నది చంద్రబాబు మనుషులే. తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జ్, టీడీపీ అభ్యరి్థగా పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి. చంద్రబాబు ఆయనకు బీ ఫామ్ ఇస్తున్న ఫొటోలో పక్కనే ఉన్న మరో వ్యక్తి జనార్దనరావు. లోకేశ్, చంద్రబాబుతో ఉన్న మరో వ్యక్తి సురేంద్రనాయుడు (ఫొటోలు చూపారు). ఇదంతా ఒక మాఫియా.
» ఇదే జనార్దన్‌రావు విదేశాల్లో ఉండగానే 2 రోజుల్లో వచ్చి లొంగిపోతాడంటూ వీళ్లే సుతిమెత్తగా ఎల్లో మీడియాలో లీకులిచ్చారు. వాళ్లదంతా హాట్ లైన్ కదా! అంటే, ముందుగానే జనార్దన్‌రావుతో వీళ్లు మాట్లాడుకోవడం, ఆ వెంటనే ఆ జనార్దన్‌రావు రెండున్నర సంవత్సరాల కిందట నుంచే ఈ వ్యవహారం జరుగుతోందని చెప్పడం పూర్తిగా ఒక స్కెచ్.
» తంబళ్లపల్లెలో టీడీపీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డి మీద ఒక బ్రాండింగ్. ఆయన పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడట! వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టారట! ఈ బ్రాండింగ్‌కు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తానా తందానా అంటాయి. దీనిపై టీడీపీ నుంచి ట్వీట్ వస్తుంది. ఆ తర్వాత ఈ వ్యవహారానికి ఏకంగా ఆఫ్రికాలో మూలాలు ఉన్నాయంటూ బిల్డప్ ఇస్తారు.
» అక్కడితో ఆగిపోకుండా చంద్రబాబు బరితెగించి, అధికార దుర్వినియోగానికీ పాల్పడ్డారు. ఐవీఆర్‌ఎస్ కాల్ సెంటర్‌ను ఉపయోగించుకుని తన మాఫియాలోని వ్యక్తి జనార్దన్‌రావు ద్వారా వీడియో చేయించి, ఆ వీడియోలో జోగి రమేష్ పేరు చెప్పించి.. ఆ వాయిస్‌కు మరికొన్ని వక్రీకరణలు జోడించి ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా ఏకంగా జనార్దన్‌రావు ఫోన్లో చాట్స్ పేరుతో జోగి రమేష్ ను ఇరికించే ప్రయత్నం చేస్తోంది. నకిలీ మద్యం తయారు చేసి, సరఫరా చేస్తూ.. అమ్మకాలు సాగిస్తున్న వీళ్లే ఎదుటి వారిపై బురదజల్లుతూ కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ చేస్తున్నారు.
ఇవిగో ఆధారాలు.. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు
» అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు ఫ్యాక్టరీలో లభ్యమైన నకిలీ మద్యం బాటిళ్లు (చూపారు) ఇవి. ఇక్కడ ఫ్యాక్టరీలో మెషీన్లకు పూజ చేసి మరీ నకిలీ మద్యం పకడ్బందీగా తయారు చేస్తున్నారు. బాటిళ్లు, స్టాంప్స్, లేబుళ్లు, ప్యాకింగ్, రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం మెటీరియల్ ఇది (చూపారు).
» కేరళ మాల్ట్, ఓల్డ్ అడ్మిరల్, మంజీరా బ్లూ, క్లాసిక్ బ్లూ, ఇంకో బాటిల్‌కు లేబుల్ అంటించలేదు. ఏఎన్‌ఆర్ రెస్టారెంట్ అండ్ బార్.. ఇది వాళ్ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్. షాపులకు ఒకరు నాగేశ్వరరావు పేరు, ఇంకొకరు ఎన్టీఆర్ పేరు పెట్టుకుంటారు.
» అనకాపల్లి జిల్లా పరవాడలో చిన్న సైజ్ నకిలీ మద్యం ఫ్యాక్టరీ. అవే స్టిక్కర్లు, లేబుళ్లు, బాటిళ్లతో తయారు చేస్తున్నారు. ఇక్కడ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సన్నిహితుడు రుత్తల రాము నకిలీ మద్యంలో కీలక సూత్రధారి. అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరు ఇలా అన్ని చోట్ల ఒకే రకమైన సీన్ కనిపిస్తోంది. ప్రతి చోటా నకిలీ మద్యం బాటిళ్లు, మెషీన్లు, కార్టన్లు, లేబుళ్లతో సహా దొరికాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నాలుగైదు మద్యం బాటిళ్లలో ఒకటి నకిలీ.
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు బాబూ..
» నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరెన్ని షాపుల్లో తనిఖీలు చేశారు? ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్లు పట్టుకున్నారు. ఏయే షాపుల్లో గుర్తించారు? ఒక్కదానిలో కూడా తనఖీలు లేవు. ఎందుకంటే అన్నీ వాళ్ల షాపులే. పట్టుకుంటే అన్ని చోట్ల నకిలీ మద్యం దొరుకుతుందనే తనిఖీలు ఉండవు.
» జనార్దన్‌రావు విదేశాల నుంచి దర్జాగా వచ్చాడు. అసలు జనార్దన్‌రావు అనే మనిషి వీడియోలో ఎలా మాట్లాడాడు? ఆ వీడియోను ఎలా బయటకు పంపగలిగారు? తన ఫోన్ పోయింది అని చెప్పిన జనార్దన్‌రావు ఇవన్నీ ఎలా చేశాడు? ఆ ఫోన్ నుంచి తప్పుడు, ఫ్యాబ్రికేటెడ్ స్క్రీన్ షాట్స్ తీయడం ఎలా సాధ్యం? అవన్నీ ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, టీడీపీ సోషల్ మీడియాలో రావడం ఎలా సాధ్యం?

» నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబర్ 3న బయట పడితే ఇవాల్టికి 20 రోజులైంది. ఇప్పటి వరకు మీ పార్టీ బీఫామ్‌పై పోటీ చేసిన జయచంద్రారెడ్డిని ఇంత వరకు ఎందుకు అరెస్టు చేయలేదు? అతని పాస్‌పోర్టు ఎందుకు సీజ్ చేయలేదు? అతను పెద్దిరెడ్డికి సన్నిహితుడు అయితే మీరు ఎందుకు టికెట్ ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకనాథరెడ్డిపై పోటీ పెట్టారు? జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నాయని ఎలక్షన్ అఫిడవిట్లో రాశాడు. ఆ రోజు చంద్రబాబుకు ఆఫ్రికా మూలాలు కనిపించ లేదా? టిష్యూ పేపర్‌కు తక్కువ.. బాత్‌రూమ్ పేపర్‌కు ఎక్కువైన ఈనాడుకు కనిపించలేదా?
» పాలకొల్లులో కల్తీ మద్యం ఎవరిది? అక్కడ వాళ్లకేం ఆఫ్రికా లింకులు లేవు కదా? పోనీ ఏలూరులో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? అమలాపురంలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? అనకాపల్లి పరవాడలో నకిలీ మద్యం తయారు చేస్తూ పట్టుబడ్డ రుత్తల రాము స్పీకర్‌కు సన్నిహితుడు. రాముకు ఆఫ్రికాతో సంబంధాలున్నాయా? అక్కడి నుంచి స్పిరిట్ వస్తోందా? వీళ్లు కొంటున్నారా?
» ఏలూరు జిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడిపై డజన్ల కొద్దీ కేసులున్నాయి. అతను మహిళలని కూడా చూడకుండా అధికారుల్ని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని కూడా పోతాడు. అంత గొప్ప నాయకుడు దగ్గరుండి లిక్కర్ మాఫియా నడుపుతున్నాడు. మరో పేకాట కింగ్ రేపల్లె నుంచి డార్లింగ్ మంత్రి అని కూడా అప్పుడప్పుడు రాధాకృష్ణ ముద్దుగా అంటుంటాడు. నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది మీ (చంద్రబాబు) మనుషులు కాదా? వాటిని షాపులకు సరఫరా చేసి విక్రయాలు చేస్తోందీ మీ వాళ్లు కాదా?
ఇది దొంగ చేతికి తాళం ఇవ్వడం కాదా?
మద్యం విక్రయాల సమయంలో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు ఉన్నవన్నీ టీడీపీ నాయకులవే కదా.. పర్మిట్ రూమ్‌లలో లూజ్ లిక్కర్ విక్రయించేది వాళ్లే. నకిలీ లిక్కర్ దందా మొత్తం వాళ్ల కార్యకర్తలదే. ఇదంతా సిండికేట్ మాఫియా కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇప్పుడు చంద్రబాబు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే బాధ్యతలు వాళ్లకే ఇస్తున్నాడు.
అంటే దొంగ చేతికే తాళాలు ఇవ్వడం అన్నమాట. పభ్రుత్వం అమ్మే మద్యంలో 40 శాతం బెల్ట్ షాపుల ద్వారా, మరో 40 శాతం ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లలో అమ్ముతున్నారు. అక్కడే కూర్చోబెట్టి గ్లాసుల్లో పోసి తాగిస్తున్నారు. ఎమ్మార్పీ రేటు గాలికెగిరిపోయింది. ఏం పోస్తున్నారో, ఏం తాగుతున్నారో అర్థం కాదు. మూడో రౌండ్ నాలుగో రౌండ్ కి వచ్చేసరికి ఐదో రౌండ్‌లో ఏం పడుతుందో తెలియదు. ప్రాణాలకు హాని కలిగించే లిక్కర్‌ని నకిలీ లేబుల్స్ వేసి అమ్మేస్తున్నారు.
వైఎస్సార్ సీపీ హయాంలోనేక్యూ ఆర్ కోడ్
వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేవి. లాభాపేక్ష అప్పటి మా ప్రభుత్వానికి లేదు. అందుకే బెల్ట్ షాపులు రద్దు చేశాం. మద్యం షాపుల సంఖ్య తగ్గించాం. మద్యం షాపుల వేళలు కూడా కుదించాం. పర్మిట్ రూమ్‌లు ఎత్తేశాం. పారదర్శక వ్యవస్థ కోసం క్యూ ఆర్ కోడ్ స్కాన్ సిస్టం తీసుకొచ్చాం. ప్రతి బాటిల్‌ను స్కాన్ చేసి అమ్మేవాళ్లం. ఎంప్యానల్డ్ డిస్టిలరీల నుంచి మాత్రమే లిక్కర్ వచ్చేది. ఆ ఎంప్యానెల్డ్ డిస్టిలరీలు కూడా గతంలో చంద్రబాబు అనుమతులిచ్చినవే. రూ.వందల కోట్లు ఖర్చు చేసి డిస్టిలరీలు పెడితే వాటిలో నాణ్యమైన మద్యం తయారు చేస్తారు.
ఆ క్వాలిటీ మద్యానికి క్యూఆర్ కోడ్ పెట్టి ట్రేస్ చేసి ప్రభుత్వ షాపుల్లో ప్రభుత్వమే అమ్మితే, మద్యం ప్రియుల ఆరోగ్యానికి కొద్దొగొప్పో గ్యారెంటీ ఉండేది. కానీ ఈ రోజు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ విచ్చలవిడిగా నకిలీ మద్యం అమ్మేస్తున్నారు. ఒకవైపున ఎమ్మార్పీ ధరల కన్నా ఎక్కువగా బెల్ట్ షాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లలో అమ్మడం కళ్లముందే కనిపిస్తోంది. మరోవైపు నకిలీ, కల్తీ మద్యాన్ని తాగిస్తున్నారు. వీళ్లకు కావాల్సిన వాటికి మాత్రమే గవర్నమెంట్‌కి డబ్బులు కట్టి సప్లై చేస్తున్నారు.
జోగి రమేష్ ను ఇరికించే కుట్ర
నకిలీ మద్యం కుంభకోణం నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు మా నాయకుడు జోగి రమేష్‌పై ఆరోపణలు చేశారు. పన్నెండేళ్ల కిందట ఎప్పుడో దిగిన ఫొటోను చూపిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అసలు జనార్దన్‌రావుతో సత్సంబంధాలు లేవని, తన ఫోన్ చెక్ చేసుకోమని జోగి రమేష్ చాలెంజ్ చేస్తున్నాడు. పరిచయం లేని వ్యక్తితో చాటింగ్ చేసినట్టుగా.. ఫోన్ పోయిందని చెబుతున్న జనార్దన్‌రావు ఫోన్ నుంచి చాటింగ్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ చాట్స్‌ను కూడా ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు.

జోగి రమేష్ సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తే జనార్దన్‌రావు ఫోన్ పోయిందని ఆయనే కంప్లైంట్ ఇచ్చాడు. ఫోన్ లేదు కదా అని చెబుతున్నారు. కానీ ఈ లోపల డైవర్షన్ పాలిటిక్స్‌లో డ్యామేజ్ చేసేది చేస్తున్నారు కదా. ఇది వ్యక్తిత్వ హననం కాదా? నువ్వు చేసింది ఒక వెధవ పని. ఆ వెధవ పనిలో టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఇంకో మనిషి మీద అభాండాలు వేయడం, లేని ఆధారాలు పుట్టించడం అన్యాయం కాదా? మొన్న అక్రమ లిక్కర్ కేసులో ఒకర్ని ఇరికించేందుకు వీళ్ల డబ్బులు రూ.11 కోట్లు తీసుకునిపోయి అక్కడ పెట్టి స్కాం జరిగిందని ప్రచారం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆ నోట్ల మీద ఉన్న నెంబర్ల ఆధారంగా ఎవరి ఖాతా నుంచి డ్రా చేశారు, ఎప్పుడు డ్రా చేశారు అనేది తెప్పించమని కోర్టులో కేసు ఫైల్ చేసి, ఆర్బీఐకి లేఖ రాశారు.
ఆ తర్వాత ఇక మాటల్లేవ్. ఎక్కడైనా రూ.11 కోట్ల డబ్బులు దొరికితే పక్కన పెడతారు. వీళ్లు మిగతా డబ్బుతో కలిపేశామని చెప్పారు. అలా ఎలా కలిపేస్తారు? అంటే, వీరే డబ్బులు తీసుకొచ్చి ఇంజినీరింగ్ కాలేజీ డొనేషన్ల డబ్బు అని బయట పడుతుందనే భయంతోనే దాన్ని కలిపేశారు. చంద్రబాబుకి సిగ్గూలజ్జా లేదు. సిగ్గన్నా ఉంటే కొంచెం సిగ్గుపడతాడని అనుకోవచ్చు. లజ్జన్నా ఉంటే కనీసం అషేమ్‌డ్‌గా ఫీలవుతాడనుకో వచ్చు. కానీ అషేమ్‌డ్‌గా ఫీలయ్యేది లేదు. సిగ్గు అంతకన్నా లేదు.


