
బిల్లుల కోసం ధర్నాకు సిద్ధమైన నెట్‌వర్క్ ఆస్పత్రులు
అనుమతి ఇవ్వాలని విజయవాడ పోలీస్ కమిషనర్‌కు లేఖ
రూ.3 వేల కోట్లకు పైగా బకాయి పెట్టిన చంద్రబాబు
సేవలు నిలిపేసినా పట్టించుకోని సర్కారు
దీంతో వీధి పోరాటానికి ఆస్పత్రుల యజమానులు
బిల్లుల కోసం ధర్నా.. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 1.42 కోట్ల మంది ప్రజలకు సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకం చరిత్రలోనే చీకటి అధ్యాయానికి చంద్రబాబు తెరతీశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత చికిత్సలు అందించిన ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులు బిల్లుల కోసం ఏకంగా ధర్నాకు దిగాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. బకాయిల విడుదల డిమాండ్‌తో ఈ నెల 23/24 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్‌లో భారీ ధర్నా చేయడానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశ) సిద్ధమైంది. నెట్‌వర్క్ ఆస్పత్రుల యజమానులు, వైద్యులు, ఇతర సహాయ సిబ్బంది పెద్దసంఖ్యలో ధర్నాలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో ధర్నాకు అనుమతి కోరుతూ విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఆశ లేఖ రాసింది. గత నెల 15 నుంచి ఆశ సమ్మెబాట పట్టింది. అదేరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఉచిత ఓపీ, రోగనిర్ధారణ సేవలను ఆపేశారు. అయినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో గత నెల 24 నుంచి ఏకంగా అన్నిరకాల వైద్యసేవలను పూర్తిస్థాయిలో నిలిపేసి సమ్మెను ఉధృతం చేశారు. సేవలన్నీ నిలిపేసి 10 రోజులైనా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆస్పత్రుల యజమానులు ఏకంగా వీధి పోరాటానికి సిద్ధమయ్యారు.
పేదప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవల కల్పన లక్ష్యంతో 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఈ పథకం దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచింది. దేశంలోని పేదప్రజలకు ఉచిత వైద్యసేవల కల్పనకు దిక్సూచిగా నిలిచిన ఈ మహోన్నత పథకాన్ని చంద్రబాబు కేవలం 17 నెలల పాలనలోనే అంపశయ్య ఎక్కించేశారు. పథకాన్ని కనుమరుగు చేయడంలో భాగంగా గద్దెనెక్కిన వెంటనే బీమా విధానం ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. పథకం అమలును గాలికి వదిలేసి, ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించటం మానేశారు.
ముందు రూ.670 కోట్లు చెల్లించమని అడిగినా..
నెట్‌వర్క్ ఆస్పత్రులకు చికిత్సలు చేసిన 40 రోజుల్లో బిల్లు చెల్లించాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయిన నాటినుంచి ఆస్పత్రుల క్లెయిమ్‌లను కనీసం ప్రాసెస్ కూడా చేయకుండా ట్రస్ట్‌స్థాయిలోనే తొక్కిపెట్టడం మొదలుపెట్టారు. దీంతో ఏకంగా రూ.3 వేలకోట్లకు పైగా బిల్లులు నెట్‌వర్క్ ఆస్పత్రులకు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున బిల్లులు ఆగిపోవడంతో ఆస్పత్రులు కూడా నిర్వహించలేని దయనీయ పరిస్థితుల్లోకి యజమానులు వెళ్లిపోయారు.
చేసిన అప్పులకు వడ్డీలు, ఈఎంఐలు కట్టకపోవడంతో కొత్తగా బ్యాంకులతోపాటు ప్రైవేట్‌గాను అప్పులు పుట్టని దుస్థితి నెలకొందని వారు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ దయనీయ పరిస్థితిపై పదేపదే ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోకపోవడంతో ఆరునెలల వ్యవధిలో రెండుసార్లు సమ్మె కు పిలుపు ఇచ్చారు. తొలిసారి సమ్మె చేసినప్పుడు సీఎం దగ్గర చర్చలు జరిగాయి. బిల్లులు ఇస్తామని సీఎం హామీ ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గారు. అనంతరం పరిస్థితుల్లో మార్పురాకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు.
వాస్తవానికి మొత్తం బకాయిల్లో రూ.670 కోట్లు వెంటనే చెల్లించి, మిగిలిన నిధుల విడుదలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఇప్పటివరకు ఆస్పత్రుల యజమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆ డిమాండ్‌ను ప్రభుత్వ పెద్దలు కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. నెలరోజులకుపైగా సమ్మె చేస్తున్న వారిని వైద్యశాఖ మంత్రి, సీఎం స్థాయి వ్యక్తులు చర్చకు కూడా పిలవలేదు. సేవలు పూర్తిస్థాయిలో నిలిచిపోయి అనారోగ్య బాధితులు చికిత్స కోసం తీవ్ర అగచాట్లు పడుతున్నారు. ఇదిలా ఉండగా ఈవెంట్స్ మేనేజ్‌మెంట్‌పై పెట్టిన శ్రద్ధలో ఒకటో వంతు కూడా ప్రభుత్వ పెద్దలు ప్రజారోగ్యంపై పెట్టడం లేదు.