నాలుగైదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని వల్ల రానున్న మరో నాలుగు, ఐదు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) ప్రఖర్ జైన్ గురువారం తెలిపారు. శుక్రవారం కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
కోస్తా తీరం వెంబడి 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరో అల్ప పీడనం వల్ల రానున్న నాలుగు, ఐదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు. సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
గురువారం సాయంత్రం 6 గంటల నాటికి కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 120.5మిల్లీ మీటర్లు, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 85.5మిమీ, నెల్లూరు జిల్లా రాపూర్‌లో 78.5మిమీ వర్షపాతం నమోదైందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. కాగా, ప్రస్తుత అల్పపీడనం వాయుగుండంగా బలపడి తుపానుగా మారే సూచనలు ఉన్నాయని, ఈ తుపాను దక్షిణ కోస్తా లేదా తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


