సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
పంట నష్టపోతే పరిహారం లేదు.. ఎరువులు, విత్తనాలు లేవు
పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు
ఉల్లి క్వింటాకు రూ.1,200 ఎవరికిచ్చారు?
టమాటాను పొలాల్లోనే వదిలేస్తున్నారు
కూటమి పాలనలో రైతాంగం పరిస్థితి దారుణం
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది.. ఇప్పటికీ డీఏపీ, యూరియా దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇంత దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుత రబీ సీజన్‌లో రాయలసీమ ప్రాంతంలో వేరు శనగ (బుడ్డ శనగ) విత్తనం వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. అయితే, గత నెల నుంచి సబ్సిడీ విత్తనాలిస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేసిందే తప్ప ఇంతవరకు కార్యాచరణే ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రైతులు దయనీయ, దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ఘోరంగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. ‘ఉల్లి రైతును గాలికొదిలేశారు. గడిచిన 60రోజుల నుంచి కిలో రూ.3 కన్నా దాటడం లేదు. ప్రభుత్వం క్వింటాకు రూ.1,200 ఇస్తామని చెప్పింది. ఎవరికిస్తున్నారో ఎవరికీ తెలియదు.’ ఎవరికీ ఇచ్చిందీ లేదు.
ప్రభుత్వంపై రైతులు నిరసన తెలిపేసరికి హెక్టారుకు రూ.50 వేలు ఇస్తామని చెప్పారు. ఇందుకోసం ఇప్పటివరకు విధివిధానాలే రూపొందించలేదు. ధాన్యానికి గతేడాది గిట్టుబాటు ధర లేక బస్తా రూ.1,100 నుంచి రూ.1,200కు తెగనమ్ముకునే పరిస్థితి. ఈ ఏడాది పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. క్వింటా పత్తి గతంలో రూ.12 వేలు పలికితే, ఇప్పుడు రూ.5,500కు మించి పలకడం లేదు. అరటి పంట గతంలో టన్ను గరిష్టంగా రూ.28 వేలు పలికితే ఇప్పుడు రూ.3,500కు మించి పలకడం లేదు.
కూలి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు టమాటా పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. దెబ్బతిన్న ఏ సీజన్‌లో కూడా బీమా కానీ, పంట నష్టపరిహారం కానీ ఇవ్వడంలేదు. అంతెందుకు ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం జరిగితే ఏ అధికారి కూడా వెళ్లి ఎన్యుమరేషన్ చేయలేదు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి ఇంతకంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.


