
అనంతపురం రూరల్ పాపంపేటలో కబ్జాదారులు ఆక్రమించిన 42/2 సర్వే నంబరులోని భూమి
రాష్ట్రంలోనే అతిపెద్ద భూ కబ్జా
అనంతపురం శివారులో శోత్రియం భూముల కబ్జాకు యత్నాలు
ఇప్పటికే రూ.450 కోట్ల విలువైన భూములకు జీపీఏ రిజిస్ట్రేషన్
68 ఏళ్ల కిందట అమ్మిన వ్యక్తి వారసుడి నుంచి జీపీఏ
ఖాళీ స్థలాలకు కంచె.. అడ్డొచ్చేవారికి బెదిరింపులు
తెరవెనుక రాప్తాడుకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి
ప్రభుత్వ కీలక నేత అభయం ఇచ్చినట్లు ప్రచారం
పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదంటున్న బాధితులు
అక్రమార్కులకు సహకరిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు.. ఏరోజు
ఎవరి ఆస్తి దొంగ రిజిస్ట్రేషన్ అవుతుందోనని ప్రజల్లో భయాందోళనలు
సాక్షి, నెటవర్క్: పైన చెప్పుకొన్న రెండు ఆక్రమణల దందాలు చాలా చిన్నవి...! వీటికి వందల రెట్ల విలువైన... రాష్ట్రంలోనే అతిపెద్ద భూ కబ్జా అనంతపురం రూరల్ పాపంపేటలో జరుగుతోంది...! కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా ఇక్కడి రూ.3,300 కోట్ల విలువైన 550 ఎకరాల శోత్రియం భూములపై ‘పచ్చ’ ముఠా కన్నుపడింది. అనంతపురం నగరంలో కలిసిపోయిన పాపంపేట భూములకు మంచి డిమాండ్ ఉంది. దీంతో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి బంధువులు, అనుచరులు రంగంలోకి దిగి వాటిని చెరబడుతున్నారు. పాపంపేట భూములతో సంబంధం లేని, ఎప్పుడో 68 ఏళ్ల కిందట విక్రయించిన రాచూరి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కుమారుడు వెంకటకిరణ్‌తో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) రాయించుకున్నారు.
ఈయన వద్ద ఎలాంటి నెల్లూరు సెటిల్‌మెంట్ పట్టా లేదు. వాస్తవంగా అయితే, ఎక్కడైనా వీరి భూములు మిగులుగా ఉన్నప్పటికీ... నెల్లూరు సెటిల్‌మెంట్ పట్టాల్లేని కారణంగా అవి ప్రభుత్వ భూములు అవుతాయి. కానీ, అధికారాన్ని అడ్డుపెట్టుకుని గత ఏడాది అక్టోబరు నుంచి రాచూరి వెంకటకిరణ్‌తో ఒక్కొక్కటిగా జీపీఏ రిజి్రస్టేషన్లు చేసుకుంటున్నారు. మెజార్టీ డాక్యుమెంట్లలో పరిటాల సునీత బంధువు కె.వెంకటచౌదరి పేరు ఉండడం గమనార్హం.
ఇప్పటిదాక 45 డాక్యుమెంట్లను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఇలా జీపీఏ చేసుకున్న భూముల విలువ రూ.450 కోట్లకు పైమాటే. మొత్తం 550 ఎకరాల్లోనూ పాగా వేయాలని చూస్తూ ఎక్కడికక్కడ ‘హెచ్చరిక’ బోర్డులు నాటారు. ఈ వ్యవహారంలో ఇక్కడి ప్రజాప్రతినిధికి అమరావతి నుంచి ‘చినబాబు’ అభయం ఇచి్చనట్లు తెలిసింది. కాగా, 550 ఎకరాల్లో ప్రజావసరాల కోసం 40 శాతం (220 ఎకరాలు) పోగా 330 ఎకరాలు మిగులుగా ఉంటుంది. వీటి విలువ ఎకరా సగటున రూ.10 కోట్లకు పైనే ఉంది. ఈ లెక్కన 330 ఎకరాలకు రూ. 3,300 కోట్లు అవుతుంది.
ముందుగా ఖాళీ స్థలాలపై కన్ను...
జీపీఏ రాయించుకున్న వారంతా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అస్మదీయులే. ఈ డాక్యుమెంట్లను అడ్డుపెట్టుకుని ముందుగా ఖాళీ స్థలాలపై పడుతున్నారు. చాలాచోట్ల ‘హెచ్చరిక’ బోర్డులు ఏర్పాటు చేశారు. నెమ్మదిగా తమ నివాసాలపైనా వాలుతారనే భయం ఈ ప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. విలువైన తమ భూములను అధికార బలంతో కాజేస్తారని వీరు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వీరి ఉద్దేశాలను ప్రచారంలో పెట్టడంతో ఏ క్షణం ఎవరి ఆస్తి దొంగ రిజిస్ట్రేషన్ అవుతుందోనని ప్రజలు భయపడుతున్నారు.
రిజిస్ట్రేషన్ అధికారుల సహకారం...
అక్రమార్కులకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సహకరిస్తున్నారు. పాపంపేట పొలంలోని శోత్రియం భూములన్నింటికీ నెల్లూరు సెటిల్‌మెంట్ పట్టాలు ఉన్నాయి. ఇవేవీ చూడకుండానే 1952, 1956లో తన తండ్రికి హక్కుగా వచి్చన భూముల డాక్యుమెంట్ల ఆధారంగా రాచూరి వెంకటకిరణ్ జీపీఏ చేసినా రిజిస్ట్రేషన్ అధికారులు సహకరించారు. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. పైగా అప్పట్లో పైమాసీ నంబర్లుగా ఉన్న భూములను ప్రస్తుతం ఉన్న సర్వే నంబర్ల ఆధారంగా జీపీఏ చేయించడం గమనార్హం. ఇందులో ఓ సబ్ రిజి్రస్టార్ కీలకపాత్ర పోషించారు. కబ్జా చేసేందుకు జీపీఏ చేసుకున్న భూముల్లో 70 శాతం దాక కమ్మ, వైశ్య సామాజిక వర్గాలకు చెందినవే కావడం గమనార్హం.
జీపీఏ చేసుకున్న వాటిల్లో కొన్ని ఇలా
పాపంపేట 68–1 సర్వే నంబరులో 6.76 ఎకరాలు, 39–1,39–2లో 2.30 ఎకరాలు, 36లో రెండెకరాలు, 66లో 2.30 ఎకరాలు, 42–2లో 1.30 ఎకరాలు, 43–2లో ఎకరం, 36–1,42–1లో ఎకరం, 38–5లో 44 సెంట్లు, 74లో 17.5 సెంట్లు. సర్వే నం.1లో 60 సెంట్లు
పాపంపేట భూముల కథా కమామీషు ఇది...
⇒ గతంలో శేషగిరిరావు అనే వ్యక్తికి పాపంపేటలో 932.52 ఎకరాల శోత్రియం భూములు ఉండేవి. అనంతపురం నడిమివంక నుంచి అటు కళ్యాణదుర్గం రోడ్డు, ఇటు బళ్లారి రోడ్డుకు ఇరువైపులా ఈ పొలాలున్నాయి. శేషగిరిరావు నుంచి 1879లో కట్టమంచి వెంకటరావు, ఆయన నుంచి 1910లో గొల్లపల్లి లక్ష్మీనరసింహశాస్త్రి భూమిని కొన్నారు. అమ్మినది పోగా... 1952లో లక్ష్మీనరసింహశాస్త్రి కుటుంబసభ్యులు భాగ పరిష్కారం చేసుకున్నారు. ఇందులో గొల్లపల్లి శంకరయ్య, గొల్లపల్లి సీతారామయ్యకు పావు వంతు (1/4), రాచూరి వెంకటరామశాస్త్రి, రాచూరి సుబ్రహ్మణ్యంకు ముప్పావు వంతు (3/4) దక్కింది. అంటే, రాచూరి కుటుంబానికి 550 ఎకరాలు (ఒకే షెడ్యూలు), గొల్లపల్లి కుటుంబ సభ్యులకు 209.60 ఎకరాలు (4 షెడ్యూళ్లు) వచ్చాయి.
⇒ తమ వాటా 550 ఎకరాలలో విక్రయించిన భూములు పోను మిగిలిన 224 ఎకరాలకు 1956లో రాచూరి కుటుంబసభ్యులు భూ పరిష్కారాలు చేసుకున్నారు. రాచూరి వెంకటరామశాస్త్రి, రాచూరి సుబ్రహ్మణ్యం చెరో 12 ఎకరాలు రాసుకుని మిగతా 200 ఎకరాలను ఉమ్మడిగా పెట్టుకున్నారు. దీంట్లో 116.41 ఎకరాలను 1957లో 14 మందికి (పరుచూరి వెంకటస్వామి, పరుచూరి శ్రీరాములు, పరుచూరి పాండురంగయ్య, నీలి పెద్ద అంజనప్ప, నీలి రామన్న, నీలి పెద్ద హనుమంతయ్య, పొలూరు భూమన్న, సుబ్బమ్మ, కొండయ్య, మేకల నాగప్ప, మేకల చిన్నవెంకట స్వామి, లక్ష్మమ్మ, మేకల వెంకటేశు, పరుచూరి కోటయ్య)విక్రయించారు. వీరంతా ఉమ్మడిగా కొన్నారు. 1960లో ఈ 14 మంది భాగ పరిష్కారాలు చేసుకున్నారు. 1968 నుంచి నెల్లూరు సెటిల్‌మెంట్ ఆఫీసర్ ద్వారా పట్టాలు పొందారు. పైమాసీ నంబర్లుగా ఉన్న ఈ భూములకు సెటిల్‌మెంట్ సమయంలో సర్వే నంబర్లు ఇచ్చారు.
⇒ ఈ 14 మందే కాదు... అప్పటికే రాచూరి, కొండపల్లి కుటుంబాల నుంచి కొన్నవారు భూములన్నింటికీ నెల్లూరు సెటిల్‌మెంట్ పట్టాలు తెచ్చుకున్నారు. తర్వాత అమ్మకాలు జరుగుతూ భూములు చేతులు మారుతూ వచ్చాయి. ఇంకా వారి వద్ద మిగులు ఉంటే కచి్చతంగా నెల్లూరు సెటిల్‌మెంట్ పట్టాలు పొంది ఉండాలి. కానీ, వారి వారసుల వద్ద అలాంటి పట్టాలేవీ లేవు. ఈ మొత్తం దందాలో రాప్తాడు ప్రజాప్రతినిధి మనుషులు గొల్లపల్లి కుటుంబానికి వాటాగా వెళ్లిన భూములకు సైతం రాచూరి వెంకటకిరణ్‌తో జీపీఏ చేయించుకుని బోర్డులు నాటడం గమనార్హం.
పిల్లల వైద్యుడి స్థలంపై ‘భూ’చోళ్లు...
ఇదిగో ఈ ఫొటో చూడండి. అనంతపురం–బళ్లారి రోడ్డులో సాయిబాబా గుడి పక్కన ఉన్న స్థలం ఇది. అనంతపురం రూరల్ పాపంపేట ప్రాంతంలోని ఈ భూమిని 2024 ప్రారంభంలో అనంతపురానికి చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్యుడు... సెంటు రూ.25 లక్షల చొప్పున 60 సెంట్లు కొన్నారు. మొత్తం రూ.15 కోట్లు వెచి్చంచారు. నిరుడు నవంబరులో తన స్థలానికి రక్షణగా కంచె వేసుకుంటుండగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువు కె.వెంకటచౌదరితోపాటు మరికొందరు వెళ్లి దౌర్జన్యంగా కాంపౌండ్‌ను పగులగొట్టారు.
ఈ భూమి తమకు రిజిస్ట్రేషన్ అయ్యిందని, ఫెన్సింగ్ వేయొద్దని హెచ్చరించారు. భయపడిన డాక్టర్... స్థానిక పోలీసులను ఆశ్రయించినా లాభం లేకపోయింది. చివరకు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అంతేకాక... అక్రమార్కులు మరొకరికి అమ్మేస్తారేమోనని భయపడి ఈ సర్వే నంబరులో క్రయ విక్రయాలు జరగకుండా కలెక్టర్‌ను సంప్రదించి రిజిస్ట్రేషన్ బ్లాక్ చేయించారు. పోలీసు రక్షణతో చుట్టూ ఫెన్సింగ్ వేయించుకున్నా... భయంభయంగానే గడుపుతున్నారు.
బెదిరించి... పోల్స్ పాతేశారు
ఇదిగో సిమెంట్ పోల్స్ పాతిన ఈ ఫొటోను పరిశీలించండి. పాపంపేట సర్వే నంబరు 42/2లో ఉన్న ఎకరం భూమి ఇది. విలువ రూ.15 కోట్ల వరకు ఉంటుంది. 2006 డిసెంబరులో సుంకు కుమారస్వామి, సుంకు కేదార్‌నాథ్‌ల నుంచి గొంది వెంకటసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కొన్నారు. నాటి నుంచి ఈయన కుటుంబం ఆధీనంలోనే ఉంది. గత ఏడాది నవంబరు 26న వెంకటచౌదరి, శ్రీరాములు మరికొందరు దౌర్జన్యంగా ప్రవేశించి... ‘ఈ భూమి మాది. మేం కొన్నాం.
అన్ని ఆధారాలూ మా వద్ద ఉన్నాయి. ఇందులోకి వస్తే బాగుండదు’ అంటూ గొంది వెంకట సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను బెదిరించారు. వెంటనే వెంకటచౌదరి, అతడి అనుచరులు మొత్తం భూమి చుట్టూ సిమెంటు పోల్స్ పాతారు. బాధితులు అక్కడినుంచే ఎస్పీకి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్‌లో లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చారు. కానీ, వారి భూమిలో దౌర్జన్యం చేసినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఈ భూమిలోకి ఎవరూ వెళ్లొద్దంటూ పోలీసులే ఆంక్షలు విధించారు. బాధితులు నేరుగా సీఎం చంద్రబాబుకు సైతం లేఖ రాశారు.