నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
సాక్షి, అమరావతి: రెగ్యులర్ అభ్యర్థులతో పాటు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఏపీ టెట్ (అక్టోబర్ 2025) షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసింది. అభ్యర్థులు శుక్రవారం నుంచి నవంబర్ 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజును http://cse.ap.gov.in ద్వారా చెల్లించాలని సూచించింది. నవంబర్ 25న ఆన్‌లైన్ మాక్ టెస్ట్ నిర్వహిస్తారని, డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోలని సూచించింది.
డిసెంబర్ 10 నుంచి రోజూ రెండు పూటలా ఉదయం 9 నుంచి 12 గంటలకు, మ«ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఏపీ టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫలితాలను జనవరి 19వ తేదీన వెల్లడిస్తామని చెప్పారు. http://tet2dsc.apcfss.in వెబ్‌సైట్ నుంచి పూర్తి సమాచారం డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు హెల్ప్ డెస్క్ నంబర్లు 8121947387, 8125046997, 7995649286, 7995789286, 9963069286ను సంప్రదించవచ్చన్నారు.
ఆ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరని, ఇదే అంశాన్ని ఇటీవల సుప్రీంకోర్టు సైతం నిర్దేశించిందని పేర్కొంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ, అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులకు తప్పనిసరిగా టెట్ ఉండాలని నిర్దేశించింది. అయితే, ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి 5 ఏళ్ల లోపు మాత్రమే ఇంకా సర్వీసు మిగిలి ఉన్నవారికి టెట్ నుంచి మినహాయింపునిచ్చింది. కాగా, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నిర్వహణను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.


