డేటా సెంటర్‌ క్రెడిట్‌ చౌర్యం: వైఎస్‌ జగన్‌ | YSRCP chief YS Jagan Fires On Chandrababu Govt For Data Center | Sakshi
Sakshi News home page

డేటా సెంటర్‌ క్రెడిట్‌ చౌర్యం: వైఎస్‌ జగన్‌

Oct 24 2025 5:05 AM | Updated on Oct 24 2025 5:10 AM

YSRCP chief YS Jagan Fires On Chandrababu Govt For Data Center

చంద్రబాబు.. పాలనా సామర్థ్యంలో వీక్‌.. క్రెడిట్‌ చోరీలో పీక్‌

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం

విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటుకు 2020 నవంబర్‌లోనే అదానీతో ఒప్పందం 

డేటా రావాలంటే సింగపూర్‌ నుంచి 3,900 కి.మీ. పొడవున సముద్ర గర్భంలో కేబుల్‌ వేయాలి 

అందుకోసం 2021 మార్చి 9న సింగపూర్‌ ప్రభుత్వానికి మా ప్రభుత్వం లేఖ రాసింది 

విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు 190 ఎకరాలు కేటాయించి 2023 మే 3న శంకుస్థాపన చేశాం 

దాని కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు 300 నుంచి 1,000 మెగావాట్లకు డేటా సెంటర్‌ విస్తరణ 

ఇందులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, సింగపూర్, కేంద్ర ప్రభుత్వం, అదానీ కృషి ఎంతో ఉంది 

అదానీ పేరెత్తితే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి క్రెడిట్‌ వస్తుందని చంద్రబాబు సంకుచిత బుద్ధి 

విశాఖలో అదానీ సంస్థ డేటా సెంటర్‌ నిర్మిస్తుందని.. 3 చోట్ల భూమి అప్పగించాలంటూ అక్టోబర్‌ 4న రాష్ట్ర్ట ఐటీ శాఖ కార్యదర్శి 
భాస్కర్‌కు గూగుల్‌ ప్రతినిధి అలెగ్జాండర్‌ లేఖ 

రూ.87 వేల కోట్లు పెట్టుబడితో డేటా సెంటర్‌ నిర్మించేది అదానీయే.. హార్డ్‌వేర్, ఇతర టెక్నాలజీని గూగుల్‌ సమకూరుస్తుంది

గూగుల్‌ డేటా సెంటర్‌ ప్రాజెక్టుకు సంబంధించి రూ.87 వేల కోట్లు అదానీ సంస్థ పెట్టుబడి పెడుతోంది. గూగుల్‌ను తీసుకొచ్చేందుకు.. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు అదానీ సంస్థ దీన్ని చేపట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌.  కట్టిన తర్వాత గూగుల్‌ దాన్ని క్లయింట్‌గా వాడుకుంటుంది. నేను ముందుగానే చెప్పినట్లు.. సబ్‌ సీ కేబుల్‌ రావాలి.. డేటా సెంటర్‌ కట్టాలి.. అప్పుడు గూగుల్‌ వస్తుంది. ఈ డేటా సెంటర్‌కు అవసరమైన హార్డ్‌వేర్, ఇతర టెక్నాలజీని గూగుల్‌ సమకూరుస్తోంది. ఇలాంటి డేటా సెంటర్లను మన దేశానికి చెందిన అదానీ లాంటి గొప్ప కంపెనీ కడుతోందని గొప్పగా, గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి క్రెడిట్‌ చోరీ చేస్తూ చంద్రబాబు సంకుచిత బుద్ధిని ప్రదర్శించారు. రూ.87 వేల కోట్లు పెట్టుబడి ఎవరు పెడతారండి? గూగుల్‌ను తెస్తున్నారని అదానీకి థ్యాంక్యూ చెప్పాల్సిన చంద్రబాబు కనీసం క్రెడిట్‌ ఇచ్చారా?      
– వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుకు క్రెడిట్‌ చోరీ చేయడం కొత్త కాదని.. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ, విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి సొంత గొప్పలు చెప్పుకుంటూ సంకుచిత బుద్ధితో వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఏకంగా రూ.87 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ను నెలకొల్పుతున్న అదానీ పేరును గూగుల్‌తో ఒప్పందం సమయంలో సీఎం చంద్రబాబు కనీసం ప్రస్తావించకపోవడం ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి క్రెడిట్‌ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్‌తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదంటూ దుయ్యబట్టారు. 

డేటా సెంటర్‌ను అదానీ సంస్థే నిర్మిస్తుందని.. ఆ సంస్థకు మూడు చోట్ల భూమిని అప్పగించాలంటూ ఈనెల 4న గూగుల్‌ ప్రతినిధి అలెగ్జాండర్‌ స్మిత్‌ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్‌కు రాసిన లేఖే నిదర్శనమంటూ.. వైఎస్‌ జగన్‌ ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఉత్తరాంధ్ర దశ, దిశ మార్చాలనే లక్ష్యంతో విశాఖను అంతర్జాతీయ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లోనూ 2020 నవంబర్‌లో తమ ప్రభుత్వ హయాంలోనే 300 మెగావాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటుకు అదానీతో ఒప్పందం చేసుకున్నామని గుర్తు చేశారు. 

డేటా సెంటర్‌కు డేటా రావాలంటే సింగపూర్‌ నుంచి 3,900 కి.మీ. పొడవున సబ్‌సీ (సముద్ర గర్భం)లో కేబుళ్లు వేయాలని.. అందుకోసం 2021 మార్చి 9న సింగపూర్‌ ప్రభుత్వానికి లేఖ సైతం రాశామని పేర్కొంటూ ఆ లేఖ ప్రతులను విడుదల చేశారు. నోయిడాలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో డేటా సెంటర్‌ ఏర్పాటుకు 4.64 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గూగుల్‌ అనుబంధ సంస్థ రైడాన్‌ ఇన్ఫోటెక్‌ లీజుకు తీసుకుందంటూ 2022 అక్టోబర్‌ 11న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనాన్ని ప్రచురించిందని ఆ క్లిప్పింగ్‌ను చూపారు. ఈ నేపథ్యంలో డేటా సెంటర్లకు సంబంధించి గూగుల్‌తో వ్యాపార అనుబంధం ఉన్న అదానీ సంస్థతో విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు 2023 మే 3న శంకుస్థాపన చేశామని.. అందుకోసం 190 ఎకరాల భూమిని కూడా కేటాయించామని గుర్తు చేశారు. 

దాని కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు 300 నుంచి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌ను విస్తరిస్తున్నారని స్పష్టం చేశారు. ఇందులో క్రెడిట్‌ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి, సింగపూర్, కేంద్ర ప్రభుత్వానికి, అదానీకి దక్కుతుందని తేల్చి చెప్పారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన యాడ్‌ ఏజెన్సీ తరహాలో నడుస్తోందని తూర్పారబట్టారు. సీఎం చంద్రబాబు పాలనా సామర్థ్యంలో వీక్‌.. క్రెడిట్‌ చోరీలో పీక్‌.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..  

అదానీ ప్రాజెక్టుకు గూగుల్‌ విస్తరణ.. 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా అదానీ చేసిన కృషి, కేంద్ర ప్రభుత్వంతో పాటు సింగపూర్‌ ప్రభుత్వం చేసిన కృషి.. వీరందరి కృషి వల్ల దాని కొనసాగింపులో భాగంగా ఈ రోజు గూగుల్‌ వచ్చింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆరోజు వేసిన విత్తన­మే ఈ రోజు డేటా సెంటర్‌ కొనసాగింపు! గూగుల్‌ నెలకొల్పే 1,000 మెగావాట్ల కొత్త ప్రాజెక్టు ఇంతకు ముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణ మాత్రమే. గూగుల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ మధ్య డేటా సెంటర్లకు సంబంధించి వ్యాపార సంబంధాలపై 2022 అక్టోబర్‌ 11న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా (క్లిప్‌ ప్రదర్శించారు) కథనం కూడా ప్రచురించింది. 

నోయిడాలోని అదానీ డేటా సెంటర్‌లో 4.64 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని గూగుల్‌ లీజుకు తీసుకుందన్నది దాని సారాంశం. ఈ నేపథ్యంలో ఇక్కడ (విశాఖలో) 2023 మే 3న అదానీ డేటా సెంటర్‌కు పునాది వేశాం. సింగపూర్‌ నుంచి సబ్‌ సీ కేబుల్‌కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. అంతకుముందే.. అదానీకి భూములు కేటాయిస్తూ 2020 నవంబర్‌లో జీవో ఇచ్చాం. ఆ వెంటనే 2021 మార్చి 9న వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం సింగపూర్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. సింగపూర్‌ నుంచి విశాఖపట్నానికి 3,900 కిలో మీటర్ల మేర సబ్‌ సీ కేబుల్‌ ఏర్పాటుకు సహాయం అందించాలని లేఖలో కోరాం. ఆ కారిడార్‌ క్రియేట్‌ చేస్తే డేటా విశాఖకు చేరుతుంది.   

డేటా సెంటర్‌ నిర్మించేది అదానీ సంస్థే.. 
విశాఖలో కూడా అదానీ ఇన్‌ఫ్రాకు చెందిన కంపెనీలే ఈ డేటా సెంటర్‌ను నిర్మిస్తున్నాయి. ఈ మేర­కు గూగుల్‌కు చెందిన అలెగ్జాండర్‌ స్మిత్‌ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. చంద్రబాబు అండ్‌ కో ఇటీ­వల ఢిల్లీ వెళ్లి హడావుడి చేయకముందే.. సంతకాలు చేయకముందే.. 2025 అక్టోబర్‌ 4న అదానీ ఇన్‌ఫ్రా­కు చెందిన మూడు కంపెనీలకు భూమి కేటాయింపులు చేయాలని గూగుల్‌ సంస్థ ఏపీ ఐటీ శాఖ కార్య­దర్శి భాస్కర్‌ను లేఖలో కోరింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రూ.87 వేల కోట్లు అదానీ సంస్థ పెట్టుబడి పెడుతోంది. గూగుల్‌ను తీసుకొచ్చేందుకు.. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు అదానీ సంస్థ దీన్ని చేపట్టింది. 

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌.  కట్టిన తర్వాత గూగుల్‌ దాన్ని క్లయింట్‌గా వా­డు­కుంటుంది. నేను ముందుగానే చెప్పినట్లు.. సబ్‌ సీ కేబుల్‌ రావాలి.. డేటా సెంటర్‌ కట్టాలి.. అప్పుడు గూగుల్‌ వస్తుంది. ఈ డేటా సెంటర్‌కు అవసరమైన హార్డ్‌వేర్, ఇతర టెక్నాలజీని గూగుల్‌ సమకూరుస్తోంది. ఇలాంటి డేటా సెంటర్లను మన దేశానికి చెందిన అదానీ లాంటి గొప్ప కంపెనీ కడుతోందని గొప్పగా, గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి క్రెడిట్‌ చోరీ చేస్తూ చంద్రబాబు సంకుచిత బుద్ధిని ప్రదర్శించారు. 

రూ.87 వేల కోట్లు పెట్టుబడి ఎవరు పెడ­తారండి? గూగుల్‌ను తెస్తున్నారని అదానీకి థ్యాంక్యూ చెప్పాల్సిన చంద్రబాబు కనీసం క్రెడిట్‌ ఇచ్చా­రా? ఎందుకు భయపడుతున్నారు? ఆ పేర్లు చెప్ప­డం మొదలు పెడితే.. బ్యాక్‌గ్రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ వస్తుంది కాబట్టి. వైఎస్సార్‌సీపీ హయాంలో 300 మె­గావాట్ల డేటా సెంటర్‌కు బీజం పడినప్పుడే.. గూగు­ల్, అదానీకి డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి వ్యాపార సంబంధం ఉంది. కేంద్రం, వైఎస్సార్‌­సీపీ ప్రభుత్వం, సింగపూర్‌ ప్రభుత్వం, అదానీ.. ఇంతమంది కృషితో గూగుల్‌ తెచ్చే కార్యక్రమానికి బీజం పడిందని చెప్పటానికి చంద్రబాబు సంశయించారు. క్రెడిట్‌ ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు. 
బాబు ముఖారవిందాన్ని చూసి వచ్చేసినట్లు బిల్డప్‌..  

డేటా సెంటర్‌లో అతి ముఖ్యమైన విషయం.. 
సింగపూర్, విశాఖ మధ్య సబ్‌ సీ కేబుల్‌ (సముద్ర గర్భంలో కేబుల్‌ వ్యవస్థ) 3,900 కిలోమీటర్ల మేర నిర్మాణం. అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటులో భాగంగా ఈ కేబుల్‌ వ్యవస్థను తీసుకుని రావాలని అప్పట్లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం, కేంద్రం, సింగపూర్‌ ప్రభుత్వం సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఈ రోజు అంతా అయిపోయిన తర్వాత చంద్రబాబు వచ్చి తన సుందర ముఖారవిందాన్ని చూసి గూగుల్‌ వచ్చేసినట్లు బిల్డప్‌ ఇస్తున్నారు. మిగిలిన వాళ్లందరి కృషిని సైడ్‌ లైన్‌ చేసేశారు. రూ.87 వేల కోట్లు పెడుతున్న అదానీ.. గూగుల్‌– రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో కనీసం కనిపించలేదు.  

190 ఎకరాలు కేటాయింపు.. 
వైఎస్సార్‌సీపీ హయాంలోనే 300 మెగావాట్ల డేటా సెంటర్‌ కోసం 190 ఎకరాలు విశాఖలో కేటాయించాం. మధురవాడలో 130 ఎకరాలు, కాపులుప్పాడలో 60 ఎకరాలు ఇచ్చాం. డేటా సెంటర్‌ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సబ్‌ సీ కేబుల్‌ను సింగపూర్‌ నుంచి విశాఖపట్నానికి తీసుకురావడానికి అంకురార్పణ చేశాం. ఇవాళ కొత్తగా వస్తున్న 1,000 మెగావాట్ల గూగుల్‌ ప్రాజెక్టుకు.. నాడు 300 మెగావాట్ల ప్రాజెక్టు ఇవ్వడమే కీలకంగా మారింది. ఏఐ భవిష్యత్తులో ప్రపంచాన్ని డామినేట్‌ చేసే టెక్నాలజీ. ఏఐ అయినా, క్వాంటం కంప్యూటింగ్‌ అయినా.. భవిష్యత్తులో గొప్ప మార్పులకు డేటా సెంటర్‌ నోడల్‌ పాయింట్‌గా ఉంటుంది.  

డేటా సెంటర్‌తో ఉద్యోగాలు తక్కువే అయినా.. ఎకో సిస్టమ్‌ తయారవుతుంది. తద్వారా గ్లోబల్‌ క్యాపబుల్‌ సెంటర్స్‌ వస్తాయి. కాబట్టి వీటికి మా ప్రభుత్వంలోనే నాంది పలికాం. కేవలం 300 మెగావాట్ల డేటా సెంటర్‌ పెడితే ఉద్యోగాలు తక్కువ వస్తాయి కాబట్టి అంతటితో మేం ఆగలేదు.  ఆ రోజు అదానీతో చేసుకున్న ఒప్పందంలో 25 వేల ఉద్యోగాలు కల్పించాలని కోరాం. ఐటీ పార్క్, స్కిల్‌ సెంటర్, రిక్రియేషన్‌ సెంటర్ల ద్వారా ఉద్యోగాలు తీసుకొచ్చేలా ఒప్పందంలో పెట్టాం.   


క్రెడిట్‌ చోరీల్లో బాబు పీక్‌..! 
చంద్రబాబుకు క్రెడిట్‌ చోరీ చేయడం కొత్తకాదు. హైదరాబాద్‌ విషయంలోనూ చంద్రబాబుది సేమ్‌ స్టోరీ. మాదాపూర్‌లో సైబర్‌ టవర్స్‌.. ఆరు ఎకరాల స్థలంలో చిన్న ప్రాజెక్టు. దానిపేరు హైటెక్‌ సిటీ. నిజానికి అక్కడ ఐటీ స్పేస్‌ కట్టడానికి అప్పటి సీఎం ఎన్‌.జనార్థన్‌రెడ్డి పునాది వేశారు. చంద్రబాబు దాన్ని ఎప్పుడూ చెప్పరు. ప్రభుత్వ ఆధ్వర్యంలో దాన్ని చేపట్టేందుకు నాడు జనార్దన్‌రెడ్డి శ్రీకారం చుడితే చంద్రబాబు సీఎం అయ్యాక రద్దు చేసి ప్రైవేటుకు ఇచ్చేశారు. దాంతో హైదరాబాద్‌ మొత్తం నేనే కట్టానని బిల్డప్‌ ఇస్తున్నారు.  

2004లో చంద్రబాబు ఓడిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్‌ ఆయన చేతుల్లో లేదు. 2004, 2009లో వైఎస్సార్‌ గెలిచారు. తర్వాత మరో రెండు సార్లు కేసీఆర్‌ గెలిచారు. ఏకంగా 20 ఏళ్లపా­టు చంద్రబాబుకి, హైదరాబాద్‌కు ఎలాంటి సంబంధం లేదు. అయినా 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా తనదే అంటారు. ఇదీ చంద్రబాబు బిల్డప్‌. 

⇒ అయ్యా చంద్రబాబూ.. ఆరు ఎకరాల్లో 1.40 లక్షల చదరపు అడుగుల్లో చిన్న బిల్డింగ్‌ కడితే.. హైటెక్‌ సిటీ అని పేరు పెడితే.. దానితోనే అభివృద్ధి చెందింది అనుకోవడం మూర్ఖత్వం. దాని తర్వాత నువ్వు వెళ్లిపోయావు. 2004లో రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారు. ఆ తర్వాత ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌–1ను 126 కి.మీ. ప్రాజెక్టును 2006లో ప్రారంభించి 2012లో పూర్తిచేశారు. అది హైదరాబాద్‌ నగర రూపురేఖలను మార్చేసింది. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే 11.6 కి.మీ. ఫ్లైఓవర్‌.. దేశంలోనే అతి పొడవైనది. దీనిని అక్టోబర్‌ 2005లో ప్రారంభించి 2009 అక్టోబర్‌ 19న పూర్తి చేశారు.  

⇒ జీఎంఆర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మార్చి 2005లో ప్రారంభిస్తే  23 మార్చి 2008లో పూర్తి చేశారు. ఇవన్నీ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించి పూర్తి చేసినవే.   
⇒ చంద్రబాబు దిగిపోయే నాటికి 2003–04లో ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ, అనుబంధ ఎక్స్‌పోర్ట్స్‌ రూ.5,660 కోట్లు మాత్రమే. వైఎస్సార్‌ సీఎం అయ్యాక 2004–09లో ఐటీ, అనుబంధ రంగాల ఎగుమతులు రూ.32,509 కోట్లకు చేరాయి. ఆయన అవన్నీ పూర్తి చేసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంతోనే ఇదంతా జరిగింది.   

⇒ వైఎస్సార్‌ రెండో సారి గెలిచి సీఎం అయిన కొద్ది నెలలకే చనిపోయినా.. ఆయన గెలిపించి ఇచ్చిన ప్రభుత్వం కొనసాగింపులో భాగంగా 2013–14­లో ఐటీ ఎక్స్‌పోర్టులు  రూ.57 వేల కోట్లకు చేరా­యి. కానీ, చంద్రబాబు హైదరాబాద్‌ను నేనే కట్టేశా... ఐటీ అంటే నేనే అని చెప్పుకుంటున్న పరిస్థితి..! ఈ వ్యత్యాసం చూస్తే అసలు విషయం  తెలుస్తుంది. నాన్న తర్వాత కేసీఆర్‌ రెండు టెర్మ్‌లు పాలించారు. ఆయన కూడా గొప్పగా వైఎస్సార్‌ ఆపిన దగ్గర నుంచి ప్రారంభించి గొప్పగా పాలించారు. తద్వారా హైదరాబాద్‌ ఐటీలో టాప్‌లోకి వెళ్లింది. 

⇒ చంద్రబాబు హయాంలో రూ.5,660 కోట్లు దగ్గర నుంచి.. ఈరోజు తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లకు చేరాయి. 20 ఏళ్లలో ఇంత జరిగితే.. మొత్తం హైదరాబాద్‌ నేనే కట్టా అంటే ఎలా? చంద్రబాబుకు ఇది కొత్తకాదు. పబ్లిసిటీ స్టంట్స్‌ చేస్తారు. వేరేవాళ్లకు ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్‌ వాళ్లకు ఇవ్వకపోవడం చంద్రబాబుకు ఉన్న దుర్మార్గపు నైజం.

అభివృద్ధికి విజన్‌ ఉండాలి.. 
మా హయాంలో అదానీ డేటా సెంటర్‌ తద్వారా వచ్చిన గూగుల్, ఇన్ఫోసిస్, ఇనార్బిట్‌ మాల్, కైలాసగిరి సైన్స్‌ మ్యూజియం, రిషికొండ వద్ద టీటీడీ దేవాలయం, ఎనీ్టపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌.. ఇవన్నీ కొన్ని ప్రాజెక్టులు. విశాఖపట్నం నుంచి ఎయిర్‌ పోర్టుతో పాటు మూలపేట పోర్టుకు అనుసంధానిస్తూ రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఈ కారిడార్‌ ఏర్పాటుకు అప్పటి కేంద్ర మంత్రి గడ్కరీని ఒప్పించి మరీ స్టేట్‌మెంట్‌ ఇప్పించాం. అదీ విజన్‌ అంటే. ఇవన్నీ పూర్తయితే పురోగతి అనేది కనిపిస్తుంది. నంబర్స్‌ కనిపిస్తాయి. మా హయాంలో దేవుడి దయతో, ప్రజల ఆశీర్వాదాలతో రెండేళ్లు కోవిడ్‌ ఉన్నా గొప్పగా అభివృద్ధి, సేవలందించాం.  


గొప్ప సంస్కరణలకు శ్రీకారం.. 
మా హయాంలో నాడు–నేడు ద్వారా స్కూళ్లు మార్చాం. డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్, టోఫెల్‌ క్లాస్‌లు, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, సీబీఎస్‌ఈ కాదు ఐబీ సిలబస్‌ తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. విద్య, వైద్యం, వ్యవసాయంలో అనూహ్య మార్పులు తెచ్చాం. గ్రామాల్లో పౌర సేవలను గడప వద్దకు తీసుకువచ్చాం. గవర్నమెంట్‌ సేవల్లో పారదర్శకత ఉండదనే భావన లేకుండా చేశాం. ప్రభుత్వ సేవలు లంచాలు లేకుండా పొందగలమనే అభిప్రాయం ప్రజల్లో స్వచ్ఛందంగా నిరూపించగలిగాం. గొప్ప సంస్కరణలు తీసుకువచ్చాం. అందుకే సంతోషంగా, గర్వంగా ఉన్నాం. మూడేళ్లలో ఎవరూ చేయలేని గొప్ప కార్యక్రమాలు చేయగలిగాం. అందుకే ఇప్పటికీ చిరునవ్వుతో మా పార్టీ క్యాడర్‌ ఏ గడప వద్దకు అయినా వెళ్లగలుగుతున్నారు. మహిళా సాధికారత, సంస్కరణలు మాకు శ్రీరామ రక్ష. అందుకే ప్రజలను మమ్మల్ని ఇప్పటికీ ఆత్మీయంగా ఆదరిస్తున్నారు.  

అంతర్జాతీయ స్థాయిలో విశాఖను నిలబెట్టాలని..
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి విశాఖ కీలక కేంద్రం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలను తలదన్నే రీతిలో ఏపీ ఉండాలంటే విశాఖను అభివృద్ధి చేయాలని తలపెట్టాం. అందుకే ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు వేశాం. అందులో భాగంగా 2,700 ఎకరాల్లో భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టుకు శంకుస్థాపన చేశాం. భూ సేకరణకు, ఆర్‌అండ్‌ఆర్‌కు రూ.900 కోట్లు ఖర్చు చేశాం. గతంలో చంద్రబాబు ఈ ఎయిర్‌పోర్టుకు కేవలం 377 ఎకరాలు మాత్రమే భూమిని సేకరించారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో వేగంగా చర్యలు చేపట్టి 30 శాతం పనులు పూర్తి చేశాం. మరో ఏడాదికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. 

అంతే కాదు.. శ్రీకాకుళంలో మూలపేట పోర్టు ద్వారా ఉత్తరాంధ్ర దశ, దిశ మార్చే ప్రయత్నం చేశాం. భూ సేకరణతో పాటు అన్ని అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించి 30 శాతం పనులు పూర్తి చేశాం. విజయనగరంలో మెడికల్‌ కాలేజీ కడితే 3 బ్యాచ్‌లు క్లాసులు, కోర్సులు కూడా కంప్లీట్‌ అయ్యాయి. పాడేరు మెడికల్‌ కాలేజీలో క్లాసులు స్టార్ట్‌ అయ్యాయి. పార్వతీపురం, నర్సీపట్నం మెడికల్‌ కాలేజీల పనులు జరుగుతున్నాయి. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌కు రూ.100 కోట్లు వెచ్చించాం. రూ.600 కోట్లు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేజ్‌ వాటర్‌ తీసుకొచ్చి డయాలసిస్‌ రోగులకు శాశ్వత పరిష్కారం చూపించాం.  

సీతంపేట, పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు దాదాపు పూర్తి చేశాం. కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ పూర్తయ్యే దశలో ఉన్నాయి. సాలూరులో ట్రైబల్‌ యూనివర్సిటీ పనులు జరుగుతున్నాయి. నక్కపల్లిలో ఇండ్రస్టియల్‌ హబ్, అన్నవరంలో ఒబెరాయ్‌ హోటల్‌ రిసార్ట్‌ తీసుకొచ్చాం. డెస్టినేషన్‌గా విశాఖపట్నం ఉండాలంటే 5 స్టార్‌ హోటళ్లు కాదు.. ఏకంగా ఫైవ్‌ స్టార్‌ రిసార్టులు ఉండాలని సంకల్పించాం.  

⇒ రుషికొండ హై ఎండ్‌ టూరిజం రిసార్ట్‌ నిర్మించాం. అదొక మాన్యుమెంట్‌ బిల్డింగ్‌. అమరావతిలో చదరపు అడుగకు రూ.10 వేలు పెట్టి.. కట్టిందే కడుతున్నారు. డబ్బులు వేస్ట్‌ అవుతున్నాయి. ఎన్నిసార్లు కడతారో అర్థం కాదు. అదే సెక్రటేరియట్‌ రెండుసార్లు కడతారు.. అదే అసెంబ్లీ రెండు సార్లు కడతారు. డబ్బులు వృథా చేస్తుంటే ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే.. ఎల్లో మీడియా మొత్తం వాళ్లే. అంతా దోచుకోవడం, పంచుకోవడం తినుకోవడం!  బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో సైతం ఫైవ్‌ స్టార్‌ ఫెసిలిటీస్‌ ఉన్న ఫ్లాట్లు నిర్మాణ ఖర్చు చదరపు అడుగుకు రూ.4500  దాటదు. కానీ అమరావతిలో రూ.10 వేలు పెట్టి కడుతున్నారు. ఎవడూ స్కామ్‌ అనడు. ఎందుకంటే స్కాములో వీళ్లంతా భాగస్వాములే.

అదానీ డేటా సెంటర్‌కు కొనసాగింపే గూగుల్‌
‘‘డేటా సెంటర్‌ను మేం ఎక్కడా వ్యతిరేకించడం లేదు. మద్దతు ఇస్తున్నాం. మేం విత్తనం వేశాం కాబట్టే డేటా సెంటర్‌ ఏర్పాటవుతోంది. అదానీ డేటా సెంటర్‌కు కొనసాగింపే గూగుల్‌ డేటా సెంటర్‌. ప్రస్తుతం మనం ఏఐ యుగం, క్వాంటం కంప్యూటింగ్‌ యుగాల్లోకి పోతున్నాం. వీటన్నింటికీ హబ్‌ అనేది డేటా సెంటర్‌. డేటా సెంటర్‌ ఉంటేనే ఎకో సిస్టమ్‌ బిల్డ్‌ అవుతుంది. పవర్‌ రిక్వైర్‌మెంట్, వాటర్‌ గజిలింగ్‌ (ఎక్కువ విద్యుత్, ఎక్కువ నీటి వినియోగం) లాంటి కొన్ని సమస్యలు వచ్చినా సర్టైన్‌ కెపాసిటీ బిల్డ్‌ కావాల్సిన అవసరం అయితే ఉంది. 

అప్పటి దాకా ప్రతి ఒక్కరూ దానికి సపోర్ట్‌ చేయాల్సిన అవసరం ఉంది. డేటా సెంటర్‌తోపాటు ఐటీ స్పేస్‌ కూడా కట్టాలి.. తద్వారా 25 వేల ఉద్యోగాలు ఇవ్వాలని మేం ఒప్పందంలో పెట్టగలిగాం. నిర్దేశించిన సమయంలోగా ఇవన్నీ కట్టాలి, రావాలి అని ఒప్పందంలో పొందుపరిచాం. ఇది వీళ్లు చేయగలిగితే ఇంకా మెరుగ్గా ఎకో సిస్టమ్‌ అనేది వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది’ అని వైఎస్‌ జగన్‌ ఒక ప్రశ్నకు సమాధానంగా వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement