
సత్యప్రసాద్ మానసిక అనారోగ్యానికి చికిత్స పొందుతున్నాడని 2024 ఆగస్టు 18న మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ వై. ప్రభాకర్‌రావు ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్
మానసిక సమస్యలున్న సత్యప్రసాద్ వాంగ్మూలంతో అక్రమ అరెస్టులు..
మద్యంపై అక్రమ కేసులో చంద్రబాబు సర్కారు బరితెగింపు..
తీవ్ర మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సత్యప్రసాద్
తాజాగా బట్టబయలైన వైద్య నివేదికలతో తీవ్ర కలకలం
అటువంటి వ్యక్తి వాంగ్మూలం ఆధారంగా అక్రమ అరెస్టులకు పాల్పడ్డ సిట్
ఆ అక్రమ కేసుల ఆధారంగా ఇచ్చిన వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుందని సర్వత్రా తీవ్ర విస్మయం.. మద్యంపై అక్రమ కేసులో వరుసగా బెడిసికొడుతున్న కూటమి సర్కారు కుతంత్రాలు
164, 161 అబద్ధపు వాంగ్మూలాల కుట్రలు విఫలం
మిథున్‌రెడ్డిపై అభియోగాలకు ఆధారాలే లేవన్న న్యాయస్థానం
చార్జ్‌షీట్‌పై న్యాయస్థానం ప్రశ్నలతో సిట్‌కు షాక్
ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్
రూ.11 కోట్ల నగదు జప్తు డ్రామా బట్టబయలు
సోదాల పేరుతో లేని ఆధారాలు సృష్టించే పన్నాగం విఫలం
వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా మద్యం విధానం.. అవినీతి లేదు... కుంభకోణం అసలే లేదు
అందుకే అబద్ధపు వాంగ్మూలాలతో అక్రమ కేసుకు ప్రభుత్వం కుట్ర
అసలు మద్యం డాన్ చంద్రబాబే.. ఆధారాలతో సహా నిరూపించిన సీఐడీ
ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పైనే..
2024 నుంచి మరింత బరితెగించి మద్యం దోపిడీ
నకిలీ మద్యం మాఫియా వ్యవస్థీకృతంతో టీడీపీ సిండికేట్ బరితెగింపు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ హయాంలో మద్యం విధానంపై చంద్రబాబు సర్కారు అక్రమ కేసుల కుట్రలకు సంబంధించి విభ్రాంతికర వాస్తవాలు బట్టబయలయ్యాయి. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో అల్లిన ఈ కుట్ర కేసులో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. తీవ్ర మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్ వాంగ్మూలం ఆధారంగా ఈ అక్రమ కేసు దర్యాప్తును ‘సిట్’ కొనసాగిస్తోందన్న వాస్తవం తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఇదేం దర్యాప్తు..? అలాంటి వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరెస్టులు చేయడం ఏమిటి?.. ఈ అక్రమ కేసులకు ఏం విలువ ఉంటుంది..? అని న్యాయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇప్పటికే బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డిని బెదిరించి ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలం బాగోతం బహిర్గతమైన విషయం తెలిసిందే. తాజాగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సత్యప్రసాద్ వాంగ్మూలం కథ కూడా కంచికి చేరినట్లేనన్నది తేటతెల్లమవుతోంది. ఈ అక్రమ కేసులో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిట్ అల్లిన కట్టుకథల కుట్రలు ఒక్కొక్కటిగా బెడిసికొడుతున్నాయి. లేని కుంభకోణాన్ని ఉన్నట్లుగా చిత్రీకరించేందుకే కూటమి సర్కారు ఇంతగా బరి తెగించిందన్నది స్పష్టమవుతోంది.
మరోవైపు మద్యం దోపిడీ మాఫియా టీడీపీ కూటమి పెద్దల నిర్వాకమేనన్నది ఆధారాలతో సహా నిరూపితమవుతోంది. చంద్రబాబు సర్కారు భేతాళ కుట్రలు న్యాయస్థానాల సాక్షిగా పటాపంచలు కావడం.. వైఎస్సార్ సీపీపై బురద చల్లాలని యత్నించి భంగపడటం.. నకిలీ మద్యం కేసులో కూటమి సర్కారు అడ్డంగా దొరికిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
బెదిరించి.. దారికి తెచ్చుకుని..
బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవ రెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌ను గతంలోనే టీడీపీ వీరవిధేయ సిట్ అధికారులు బెదిరించి తమకు అనుకూలంగా మలచుకున్నారు. తాము చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌లను సిట్ అధికారులు బెదిరించారు. అందుకు వారిద్దరూ మొదట్లో సమ్మతించ లేదు. అంతేకాదు అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని తమని పోలీసులు బెదిరిస్తున్నారని వాసుదేవరెడ్డి న్యాయస్థానంలో మూడు సార్లు పిటిషన్లు కూడా దాఖలు చేశారు.
అయినా సరే సిట్ అధికారులు వారిని వెంటాడి వేధించారు. డెప్యుటేషన్ ముగిసినా సరే వాసుదేవరెడ్డి కేంద్ర సర్వీసులకు తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకుండా వేధించారు. అంతేకాదు ఆయన్ని మూడు రోజులపాటు అక్రమంగా నిర్బంధించి బెంబేలెత్తించారు. దీంతో సిట్ అధికారుల కుట్రలకు వాసుదేవరెడ్డి తలొగ్గారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేశారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం గమనార్హం.
కేవలం వారిద్దరి అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే ఈ కేసులో సిట్ అధికారులు ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తదితరులను అక్రమంగా అరెస్టు చేశారు. ఆ కుట్రలన్నీ న్యాయస్థానం విచారణలో ఒక్కొక్కటిగా బెడిసికొట్టాయి. దాంతో వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం విధానంపై కూటమి ప్రభుత్వం నమోదు చేసింది అక్రమ కేసేనన్నది స్పష్టమవుతోంది.
ముందస్తు బెయిల్ పన్నాగం
తాము బెదిరించి లొంగదీసుకున్న వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌లను సిట్ అధికారులు ఇప్పటివరకు అరెస్టు చేయ లేదన్నది తెలిసిందే. ఈ ఏడాది జూలైలో వారిద్దరితో ఈ కేసులో అప్రూవర్లుగా మారేందుకు అనుమతించాలని పిటిషన్ వేయించాలని భావించారు. అందుకోసం వారిద్దరినీ కొందరు సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి తీసుకువచ్చారు. కాగా వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ పిటిషన్లను న్యాయస్థాన వర్గాలు పరిశీలించాయి.
అప్రూవర్లుగా మారాలంటే ముందు అరెస్టు కావాలి... న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లాలని వారిద్దరికి స్పష్టం చేశాయి. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉంటూనో... తరువాత ఎప్పుడో బెయిల్‌పై విడుదల అయిన తరువాత మాతమ్రే అప్రూవర్ పిటిషన్‌ను న్యాయస్థానంలో దాఖలు చేయాలన్నది నిబంధన అని స్పష్టం చేశాయి. అంతేగానీ కేసులో నిందితులుగా ఉన్నవారు కనీసం అరెస్టు కాకుండా... జైలుకు వెళ్లకుండా అప్రూవర్లుగా మారేందుకు పిటిషన్ దాఖలు చేయడం కుదరదని చెప్పడతో వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ కంగుతిన్నారు.
అప్రూవర్ పిటిషన్ దాఖలు చేసేందుకు వెనకడుగు వేశారు. దాంతో సిట్ అధికారులు కొత్త ఎత్తుగడ వేశారు. వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌లతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయించారు. ఆ ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానంలో వ్యతిరేకించకుండా సహకరిస్తామని సిట్ అధికారులు వారికి చెప్పినట్టు సమచారం. కాగా హడావుడిగా అప్పటికప్పుడు దాఖలు చేసిన ఆ పిటిషన్లకు తగిన పత్రాలు జతపరచకపోవడంతో న్యాయస్థానం ఆ పిటిషన్లను వెనక్కి పంపింది.
అబద్ధపు వాంగ్మూలాల కుట్రే
ఈ తాజా పరిణామాలు ఓ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పూర్తి పారదర్శకంగా అమలు చేశారని చంద్రబాబు ప్రభుత్వమే పరోక్షంగా అంగీకరించినట్టైంది. రెడ్‌బుక్ కక్ష సాధింపు కోసం తాము నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు కోసం పూరిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలపైనే ఆధారపడ్డామని బయటపెట్టుకుంది. సిట్ నమోదు చేసిన 161, 164 వాంగ్మూలాలన్నీ కట్టుకథలేనన్నది స్పష్టమైంది.
మిథున్ రెడ్డిపై కుట్ర విఫలం
ఈ అక్రమ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసిన ప్రభుత్వ కుట్రలు చివరికి విఫలమయ్యాయి. డికార్ట్ లాజిస్టిక్ కంపెనీ నుంచి ఆయన కుటుంబ సంస్థకు రూ.5 కోట్లు వచ్చాయనే నెపంతో ఆయన్ను అరెస్టు చేశారు. కాగా తమ నిర్మాణ సంస్థ లో సబ్ కాంట్రాక్టు చేసేందుకు డిపాజిట్‌గా రూ.5 కోట్లు చెల్లించారని... కోవిడ్ పరిస్థితుల్లో ఆ సబ్ కాంట్రాక్టు చేయలేకపోవడంతో తాము ఆ మొత్తాన్ని ఆ కంపెనీకి తిరిగి చెల్లించామని మిథున్‌రెడ్డి తమ బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఇతర ఆధారాలు న్యాయస్థానానికి సమర్పించారు. ఇక ఆయనపై నమోదు చేసిన అభియోగాల్లో సిట్ కనీస ఆధారాలు కూడా చూపలేకపోయిందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మిథున్‌రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఇక ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వంలో కనీసం ఆ శాఖ మంత్రిగా కూడా లేరు. అలాంటప్పుడు ఇక మద్యం వ్యవహారాలతో వారికి ఏం సంబంధం ఉంటుంది? ‘‘ఈ కేసులో మిథున్‌రెడ్డి మాస్టర్ మైండ్ అని, కీలక పాత్ర పోషించారని, ఇందుకు ప్రాసిక్యూషన్.. సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలంపై ఆధార పడుతోంది. కానీ ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదు. సహ నిందితుల వాంగ్మూలాలు, కొందరు సాక్షులు ఇచ్చిన 164, 161 స్టేట్‌మెంట్లు మినహా ఇతర ఆధారాలను సమర్పించలేదు. ఇవి బెయిల్ నిరాకరించడానికి ఎంత మాత్రం సరిపోవు..’’ అని ఈ కేసులో మిథున్‌రెడ్డికి బెయిల్ మంజూరు సందర్భంగా ఏసీబీ కోర్టు స్పష్టం చేయడం గమనార్హం.
న్యాయస్థానం ప్రశ్నలకు సిట్ తెల్లమొహం
ఇక ఈ కేసులో సిట్ కుట్రపూరితంగానే నిరాధార ఆరోపణలతో చార్జ్‌షీట్లు దాఖలు చేసిందన్నది వెల్లడైంది. మొదటి చార్జ్‌షీట్, అనుబంధ చార్జ్షీట్లను పరిశీలించి న్యాయస్థానం లేవనెత్తిన 21 అభ్యంతరాలపై సిట్ సమాధానం చెప్పలేకపోయింది. అందుకే సీఆర్‌సీపీ సెక్షన్ 167(2) ప్రకారం ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ ఎండీ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేసింది.
మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిపై సిట్ అక్రమ కేసు నమోదు చేసిందని తేటతెల్లమైంది. సిట్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.
సోదాల ముసుగులో..
ఇక ఈ అక్రమ కేసు దర్యాప్తు ముసుగులో సిట్ బరితెగించి వేధింపులకు పాల్పడింది. ప్రధానంగా సోదాల పేరుతో కుట్రపూరితంగా వ్యవహరించింది. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నర్రెడ్డి సునీల్ రెడ్డి తదితరుల నివాసాల్లో సోదాల పేరుతో హైడ్రామాకు తెరతీసింది. సోదాల పేరుతో తామే అబద్ధపు ఆధారాలు సృష్టించేందుకు సిట్ అధికారులు పన్నాగం పన్నారు. ఒకరి నివాసంలో సోదాలతో ఏదో సమాచారం లభించిందని చెప్పి మరొకరి నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. లేని ఆధారాలు సృష్టించేందుకు పడరాని పాట్లు పడ్డారు.
జడ్జిపై లూథ్రా అభ్యంతరకర వ్యాఖ్యలు
ఇక ఈ అక్రమ కేసులో అడ్డగోలుగా వాదించేందుకు యత్నించిన ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాపై ఏసీబీ న్యాయస్థానం మండిపడింది. అక్రమంగా అరెస్టు చేసిన నిందితులకు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదన్న కోర్టు ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పలేకపోయారు. కౌంటర్ అఫిడవిట్‌లోని అంశాలను చదువుతూ పక్కదారి పట్టించేందుకు యత్నించడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా సిద్ధార్థ్ లూథ్రా ఏకంగా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు విభ్రాంతి కలిగించాయి. ఆ జడ్జిని బదిలీ చేయాలని ప్రభుత్వానికి సూచిస్తానని హైకోర్టులో వ్యాఖ్యానించడం విభ్రాంతి కలిగించింది. న్యాయస్థానాలనే బ్లాక్‌మెయిల్ చేసేలా మాట్లాడటంపై న్యాయ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరింత బరితెగించి మద్యం దోపిడీ
2024లో అధికారంలోకి రాగానే టీడీపీ కూటమి ప్రభుత్వం మరింత బరితెగించి మద్యం దోపిడీకి తెగిస్తోంది. అందుకోసమే ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి 3,336 ప్రైవేటు మద్య దుకాణాలను టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టింది. వాటికి అనుబంధంగా 3,336 పర్మిట్ రూమ్‌లకు అనుమతులు ఇచ్చింది. 540 బార్లను టీడీపీ సిండికేట్‌కే కట్టబెట్టింది. త్వరలో మరో 300 బార్లు కట్టబెట్టేందుకు సిద్ధపడుతోంది. ఇక ఏకంగా 75వేల బెల్ట్ దుకాణాలతో మద్యం ఏరులై పారిస్తోంది.
ఎంఆర్‌పీ కంటే రూ.20 అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతోంది. ఏకంగా ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాకు బరితెగించింది. టీడీపీ నేతలే సూత్రధారులు, పాత్రధారులుగా నకిలీ మద్యం తయారీ యూనిట్లను కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేశారు. మూడోవంతు నకిలీ మద్యం అమ్మకాలతో దోపిడీకి పాల్పడుతున్నారు. ఐదేళ్లలో రూ.45వేల కోట్ల దోపిడీ లక్ష్యంగా నకిలీ మద్యం మాఫియా చెలరేగిపోతోంది.
మద్యం కుట్రదారు చంద్రబాబే.. ఇప్పటికీ బెయిల్‌పైనే ఉన్న బాబు
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో ఏకంగా రూ.25వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారు. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతోసహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పుటి సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ, సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పైనే ఉన్నారన్నది అసలు నిజం. గత ఏడాది రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతానికి మించిన స్థాయిలో మద్యం దోపిడీకి తెగబడుతున్నారు. మద్యం విధానం ద్వారా తమ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ కుట్రకు తెరతీసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి సిట్ ద్వారా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది.
వీగిన కుట్రలు...
రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే కుట్ర....
ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామే
రెడ్‌బుక్ కుట్ర కేసుకు కేంద్ర బిందువుగా రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రం దాగుంది. ఇక అసలు విషయం ఏమింటే... రాజ్ కేసిరెడ్డి ఎవరో కాదు... ఆయన టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) వ్యాపార భాగస్వామి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కూడా. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)తో భాగస్వామిగా వ్యాపారాలు నిర్వహించారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘డే ఇన్‌ఫ్రాకాన్ ఎల్‌ఎల్‌పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు.
అక్రమంగా నిధులు తరలించారని సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ హైదరాబాద్‌లోని ఒకే చిరునామాతో (జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి. అంతే కాదు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ (accounts@ws hanviinfraprojects.com)నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్‌లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు.
రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి అయిన కేశినేని చిన్ని మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడే కాదు బినామీ అన్నది బహిరంగ రహస్యమే. అందుకే పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. రాజ్ కేసిరెడ్డి చెప్పని విషయాలను చెప్పినట్టుగా సిట్ వాంగ్మూలం నమోదు చేసింది. ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం చేయలేదని సిట్ అధికారులే ఆ రిమాండ్ నివేదికలో వెల్లడించారు కూడా. లేకపోతే రాజ్ కేసిరెడ్డి తాను ఆ వాంగ్మూలం ఇవ్వలేదని న్యాయస్థానానికి చెబితే తాము ఇబ్బందిపడాల్సి వస్తుందనే భయంతోనే సిట్ ఆ విషయాన్ని నివేదికలో పేర్కొంది.
మానసిక రోగి సత్య ప్రసాద్..!
కాగా ఈ అక్రమ కేసులో వెల్లడైన ఓ కొత్త విషయం ఆసక్తికరంగా మారింది. సత్య ప్రసాద్ దీర్ఘకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అనంతపురానికి చెందిన మానసిక వైద్య నిపుణులు డా.ఎండ్లూరి ప్రభాకర్, పి.విజయ పద్మ ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు వెల్లడైంది. సత్య ప్రసాద్ మానసిక అనారోగ్య సమస్యలకు వారిద్దరూ ప్రిస్రైబ్ చేసిన ప్రిస్క్రిప్షన్ కాపీలు బయటపడ్డాయి. అంటే ఎంతో కాలంగా ఆయన మానసిక ఆరోగ్యం సరిగా లేదన్నది స్పష్టమైంది. మానసికంగా ఆరోగ్యంగా లేని సత్య ప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది.
ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తదితరులను సత్య ప్రసాద్‌తో చెప్పించిన అబద్ధపు వాంగ్మూలం ఆధారంగానే అక్రమంగా అరెస్టు చేశారు. ఆయన తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నారనే వాస్తవాన్ని గోప్యంగా ఉంచేందుకు సిట్ అధికారులు యత్నిస్తున్నారు. కానీ సత్య ప్రసాద్ మానసిక ఆరోగ్యం సరిగా లేదని తాజాగా బయటపడటం సిట్ బండారాన్ని బట్టబయలు చేసింది.
బెడిసికొట్టిన రూ.11కోట్ల జప్తు కుట్ర
ఇక లేని ఆధారాలు సృష్టించేందుకే సిట్ అధికారులు రాజ్ కేసిరెడ్డి ఫాం హౌస్‌లో రూ.11కోట్లు స్వా«దీనం చేసుకున్నట్టు డ్రామాకు తెరతీశారు. కాగా ఆ నగదు తనది కాదని...దీనిపై విచారించాలని రాజ్ కేసిరెడ్డి కోర్టును ఆశ్రయించడంతో సిట్ కుట్ర బెడిసికొట్టింది. దాంతో సిట్ అధికారులు ఆ రూ.11 కోట్ల నగదును అర్ధరాత్రి బ్యాంకులో జమ చేసి కప్పిపుచ్చేందుకు యత్నించారు. ఇక ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించింది. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్‌ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో వెంకటేష్ నాయుడు పాత వీడియోను తెరపైకి తీసుకొచ్చి అది మద్యం డబ్బులేనంటూ ప్రచారం చేశారు.
గన్‌మెన్‌పైనే థర్డ్ డిగ్రీ
వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పని చేసిన గిరి, మదన్ రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం తీవ్రస్థాయిలో వేధించారు. బెంబేలెత్తిన గిరి సిట్ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. దాంతో ఆయనకు వెంటనే జీతం పెంచి మరీ ప్రమోషన్ కల్పించి పోస్టింగ్ ఇచ్చారు. అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేందుకు సమ్మతించని మదన్ రెడ్డిపై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం విభ్రాంతి కలిగించింది.
సిట్ అధికారులు తనపై భౌతికంగా దాడి చేశారని ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు కూడా. ఇక అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవి ఇవ్వడంతోపాటు రూ.2కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్ అధికారుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్నేహితుడు వెంకటేశనాయుడు దంపతులను ప్రలోభ పెట్టారు. అందుకు వారు తిరస్కరించడంతోనే ఈ కేసులో వెంకటేశ్‌నాయుడును అరెస్టు చేశారు.
ఆయన పాత్రను నిరూపించే ఆధారాల్లేవు
‘‘కేవలం కేసు తీవ్రత, పరిమాణం మాత్రమే కాక నిందితుడి పాత్ర, దర్యాప్తు అధికారులు సేకరించిన ఆధారాలను బట్టే బెయిల్ మంజూరుపై నిర్ణయం ఉంటుంది. ప్రస్తుత కేసులో పిటిషనర్ పాత్రను నిర్ధారించేందుకు సరైన, బలమైన ఆధారాలేవీ లేవు..’’
‘‘ఈ కేసులో మిథున్‌రెడ్డి మాస్టర్ మైండ్ అని, కీలక పాత్ర పోషించారని, ఇందుకు ప్రాసిక్యూషన్.. సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలంపై ఆధార పడుతోంది. కానీ ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదు. సహ నిందితుల వాంగ్మూలాలు, కొందరు సాక్షులు ఇచ్చిన 164, 161 స్టేట్‌మెంట్లు మినహా ఇతర ఆధారాలను సమర్పించలేదు. ఇవి బెయిల్ నిరాకరించడానికి ఎంత మాత్రం సరిపోవు..’’
‘‘నేరపూరిత కుట్ర విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక ఆధారాలను చూపలేకపోయారు. నిందితులు డబ్బు, ముడుపులను దారి మళ్లించడానికి ఒప్పందం చేసుకున్నారనేందుకు ఆధారాలేవీ చూపలేదు. కోర్టు ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు. అందువల్ల బెయిల్‌ను తిరస్కరించలేం..’’
– మిథున్‌రెడ్డికి బెయిల్ మంజూరు సమయంలో ఏసీబీ కోర్టు
డీఫాల్ట్ బెయిల్ రాకుండా ఉండేందుకు అసంపూర్ణ చార్జిషీట్ దాఖలు రాజ్యాంగ విరుద్ధం
‘‘ఇటీవల సుప్రీంకోర్టు రీతూ చాబ్రియా కేసులో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దర్యాప్తు పూర్తి చేయకుండానే దాఖలు చేసిన అసంపూర్ణ చార్జిషీట్... సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) ప్రకారం నిందితుడికి లభించే డిఫాల్ట్ బెయిల్ హక్కును దూరం చేయలేదని తేల్చి చెప్పింది. డిఫాల్ట్ బెయిల్ చట్టబద్ధ హక్కు మాత్రమే కాక రాజ్యాంగంలోని అధికరణం 21 ప్రకారం ప్రాథమిక హక్కు కూడా అని సుప్రీం పేర్కొంది...’’
‘‘ప్రతి నిందితుడికి వేర్వేరుగా చార్జిషీట్‌లు దాఖలు చేసి డిఫాల్ట్ బెయిల్ హక్కును అడ్డుకోవాలనుకునే తీరు చట్ట, రాజ్యాంగ విరుద్ధం అని తెలిపింది. ఇలాంటి చర్యలు నిందితుడి ప్రాథమిక హక్కు అయిన స్వేచ్ఛను హరిస్తాయని చెప్పింది. అసంపూర్ణ లేదా పలు భాగాలుగా చార్జిషీట్ దాఖలు చేయడం ద్వారా రాజ్యాంగం ప్రసాదించిన ఈ హక్కును కాలరాయలేరని సుప్రీం చెప్పింది’’
‘‘ప్రస్తుత కేసులో ప్రాథమిక చార్జిషీట్, అనుబంధ చార్జిషీట్ విషయానికి వస్తే 48 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రాథమిక చార్జిషీట్‌ను 16 మందిపై మాత్రమే దాఖలు చేశారు. మరో ముగ్గురిపై అనుబంధ చార్జిషీట్ వేశారు. ఇంకా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలు రాలేదు. ఆ నివేదికల్లో ఏమున్నదో తెలియకుండా, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ లేదా 19 ప్రకారం అనుమతులు, ఆమోదం పొందకుండా ప్రభుత్వ ఉద్యోగులపై కేసును ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదు...’’
‘‘చట్ట ప్రకారం నేరాలను కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందే గానీ నిందితులను కాదు. సీఆర్‌పీసీ సెక్షన్ 309(2) ప్రకారం నేరాన్ని పరిగణలోకి తీసుకోకుండా నిందితుల రిమాండ్ పొడిగించడం సాధ్యం కాదు. కేసు ఇంకా ప్రి కాగ్నిజెన్స్ దశలోనే ఉంది. ఈ పరిస్థితుల్లో సెక్షన్ 167(2) ప్రకారం 90 రోజులు దాటిన తరువాత నిందితుల కస్టడీ పొడిగించడానికి అనుమతి లేదు. అందువల్ల నిందితులకు సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద బెయిల్ మంజూరు చేయడం తప్ప మరో మార్గం లేదు..’’
– ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు తీర్పు