ఎరువులు అందిస్తే ఏ రైతూ రోడ్డెక్కడు: వైఎస్‌ జగన్‌ | YS Jagan lashes out at Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఎరువులు అందిస్తే ఏ రైతూ రోడ్డెక్కడు: వైఎస్‌ జగన్‌

Sep 11 2025 5:08 AM | Updated on Sep 11 2025 5:52 AM

YS Jagan lashes out at Chandrababu Naidu

రూ.250 కోట్ల కుంభకోణంలో మీరూ భాగస్వామి కాబట్టే దందాకు మద్దతిస్తున్నారు: సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్‌ జగన్‌  

యూరియాను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తూ రైతులను దోచుకుంటారా? 

రైతుల పక్షాన మాట్లాడితే మా పార్టీ నాయకులకు నోటీసులు ఇప్పిస్తారా? 

గిట్టుబాటు ధర దక్కని రైతు తరఫున రోడ్డెక్కకూడదా? 

రైతులకు మంచి చేయాలన్న తపన జగన్‌కు ఉంది కాబట్టే నాడు రైతులు రోడ్డెక్కలేదు.. ఈ రోజు బాబుకు అది లేదు కాబట్టే రైతులకు ఈ అగచాట్లు 

మద్దతు ధరకు మేం రూ.7,802 కోట్లు వెచ్చించాం.. 

ఈ రోజు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.. ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నావడ్డీకి తిలోదకాలు

గిట్టుబాటు ధరలు, ఇంకా మరేదైనా సమస్య అయినా సరే తొలుత అసలు ఒప్పుకోడు. రేట్లు లేవయ్యా అంటే ఉన్నాయంటాడు. అంతా భేషుగ్గా ఉందని వాదిస్తాడు. రైతులు కేరింతలు కొడుతున్నారని గొప్పలకు పోతాడు. చివరకు సమస్య ఉందని ఒప్పుకోక తప్పదని నిర్ధారించుకున్నాక మోసం చేసేందుకు తూతూ మంత్రంగా ప్రకటనలు ఇస్తారు. ఆ ప్రకటనలను ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఎల్లో మీడియా.. చంద్రబాబు ఇంద్రుడు.. చంద్రుడు.. ఆదేశాలిచ్చేశాడంటూ ఆకాశానికెత్తేస్తాయి. తాటికాయంత అక్షరాలతో రాసేస్తారు. ఇదంతా ఓ బూటకం. ఏ రైతుకూ సమస్యలు తీరవు. మిర్చి, పొగాకు, మామిడి, చివరకు ఉల్లి విషయంలోనూ అదే జరిగింది.

రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి కారణం.. ఆర్బీకేలు, ఈృక్రాప్, పీఏసీఏఎస్‌ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే. ప్రైవేటుకు ఎక్కువ యూరియా, ఎరువులు కేటాయించారు. మరోవైపు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎరువులను టీడీపీ నాయకులు దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు ధరల స్థిరీకరణ నిధి లేదు. సీఎం యాప్‌ మూలన పడిపోయింది. ఈ క్రాప్‌ను నిర్వీర్యం చేశారు. ఉచిత పంటల బీమాకు పాతరేశారు. ఉచిత పంటల బీమా, ఇన్‌ పుట్‌ సబ్సిడీకి మంగళం పాడేశారు. సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తేశారు. ఇదంతా కళ్ల ఎదుటే కనిపిస్తోంది.   - వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: ‘ఖరీఫ్‌లో ఇప్పటికే రైతులకు 6.65 లక్షల టన్నుల యూరియా సరఫరా చేశామని, గతేడాది కంటే 97 వేల టన్నులు అధికంగా అందించామని మీరు గొప్పగా ప్రకటనలు చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వం అవసరమైన మేరకు యూరియా, ఎరువులు అందించి ఉంటే రాష్ట్రంలో ఏ రైతూ రోడ్డెక్కడు కదా?’ అని సీఎం చంద్రబాబు నాయుడును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ప్రకటన చూస్తుంటే ఆశ్చర్యం వేసిందన్నారు. 

రైతులకు అందించాల్సిన ఎరువులు, యూరియాను దారి మళ్లించి బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముతూ అధికార పార్టీ నేతలు కుంభకోణాలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు కూడా భాగస్వామి అని దునుమాడారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధర దక్కక రైతులు పడుతున్న ఇబ్బందులను ఆధారాలతో ఎత్తిచూపుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమం కోసం తెచి్చన విప్లవాత్మక పథకాలను గుర్తు చేస్తూ చంద్రబాబు సర్కార్‌ తీరును కడిగి పారేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ఇంకా ఏమన్నారంటే..   

పాలన ప్రజల కోసమా? దోపిడీదారుల కోసమా? 
రాష్ట్రంలో ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తుంటే అసలు ప్రభు­త్వం ఉందా? అన్న సందేహాలు సామాన్యుల్లోనూ తలెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పితే ఆ గొంతును నొక్కేస్తున్నారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. అభివృద్ధి, సంక్షేమం లేకుండా పోయింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా తిరో­గ­మనం పట్టించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు ప్రస్తు­తం మన కళ్ల ఎదుటే ప్రైవేట్‌ వ్యక్తుల దోపిడీకి గురవుతున్నా­యి. 

అసలు రాష్ట్రంలో పాలన ప్రజల కోసం సాగుతోందా? లేక దోపిడీదారుల కోసం సాగుతోందా? రైతులకు అందాల్సిన ఎరు­వులు బ్లాక్‌ మార్కె­ట్‌కు తరలి పోవడంతో కుంభకోణాలు కనిపిస్తున్నాయి. దాన్ని నిరసిస్తూ మా పార్టీ రైతుల పక్షాన మంగళవారం ‘అన్నదాత పోరు’ చేపడితే కేసులు పెడతామంటూ బెదిరించి నోటీసులు ఇచ్చారు. వారంతా ఏం తప్పు చేశారు? రైతుల పక్షాన నిలబడితే తప్పా? రాష్ట్రంలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యానికి ఇవన్నీ నిదర్శనాలు.    

చంద్రబాబు బావిలో దూకితే మేలు  
రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రభుత్వం సరిపడా ఎరువులు అందించి ఉంటే అసలీ పరిస్థితే ఉండేది కాదు కదా.. మీరు ఎరువుల విషయంలో కుంభకోణాలు చేయకపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా.. ఇది ఓవర్‌ నైట్‌ జరిగింది కాదు. రెండు నెలలుగా కనిపిస్తోంది. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. 

ఎరువులు దొరక్క కృష్ణా జిల్లా ఘంటశాల మండలం లంకపల్లి పీఏసీఎస్, పార్వతీపురం మన్యం జిల్లాలో, విజయనగరం జిల్లా ఎస్‌ కోటలో బారులు తీరిన రైతులు, రాజాంలో ఎరువుల కోసం కొట్లాట, అనకాపల్లి జిల్లా తుమ్మపాలలో రాత్రి సమయంలో ఎరువుల కోసం పాట్లు, తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడిలో, ఏలూరు జిల్లా నూజివీడులో, ఎన్టీఆర్‌ జిల్లా గొళ్లపూడిలో ఎరువుల కోసం పాదరక్షలను క్యూలో పెట్టిన రైతులు.. గుంటూరు జిల్లా రేపల్లె గోడౌన్‌ వద్ద రైతుల ఆందోళన.. ఇలా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైతుల ఇబ్బందులు కళ్లకు కట్టాయి. 

ప్రకాశం జిల్లా పామూరు మండలం కురమద్దాలి, సత్యసాయి జిల్లా సోమందేపల్లి పీఏసీఎస్, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రైతులు బారులు తీరారు. చిత్తూరు జిల్లా కుప్పంలో, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కూడా ఎరువులు దొరకని పరిస్థితి. సొంత నియోజకవర్గంలోనూ ఎరువులు సక్రమంగా పంపిణీ చేయలేని సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడులు ఏదైనా బావి చూసుకుని దూకితే మేలు.  

చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి 
మా ఐదేళ్ల పాలనలో రైతులకు ఈ కష్టాలు లేవు. ఇప్పుడు రైతులకు అందించే ఎరువుల్లో కూడా కుంభకోణాలు చేసి, డబ్బు ఎత్తాలన్న ఆలోచన చేస్తున్నారు కాబట్టే దారుణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో ఇంత దిక్కుమాలిన పరిస్థితి ఉన్నందుకు చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి. సీజన్‌ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారని లెక్క కడతారు కదా? దాని ఆధారంగా ఎంత ఎరువులు కావాలని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అంచనాకు వస్తుంది. ఆ లెక్కలన్నీ మనదగ్గర కూడా ఉంటాయి కదా? మరి అటువంటప్పుడు ఎరువులు అందని పరిస్థితి ఎందుకొచ్చింది?   

ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు 
» రాష్ట్రంలో రైతులు పండించే వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీని, కోకో, పొగాకు, మామిడి, ఉల్లి, టమాటా ఇలా ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా చంద్రబాబు పట్టించుకోరు. తూతూ మంత్రంగా ప్రకటనలు ఇస్తారు.  

»  ఉల్లి విషయంలో ఆగస్టు 29న క్వింటా రూ.1200కు కొనుగోలు చేయాలని చంద్రబాబు ఆదేశాలిచ్చినట్టు ఈనాడు రాసింది. మళ్లీ సెప్లెంబర్‌ 7న అంటే 10 రోజుల తర్వాత ఇదే ఈనాడులోనే క్వింటా రూ.201, 300, 400, 600 ఇలా రకరకాలుగా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్టు రాస్తుంది. అంటే.. దాని అర్థం రూ.1,200కు కొనుగోలు చేశారంటే ఒట్టిమాటే కదా? అన్నీ తూతూ మంత్రాలే.. అబద్ధాలు, మోసాలు.  

»  ఈ రోజు ఉల్లి.. క్వింటా రూ.200 నుంచి రూ.400. అదే ఉల్లి బహిరంగ మార్కెట్‌లో (బిగ్‌ బాస్కెట్‌) కేజీ రూ.34. అంటే క్వింటా 3,400. రైతులకు క్వింటా రూ.300–400 వస్తున్నట్టు ఈనాడు రాస్తోంది. రేటు పడిపోయినా పట్టించుకునే నాథుడే లేడు. మా పాలనలో కేజీ ఉల్లి రూ.40 నుంచి రూ.125 వరకు పలికింది. ఒకసారి మధ్యలో ఒడిదుడుకులు వస్తే రూ.9 వేల టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేసింది. కోవిడ్‌ లాంటి సమయంలో కూడా రైతులను ఆదుకున్నాం. చినీ ధర ఈ రోజు టన్ను రూ.7–8 వేలు..బాగా వస్తే రూ.12–14 వేలు. అదే మా హయాంలో కనిష్ట ధర రూ.30 వేలు. గరిష్ట ధర రూ.లక్ష.       

నాడు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి  
వైఎస్సార్సీపీ హయాంలో ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేసి మార్కెట్లో పోటీని పెంచాం. రైతు­లకు తోడుగా నిలబడేందుకు రూ.7,802 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి ఆర్బీకే పరిధిలో సీఎం యాప్‌ పెట్టాం. అక్క­డే ఈ క్రాప్‌ జరిగేది. దాంతో పాటు అగ్రికల్చరల్‌ గ్రాడ్యుయేట్‌ ఆర్బీకేలో పనిచేస్తూ ఆ గ్రామంలో ఏదైనా పంట ఇబ్బందుల్లో ఉంటే వెంటనే వివరాలను ఆ యాప్‌లో అప్లోడ్‌ చేసేవారు. ఇది కంటిన్యూస్‌ మానిటరింగ్‌ అగ్రికల్చరల్‌ ప్రాసెస్‌ అండ్‌ ప్రొక్యూర్‌ మెంట్‌ (సీఎంయాప్‌) ద్వారా కచ్చితంగా పని చేసేది. 

ఆర్బీకేలో కనీస గిట్టుబా­టు ధరలు తెలిసేలా బోర్డులో పెట్టేవారు. ఆ ధరల కంటే ఎక్కడన్నా పంట ధర పడిపోతే ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ఈ రోజు ఆర్బీకేలను గాలికొదిలేశారు. ఈ క్రాప్‌­ను నిర్వీర్యం చేశారు. సీఎం యాప్‌ మూలన పడిపోయింది. ఉచిత పంటల బీమాకు పాతరేశారు. ఇన్‌ పుట్‌ సబ్సి­డీ, పంట నష్టపరిహారానికి మంగళం పాడేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తేశారు. మేము క్రమం తప్పకుండా రైతు భరోసా ఇచ్చేవాళ్లం. ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందేది.. ఇవన్నీ ఎత్తేశారు. 

పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది రూ.5 వేలు ఇచ్చారు. అంటే రూ.40 వేలకు గాను రూ.5 వేలు ఇచ్చారు. అది కూడా సుమారు 7 లక్షల రైతు కుటుంబాలకు అర్హత జాబితా నుంచి తీసేశారు. ఇవాళ ప్రతిదీ స్కామే. ప్రతి విషయంలోనూ దోచేయాలనే ఆలోచనే కనిపిస్తోంది.  

ఇది రూ.250 కోట్ల కుంభకోణం  
»  అసలు రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి కారణం.. ఆర్బీకేలు, ఈ–క్రాప్, పీఏసీఏఎస్‌ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే. ప్రైవేటుకు ఎక్కువ యూరియా, ఎరువులు కేటాయించారు. మరోవైపు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎరువులను టీడీపీ నాయకులు దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా కళ్ల ఎదుటే కనిపిస్తోంది. 

»  ఉదాహరణకు.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దారి మళ్లిన యూరియా.. పల్నాడు జిల్లా దాచేపల్లిలో 165 బస్తాల ఎరువులు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన టీడీపీ నేతలు.. నంద్యాల జిల్లా డోన్‌లో 70 టన్నుల యూరియా మాయం.. ఒకవైపు ప్రభుత్వం నుంచి వెళ్లిన యూరియా, ఎరువులను టీడీపీ నేతలు దారి మళ్లించి అమ్ముకుంటున్నారు. మరోవైపు ప్రైవేటుకు అధికంగా కేటాయించిన ఎరువులను బ్లాక్‌ చేసి కొరత సృష్టించడం ద్వారా బస్తా యూరియా ధర రూ.267 ఉంటే దానికంటే రూ.200 నుంచి 250 అధికంగా బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. 

»  ఇలా బ్లాక్‌ మార్కెట్‌లో ఎరువుల అమ్మకాలను చంద్రబాబు ప్రొత్సహించడం, నేరుగా భాగస్వామి కావడంతో దాదాపు రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల కుంభకోణం జరిగింది. రైతులను పీడించి కుంభకోణాలు చేసి, కింది నుంచి పైదాక అందరూ పంచుకున్నారు.  

»  మా ప్రభుత్వ హయాంలో కలెక్టర్లు, ఎస్పీలతో తరచూ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించే వాడిని. ఎక్కడైనా బ్లాక్‌ మార్కెటింగ్‌ కనిపిస్తే మీ ఉద్యోగాలు ఊడిపోతాయని ఎస్పీలు, కలెక్టర్లకు బలంగా హెచ్చరికలు ఉండేవి. ఈ రోజు అది లేకుండా పోయింది. ఎవరి మీదా చర్యలు ఉండవు. నికింత– నాకింత అని.. దోచుకో పంచుకో తినుకో విధానంలో సిస్టమేటిక్‌ పద్ధతుల్లో వెళుతున్నారు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ కుంభకోణాలు చేస్తున్న వాళ్లు అసలు మనుషులేనా? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement