చరిత్రలో ఇంతలా మోసం చేసిన సీఎం మరొకరు లేరు
చంద్రబాబుపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపాటు
ఎన్నికల్లో తీపి మాటలతో ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపారు
అధికారంలోకి రాగానే ఐఆర్, మంచి పీఆర్సీ ఇస్తామన్నారు
తీరా మేం వేసిన పీఆర్సీనే రద్దు చేశారు.. పీఆర్సీ చైర్మన్‌ను వెళ్లగొట్టారు
జీతాలు పెరగకుండా అడ్డుకోవడానికే కుట్రపూరితంగా పీఆర్సీ వేయడం లేదు
అప్పుడు, ఇప్పుడు అంటూ ఏకంగా నాలుగు డీఏలు పెండింగ్‌లో పెట్టారు
ఓపిక నశించి ఉద్యోగులు రోడ్డెక్కితే ఒక్క డీఏ ప్రకటించి పండగ చేసుకోమన్నారు
రిటైర్ అయ్యాక డీఏ అరియర్స్ ఇస్తామని జీవో ఇచ్చారు
పెన్షనర్లకు డీఆర్ అరియర్స్ రెండేళ్ల తర్వాత ఇస్తామన్నారు
ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ జీవోలను సవరించారు
రూ.31 వేల కోట్ల బకాయిల గురించి మాత్రం మాట్లాడరు
టీడీపీ నేతలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగులపై దాడులు చేస్తున్నారు
ఇదేంటని ప్రశ్నిస్తే పొలిటికల్ గవర్నెన్స్ అని నిర్మొహమాటంగా చెబుతున్నారు
52 వేల మంది ఆర్టీసీ, 1.35 లక్షల మంది గ్రామ–వార్డు సచివాలయ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వల్ల భారం పెరిగిందట
అంటే వీరందరిపై కన్ను పడింది.. వీళ్లను క్లీన్ చేస్తే మిగతా వాళ్లనూ నెమ్మదిగా తప్పించేయొచ్చని యోచన
ఎన్నికల హామీల అమలుపై ఉద్యోగులంతా రోడ్డెక్కిన తర్వాత చంద్రబాబు అనేక డ్రామాలు చేస్తూ ఒక్క డీఏ ప్రకటించాడు.. ఆ ప్రకటనే తప్ప.. ఇంత వరకు డీఏ ఇచ్చింది లేదు. ఫస్ట్ దసరా అన్నాడు.. తరువాత నవంబర్ అన్నాడు.. తరువాత దీపావళి అన్నాడు.. దానికి పెద్ద బిల్డప్ ఇచ్చారు. వాళ్లకు రావాల్సింది నాలుగు డీఏలు ఉంటే ఒక్క డీఏకి ఉద్యోగులంతా సంబరాలు అంటూ ప్రచారం నడిపారు. జిమ్మిక్కులు చేశారు. చివరకు ఇచ్చిన ఒక్క డీఏ అరియర్స్‌ను ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఇస్తామని జీవోలో చెప్పారు. 3.5 లక్షల మంది పెన్షనర్లకు డీఆర్ అరియర్స్ రెండేళ్ల తర్వాత ఇస్తామని ప్రకటించారు. చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు. ఉద్యోగులు కళ్లెర్ర చేస్తే ఆ జీవోలను సవరించారు.
ప్రతి నెలా 1వ తేదీన ఉద్యోగులకు ఠంఛన్‌గా జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తామన్నాడు. ఎన్నికల తర్వాత అలా ఒక్క నెల మాత్రమే ఇచ్చాడు. ఇవాళ ఏ తేదీల్లో జీతాలు వేస్తారో తెలియడం లేదు. మా ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ పరిస్థితులు ఉన్నా.. ఏ రోజూ కూడా ఉద్యోగుల జీతాల విషయంలో ఇబ్బందులు పడే పరిస్థితి తేలేదు. మా పరిస్థితుల్లో చంద్రబాబు ఉండి ఉంటే.. రాష్ట్రం కోవిడ్‌తో అతలాకుతలం అయిపోయింది.. మీరు రెండు నెలలు జీతాలు వదిలేసుకోండి.. రాష్ట్రం కోసం కాంట్రిబ్యూట్ చేయండ(విరాళంగా ఇవ్వండి)ని పిలుపునిచ్చేవాడు కచ్చితంగా.
మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఐఆర్ ఇచ్చాం. ఉద్యోగుల జీతాలు పెంచాం. 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేస్తే.. జూన్ 8న 27 శాతం ఐఆర్ ఇచ్చాం. జూలై 1 నుంచి అమలుచేశాం. అది ఉద్యోగస్తులపట్ల మాకున్న కమిట్‌మెంట్. మా ప్రభుత్వ హయాంలో 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. కాంట్రాక్టు ఉద్యోగస్తులను కూడా రెగ్యులరైజ్ చేయడం మొదలు పెట్టాం. 10,117 మందిని గుర్తించాం. వీళ్లలో 3,400 మందిని రెగ్యులరైజ్ చేశాం. మిగిలిన వారిని కూడా రెగ్యులరైజ్ చేసేందుకు సిద్ధం చేసినప్పటికీ ఎన్నికల కోడ్ వల్ల చేయలేకపోయాం. వాళ్లను ఇప్పుడు చంద్రబాబు రెగ్యులరైజ్ చేయడంలేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ ఇచ్చి జీతాలు పెంచడమే కాదు.. వారికి ప్రతినెలా 1వ తేదీన జీతాలు ఇచ్చేలా మేము సర్క్యులర్ జారీ చేశాం.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తి పలికి, దళారీ వ్యవస్థను తీసేసి వాళ్ల బతుకులు మార్చాలనే ఉద్దేశంతో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ (ఆప్కాస్)ను ఏర్పాటుచేసి లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతినెలా 1వ తేదీన జీతాలు వచ్చేటట్టుగా మేలు చేశాం. ఈ రోజు ఆప్కాస్‌ను చంద్రబాబు నీరుగారుస్తున్నారు.
చివరికి ఆలయాల్లో శానిటేషన్ కాంట్రాక్టు పనులను చంద్రబాబు బంధువు భాస్కరనాయుడుకు అప్పగించారు. మా హయాంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెంచాం. మేము రాక ముందు ఏడాదికి వారి వేతనాలు రూ.1,100 కోట్లు ఉండగా.. మేము అధికారంలోకి వచ్చాక ఏడాదికి రూ.3,300 కోట్లు చెల్లించాం. ఇప్పుడు చంద్రబాబు సచివాలయాల ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, ఆప్కాస్ వల్ల జీతాలు ఇవ్వడం కష్టంగా ఉందని కొత్త కొత్త స్టోరీలు చెబుతున్నారు. అంటే 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులతో పాటు లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, లక్షా 35 వేల మంది సచివాలయ ఉద్యోగులపై ఆయన కన్ను పడింది. వీళ్లను క్లీన్ చేస్తే మిగిలిన వారిని కూడా నెమ్మదిగా తప్పించేయొచ్చన్నది చంద్రబాబు ఆలోచన.
సాక్షి, అమరావతి : ఎన్నికల్లో తీపి తీపి మాటలతో ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వారిని మోసం చేసి నడిరోడ్డున నిలబెట్టి వికృతానందం పొందుతున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు, సమస్యల పరిష్కారంలో కుప్పిగంతులు, పిల్లి మొగ్గలు వేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు ప్రచారంలో పీక్.. వాస్తవాలు చాలా వీక్’ అనడానికి ఉద్యోగులకు ఇచ్చిన డీఏనే ఉదాహరణ అంటూ ఎత్తిచూపారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోందని.. జనవరి 2024, జూలై 2024, డిసెంబర్ 2024, జూన్ 2025.. ఇలా నాలుగు డీఏలు పెండింగ్‌లో పెట్టారని గుర్తుచేశారు. ఒక్క డీఏ కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగులు రోడ్డెక్కిన తర్వాత అనేక డ్రామాలు చేస్తూ ఒక్క డీఏ ప్రకటించాడు తప్ప.. ఇంత వరకూ ఇచ్చింది లేదన్నారు. ఉద్యోగులను చంద్రబాబు తరహాలో మోసం చేసిన సీఎం చరిత్రలో ఎవరూ లేరంటూ మండిపడ్డారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమం విషయంలో చంద్రబాబు వ్యవహార శైలిని సాక్ష్యాధారాలతో సహా ఎత్తిచూపుతూ కడిగి పారేశారు. తాము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చి.. జూలై, 2019 నుంచి పెంచిన వేతనాలు ఇవ్వడం ద్వారా వారి పట్ల తమకున్న ప్రేమను చాటుకున్నామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేస్తూ ఆప్కాస్‌ను తెచ్చామని చెప్పారు.
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు వారి వేతనాలను పెంచామని.. దీనివల్ల వారి వేతనాలు ఏడాదికి రూ.1100 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు పెరిగాయని వివరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని గుర్తు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా లంచాలకు తావు లేకుండా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందించి చూపించామని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
డీఏ అరియర్స్ రిటైర్ అయ్యాక ఇస్తారా?
మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి కష్టకాలంలో ఉన్నా కూడా ఉద్యోగుల విషయంలో వెనకడుగు వేయలేదు. మామూలుగా ఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాలి. కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 11 డీఏలు ఇచ్చాం. చంద్రబాబు అంతకు ముందు 2014–19 మధ్య కేవలం 8 డీఏలు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నాలుగు పెండింగ్ ఉంటే ఒకటి ఇస్తానన్నాడు.. ఆ ఒకటి కూడా డీఏ అరియర్స్ రిటైర్ అయ్యాక అన్నాడు. పెన్షనర్లకు డీఆర్ రెండేళ్ల తరువాత 2027–28లో ఇస్తానని ప్రకటించాడు. చంద్రబాబు ఇచ్చిన జీవోపై ప్రతి ఉద్యోగి తిట్టడం మొదలు పెట్టడంతో ఆ జీవో సవరించారేగానీ ఇంతవరకు పైసా ఇచ్చింది లేదు.
పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ 4 పెండింగ్‌లో పెట్టారు. ఒక్కో సరెండర్ లీవ్‌కు రూ.210 కోట్లు అవుతుందనుకుంటే.. అందులో రూ.100 కోట్లు ఇప్పుడిస్తాడట (అదీ ఇవ్వలేదు).. మిగిలిన రూ.100 కోట్లు జనవరిలో ఇస్తానని చెప్పాడు. ఇస్తానన్న దాంట్లో రూపాయి ఇవ్వలేదు.. మరి దీన్ని చూసి ఉద్యోగులంతా పండగ చేసుకోవాలంట. ఎలా సంబరాలు చేసుకోవాలి? టీడీపీ మేనిఫెస్టోలో ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్ట చేస్తానని హామీ ఇచ్చాడు. తీరా ఇవాళ చూస్తే పచ్చ బిళ్లలు వేసుకొని గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళ్లి.. టీడీపీ వాళ్లు ఉద్యోగులపై దాడులు చేస్తున్నారు. ఏమైనా అంటే పొలిటికల్ గవర్నెన్స్ అని నిర్మొహమాటంగా చెబుతున్నారు.
కుట్రపూరితంగానే పీఆర్సీ వేయడం లేదు
ఇవాళ ఉద్యోగులకు జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు.. త్రిశంకుస్వర్గంలో ఉన్నారు. మరో వైపు మేము తెచ్చిన జీపీఎస్‌ను కొనియాడుతూ కేంద్ర ప్రభుత్వం దగ్గర్నుంచి అనేక రాష్ట్రాలు దాన్ని స్వీకరించి, అమలు చేస్తూ ముందుకుపోతున్నాయి. ఎన్నికలప్పుడు ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నాడు. ఎన్నికలు అయిపోయాయి.. ఐఆర్ మాట దేవుడెరుగు.. పీఆర్సీ మరీ దారుణం. మేము నియమించిన పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను బలవంతంగా వెళ్లగొట్టాడు. కొత్త పీఆర్సీ చైర్మన్‌ను నియమించలేదు. కొత్త పీఆర్సీ వేస్తే ఎక్కడ ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందో అన్నది చంద్రబాబు దుగ్ధ.

ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసం అయితే.. న్యాయంగా, ధర్మంగా ఉద్యోగులకు జీతాలు పెరగకుండా అడ్డుకోవడం అన్నింటికంటే దుర్మార్గం. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్‌లు, ఏపీ జీఎల్‌ఐలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్‌లు, సరెండర్ లీవ్స్ అన్ని కలిపి దాదాపు రూ.31 వేల కోట్ల బకాయిల గురించి చంద్రబాబు మాట్లాడడు.
ప్రతి నెలా 1వ తేదీన ఉద్యోగులకు ఠంఛన్‌గా జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తామన్నాడు. ఎన్నికలైన తర్వాత ఒక నెల మాత్రమే అలా ఇచ్చాడు. మరో వైపు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. మా పథకాలన్నీ రద్దయిపోయాయి. ఇచ్చే పథకాలే అరకొర. వాటిలో కూడా అవుట్ సోర్సింగ్ వాళ్లకు ఇచ్చేందుకు చంద్రబాబుకు మనసు రావడం లేదు. అధికారంలోకి రాగానే వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేలు కాదు..రూ.10 వేలకు పెంచేస్తామన్నాడు. ఎన్నికల్లో వాడుకున్నాడు. ఎన్నో కుట్రలు చేశాడు. ఎన్నికల తర్వాత ఏకంగా ఆ ఉద్యోగాలన్నీ పీకేసి, 2.66 లక్షల మందిని రోడ్డున పడేశాడు.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
» చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మా హయాంలో 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చాం. వాటిలో ఏడు పూర్తి చేశాం. మిగిలిన 10 కళాశాలలు పూర్తి చేయాల్సి ఉంది. వీటి కోసం కేటాయించిన రూ.8 వేల కోట్లకు గాను రూ.3వేల కోట్లు ఖర్చు చేశాం. ఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఖర్చు చేస్తే మిగిలిన మెడికల్ కళాశాలలన్నీ పూర్తయ్యేవి. కానీ వాటిని పూర్తి చేయడం ఇష్టం లేక.. సగంలో కట్టిన ఈ కళాశాలలను స్కామ్‌లు చేస్తూ అమ్మడానికి సిద్ధమయ్యారు.
» మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నవంబర్ 22వ తేదీ వరకు కొనసాగుతోంది. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అక్టోబర్ 28వ తేదీన ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన ఈ కోటి సంతకాలను నవంబర్ 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, నవంబర్ 24న జిల్లాల నుంచి విజయవాడకు పంపిస్తారు. ఆ తర్వాత గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకొని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు ఏ విధంగా రిఫరెండం ఇచ్చారో కోటి సంతకాల ద్వారా తెలియజేస్తాం.
విద్య, వైద్యం, గవర్నెన్స్.. అన్నీ తిరోగమనమే
» ఉద్యోగులకు చంద్రబాబు చేసింది ఏమీ లేదు. కనీసం ప్రజలకైనా ఏమైనా చేస్తున్నాడా అంటే అదీ లేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, లా అండ్ ఆర్డర్ మొత్తం అన్నీ తిరోగమనమే. స్కూల్స్‌లో నాడు–నేడు పనులు ఆగిపోయాయి. గోరుముద్ద నాణ్యత పోయింది. 3వ తరగతి నుంచి చెప్పే టోఫెల్ క్లాసులు ఎత్తేశారు. ఇంగ్లిష్ మీడియం చదువులు గాలికెగిరిపోయాయి.
8వ తరగతి విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌లు ఆగిపోయాయి. అమ్మఒడి అరకొరగా మిగిలిపోయింది. విద్యాదీవెన, వసతి దీవెన ఆగిపోయింది. ఏడు క్వార్టర్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు పెండింగ్. ఒక్కొక్క క్వార్టర్‌కు రూ.650 కోట్ల నుంచి రూ.700 కోట్లు చొప్పున రూ.4,500 కోట్లు నుంచి రూ.4,900 కోట్లు విడుదల చేయాలి. కానీ ఈయన ఇచ్చింది రూ.700 కోట్లే. వసతి దీవెన రూ.2,200 కోట్లు ఇవ్వాలి. రూపాయి కూడా ఇచ్చింది లేదు.
» వైద్య రంగంలో చూస్తే రూ.25 లక్షల వరకు పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ వారికి ఆరోగ్య భద్రత కలి్పంచే ఆరోగ్యశ్రీని నీరుగార్చారు. ఈ పథకానికి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. 17 నెలలకు దాదాపు రూ.5,100 కోట్లు ఇవ్వాలి. కానీ రూ.వెయ్యి కోట్లు కూడా ఇవ్వలేదు. రూ.4 వేల కోట్ల బకాయిలు పెట్టారు. దీంతో వైద్యం అందించలేక నెట్‌వర్క్ ఆస్పత్రులు చేతులెత్తేసాయి. ఈ రోజు వాళ్లు విజయవాడలో ధర్నా చేసే పరిస్థితి ఏర్పడింది. పేద వాడికి ఆరోగ్య భరోసా ఇవ్వాల్సిన ఈ ఆస్పత్రులు..పేదవాడిని వదిలేసి చంద్రబాబు పుణ్యమా అని ఆందోళనకు దిగాయి.
» ఆరోగ్య ఆసరా గాలికెగిరిపోయింది. 104, 108.. కుయ్..కుయ్..కుయ్ అంటూ రావాల్సిన ఈ అంబులెన్స్‌ల నిర్వహణను రూ.5 కోట్ల టర్నోవర్ కూడా లేని చంద్రబాబు మనిషికి ఇచ్చారు. ఇలా అయితే 104, 108 సర్వీసులు ఇంకేమి నడుస్తాయి? విలేజ్ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు గాలికెగిరిపోయాయి. జీరో వేకెన్సీ రిక్రూట్‌మెంట్ పాలసీ అటకెక్కింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌వోజీఎంపీ ప్రమాణాల మేరకు మందులు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఆ మందులు దేవుడెరుగు కనీసం దూదికి కూడా దిక్కు లేదు.


