ఉద్యమించిన వైద్యులు | Doctors in Vijayawada Maha Dharna | Sakshi
Sakshi News home page

ఉద్యమించిన వైద్యులు

Oct 24 2025 5:13 AM | Updated on Oct 24 2025 5:13 AM

Doctors in Vijayawada Maha Dharna

విజయవాడ మహా ధర్నాలో డాక్టర్ల ఉగ్రరూపం.. రూ.3 వేల కోట్లకు పైగా ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి ఆస్పత్రులను ఆదుకోవాలని డిమాండ్‌ 

బిల్లులు అడిగితే.. ఆడిట్‌ పేరుతో వేధిస్తున్నారని ఆగ్రహం 

ప్రాణదాతలపై ఎందుకింత చిన్నచూపు అని కూటమి ప్రభుత్వంపై మండిపాటు 

ప్రైవేట్‌ డాక్టర్లు రోడ్లెక్కి ఆందోళనకు దిగడం ఇదే తొలిసారి అంటున్న వైద్యవర్గాలు  

సాక్షి, అమరావతి: ‘కరోనా మహమ్మారి కబళిస్తున్న సమయంలో మా ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడాం. లక్షల మంది బాధితులను రక్షించాం. అలాంటి మాపై ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది.. మా ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఈ సర్కారుకు పట్టవా?’ అంటూ మహాధర్నాలో వైద్యులు గర్జించారు. ఆరోగ్యశ్రీ కింద కూటమి ప్రభుత్వం రూ.వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టడంతో రాష్ట్రంలో ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులు, చేనేత కార్మికుల తరహాలో వైద్యులు సైతం ఆత్మహత్యలకు ఒడిగట్టే దుస్థితిని ప్రజలు చూడాల్సి వస్తుందని ఆక్రోశించారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.3 వేల కోట్లకుపైగా బకాయిలు పెండింగ్‌లో పెట్టిన నేపథ్యంలో బిల్లుల విడుదల, ఇతర సమస్యల పరిష్కారం కోసం గురువారం విజయవాడలోని ధర్నా చౌక్‌లో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. 

ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆశ) ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు ఏపీ ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్స్‌ (అప్న), ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ), ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం, ఏపీ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఏపీ జూడా) సహా పలు సంఘాలు మద్దతుగా నిలిచాయి.  సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) చైర్మన్‌గా విజయవాడ ఆయుష్‌ హాస్పిటల్‌ చైర్మన్‌ డాక్టర్‌ రమేశ్‌బాబును ఎన్నుకున్నారు. 

కో–చైర్మన్లుగా ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ జయధీర్, అప్న రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ సుబ్బారెడ్డి వ్యవహరించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వైద్యులు, వైద్య సిబ్బంది మహా ధర్నాకు హాజరయ్యారు. వైద్య వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్న చంద్రబాబు సర్కారు తీరును ఎండగట్టారు.

చరిత్రలో ఇదే తొలిసారి..
దేశంలో ఇప్పటి వరకూ వైద్యుల హక్కులను కాలరాసే చట్టాలు, ఉత్తర్వులు జారీ చేసిన సందర్భాల్లో మాత్రమే ప్రైవేట్‌ డాక్టర్లు రోడ్లెక్కి నిరసనలు, ర్యాలీలు నిర్వహించిన ఉదంతాలున్నాయి. ప్రభుత్వాలు అమలు చేసే ఆరోగ్య పథకాల బిల్లులు చెల్లించలేదని ప్రైవేట్‌ వైద్యులు, ఆస్పత్రుల యజమానులు రోడ్లెక్కి ధర్నాలు, ర్యాలీలకు దిగిన ఘటనలు ఇప్ప­టి వరకూ చోటు చేసుకోలేదని వైద్యవర్గాలే చెబు­తున్నాయి. చేసిన చికిత్సలకు డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం వేధింపులకు దిగడంతోనే ఎక్కడా లే­నట్లుగా రాష్ట్రంలో ప్రైవేట్‌ వైద్యులు రోడ్లెక్కి ఆందోళనకు దిగారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. 

వైద్య ఆరోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇది మా­యని మచ్చ లాంటిదనే ఆవేదన వ్యక్తమవుతోంది. రూ.మూడు వేల కోట్లకుపైగా ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్‌లో పెట్టడంతో ఆస్పత్రుల మనుగడ కష్టమవుతోందని యాజమాన్యాలు పదేపదే మొత్తుకుంటూ నోటీసులిచ్చి సమ్మెలోకి వెళ్లినా ప్రభుత్వానికి చీ­మ కుట్టినట్లైనా లేదని, సర్కారే స్వయంగా వైద్యుల­ను రోడ్లెక్కేలా చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నా­యి.

భయపెట్టి అడ్డుకోలేరు..
కేవలం బిల్లుల కోసం కాదు.. ఆత్మగౌరవం, హ­క్కు­ల కోసం ధర్నా చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ మమ్మల్ని నాలుగో తరగతి ఉద్యోగుల కంటే హీనంగా చూస్తోంది. సమస్యలపై కూర్చుని చర్చించే అవకాశం కూడా ఇవ్వడం లేదు. పెండింగ్‌ బిల్లులు ఇవ్వాలని మేం అడుగుతుంటే ఆడిట్‌ పేరిట వేధింపులకు పాల్పడుతున్నారు. 

బెదిరింపులు, భయపెట్టడం ద్వారా వైద్య రంగం ముందుకు నడవదు. అంకిత భావంతోనే ముందుకు వెళ్తుందని గుర్తించాలి. మేం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. మాకు రావాల్సిన డబ్బు ఇవ్వమనే డిమాండ్‌ చేస్తున్నాం. సీఈవో ఆమోదించిన రూ.670 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలి. మిగిలిన బిల్లులను ఎప్పటిలోగా చెల్లిస్తారో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి.  – డాక్టర్‌ విజయ్‌కుమార్, ‘ఆశ’ అధ్యక్షుడు 

40 ఏళ్లలో ఎప్పుడూ లేదు...
నేను 40 ఏళ్లుగా వైద్య వృత్తిలో ఉన్నా. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. వైద్యుడిని దే­వు­డిగా భావించే పరిస్థితి నుంచి రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సిన దుస్థితి దాపురించడం దురదృష్టకరం. 2007లో ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టాక వైద్య రంగంలో పెను మార్పులు సంతరించుకున్నాయి. 

25 శాతం మంది పేద ప్రజల ఆరోగ్య భరోసా కోసం ప్రవేశపెట్టిన పథకం క్రమంగా విస్తరించింది. పథకం అమలులో ఎంతో కీలకంగా వ్యవహరించిన నెట్‌వర్క్‌ ఆస్పత్రుల మనుగడ నేడు ఎంతో కష్టతరంగా మారింది. వైద్యులు కొవ్వొత్తిలా కరిగిపోతూ వెలుగులు పంచుతున్నారు. ప్రభుత్వం వెంటనే మా సమస్యలను పరిష్కరించాలి. – డాక్టర్‌ వై.రమేశ్‌బాబు, వైద్య సంఘాల జేఏసీ అధ్యక్షుడు 

లంచాలు ఇవ్వలేక విసిగిపోతున్నాం..
ఆరోగ్యశ్రీ  లాంటి ఉత్తమ విధానం అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం లేదు. ఆరోగ్యశ్రీ కార్డుతో పేదలు నేరుగా కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్లి ఉచితంగా చికిత్స పొందే వీలుంది. కూటమి ప్రభుత్వం ఆస్పత్రులకు పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోవడం దురదృష్టకరం. ఆస్పత్రుల యాజమాన్యాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. 

ఇలాగే వదిలేస్తే రైతులు, చేనేత కార్మికుల మాదిరిగా భావి వైద్యులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు ఒడిగట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్క బిల్లులే కాదు.. ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్స్‌కు అనుమతుల విషయంలోనూ ప్రభుత్వం వేధిస్తోంది. 18 రకాల అనుమతులు పొందడానికి వివిధ శాఖల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రతి దగ్గర లంచాలు ఇవ్వలేక విసిగిపోతున్నాం. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. – డాక్టర్‌ ఏవీ సుబ్బారెడ్డి, జాతీయ కార్యదర్శి, భారత ప్రైవేట్‌ హాస్పిటల్స్, నర్సింగ్‌ హోమ్స్‌ సంఘాల సమాఖ్య

చరిత్రలో తొలిసారి ప్రైవేట్‌ డాక్టర్ల ఆందోళన..
సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ వైద్యులు రోడ్లెక్కి ధర్నాలు చేయడం సాధారణం. చరిత్రలో మొదటి సారిగా ప్రైవేట్‌ డాక్టర్లు ప్రభుత్వానికి వ్యతి­రేకంగా ధర్నాకు దిగారు. వైద్యులు తమ జీవితాలను పణంగా పెట్టి మనుగడ సాగించలేక పోతున్నారు. 

అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేట్‌ వైద్యులు ఆందోళనలు, సమ్మెలకు దిగారు. వారి సమస్యలు విని అర్థం చేసుకుని పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. ప్రభుత్వం తోడుండి ముందుకు నడిపిస్తే వైద్య రంగంలో అద్భుతాలు సృష్టిస్తాం.  – డాక్టర్‌ జయధీర్, ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement