విజయవాడలో ధర్నా చేస్తున్న కాంట్రాక్టర్లు
గ్రామాల్లో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటుచేసిన చిన్న కాంట్రాక్టర్లకు రూ.826 కోట్ల బకాయిలు
బిల్లులు చెల్లించాలంటూ ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ ఆఫీసు ముందు ధర్నా
చిన్న కాంట్రాక్టర్లపై వివక్ష చూపిస్తున్నారంటూ మండిపాటు
ముందు పనులుచేసిన వారికి ముందు బిల్లులు చెల్లించాలని డిమాండ్
విజయవాడ గొల్లపూడిలో నల్లబ్యాడ్జీలతో ర్యాలీ
సాక్షి, అమరావతి: జలజీవన్ మిషన్ కార్యక్రమం కింద గ్రామాల్లో ఇంటింటికీ తాగునీటి కుళాయిలు ఏర్పాటుచేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు బుధవారం విజయవాడ గొల్లపూడిలోని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) ఈఎన్‌సీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం ఒకట్రెండు కార్పొరేట్ కాంట్రాక్టు సంస్థలకే ప్రాధాన్యతనిస్తూ, వందలాది చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించకుండా పక్షపాత ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి ఏప్రిల్ నెలల్లో రెండు విడతల్లో రూ.322 కోట్లు బిల్లులు చెల్లించినప్పటికీ, అందులో రూ.220 కోట్లు కేవలం బడా కాంట్రాక్టు సంస్థలకు చెల్లించి.. చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం కేవలం 15 శాతం చొప్పున చెల్లించారని, దాదాపు 750 మందికి కేవలం రూ.87 కోట్లు మాత్రం చెల్లించారని మండిపడ్డారు. బిల్లుల చెల్లింపులో చిన్న కాంట్రాక్టర్ల పట్ల వివక్ష చూపడం మాని ప్రభుత్వం అందరికీ సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు నల్లబ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
అధిక శాతం బకాయిలు చిన్న కాంట్రాక్టర్లవే..
కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్‌డబ్ల్యూఎస్ పరిధిలో ఇంటింటికీ కుళాయిల ఏర్పాటుకు రూ.10 లక్షల నుంచి రూ.రెండు కోట్ల మధ్య విలువ ఉండే పనులు చేసిన వందలాది మంది కాంటాక్టర్లకు రూ.826 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అలాగే, వందల కోట్ల విలువతో వాటర్ గ్రిడ్ పనులు చేసిన నాలుగైదు కార్పొరేట్ కాంట్రాక్టు సంస్థలకు మాత్రం రూ.130 కోట్లు మించి బిల్లులు పెండింగ్‌లో లేవని చిన్న కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అయినా చిన్న కాంట్రాక్టర్లను పక్కనపెట్టి.. అప్పటికప్పుడు బిల్లులు నమోదు చేసిన బడా సంస్థల బిల్లులు చెల్లించారని విమర్శిస్తున్నారు.
ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల కోసం గతనెల 3న రూ.152 కోట్ల విడుదలకు బీఆర్‌ఓ (బడ్జెట్ రిలీజ్ ఆర్డర్) జారీచేయగా, చిన్న కాంట్రాక్టర్లందరూ కలిసి ముందు పనులు చేసిన వారికి ముందుగా బిల్లులు చెల్లించాలని కోరారు. అయితే, బీఆర్‌ఓ విడుదల తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వం ఆ నిధులు విడుదల చేయలేదు. తాజాగా.. వారం రోజుల క్రితం రూ.150 కోట్ల విడుదలకు ఆర్థిక శాఖ మరో బీఆర్‌ఓ జారీచేసింది. దీంతో.. నిధుల విడుదలకు ప్రభుత్వం జారీచేసిన రెండు బీఆర్‌ఓల మొత్తం రూ.302 కోట్లను వెంటనే విడుదలచేసి ముందు పనులు చేసిన వారికి ముందుగా బిల్లులు చెల్లించాలని చిన్న కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. వాటర్ గ్రిడ్ పేరిట భారీ ప్యాకేజీలతో ప్రభుత్వం టెండర్లు పిలుస్తుండడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని చిన్న కాంట్రాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.


