రాయలసీమలో భారీగా పంట నష్టం
వాగులు పొంగడంతో పలుచోట్ల నిలిచిన రాకపోకలు
ప్రకాశం జిల్లా రాచర్లలో 8.5 సెం.మీ. అత్యధిక వర్షం
ఏలూరు జిల్లా కలిదిండిలో 7.82, గుంటూరు జిల్లా దుగ్గిరాలలో 6.94 సెం.మీ. వర్షపాతం నమోదు
సాక్షి నెట్‌వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీని ప్రభావంతో రెండు రోజులుగా రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. గురువారం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయి రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. వరి చిరుపొట్ట దశలో వర్షాలు పడటంతో పంట నష్టం తప్పేలా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 6.94 సెం.మీ. వర్షం కురిసింది. పల్నాడు జిల్లాలో గడచిన 24 గంటల్లో 330.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలో కురిసిన వర్షాలకు పెన్నానదికి భారీస్థాయిలో నీరు చేరుతోంది. వరి, వేరుశనగ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు
ప్రకాశం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా రాచర్ల మండలంలో 8.5 సెం.మీ. కురిసింది. ఐదు మండలాల్లో పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. పెద్దదోర్నాల మండల పరిధిలోని తీగలేరు, ఇసుక చింతలవాగు, దొంగలవాగు, రాళ్లవాగులు పొంగటంతో వై.చర్లోపల్లి, గంటవానిపల్లె, మర్రిపాలెం తదితర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పంటల్ని దెబ్బతీస్తున్నాయి.
రొంపిచెర్ల మండలంలో టమాట పంట పూర్తిగా దెబ్బతింది. తిరుపతి జిల్లాలో 33.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. వైఎస్సార్ కడప జిల్లాలో 2,711 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, కంది, మినుము, వేరుశనగ, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది.
బుక్కరాయసముద్రంలో 72 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏలూరు జిల్లాలో గురువారం కుండపోత వర్షం కురిసింది. కలిదిండిలో 7.82 సెం. మి. అత్యధిక వర్షపాతం నమోదైంది. చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట మండలాల్లో వాగులు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయానికి సగటు వర్షపాతం 13.5 మి.మీ.గా నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం 23.9 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది.
వాగులో పడి వ్యక్తి మృతి
జలదంకి (కలిగిరి): జీవనోపాధి నిమిత్తం వాగు దాటి కావలి వెళ్లాలనుకున్న వ్యక్తి బైక్‌తో పాటు గల్లంతై మృతి చెందాడు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో జరిగింది. చామదాలకు చెందిన దంపూరు మల్లికార్జున (45) తన గ్రామం నుంచి బైక్‌పై కావలికి గురువారం బయల్దేరాడు. నేరెళ్ల వాగు దాటుతుండగా బైక్‌తో పాటు ఆయన చప్టా పైనుంచి వాగులో పడిపోయాడు.
సమాచారం అందుకున్న జలదంకి ఎస్‌ఐ సయ్యద్ లతీఫున్నీసా ఘటనాస్థలానికి చేరుకుని సిబ్బంది, స్థానికులతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్‌ఎఫ్ బృందాన్ని రప్పించి వారి సాయంతో 6 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా, మల్లికార్జున కావలిలోని పూల దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య గోవిందమ్మ, కుమార్తె (6) ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మారా్టనికి తరలించారు.


