
నేటి నుంచి నెట్‌వర్క్ ఆస్పత్రుల పూర్తి స్థాయి సమ్మె
ఆస్పత్రులకు రూ.3,000 కోట్లకుపైగా ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ బిల్లు బకాయిలు
బిల్లుల విడుదలకు ఆస్పత్రుల యజమానుల గోడు పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం నిరుపేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం
పేదలకు పెను శాపంగా మారిన కూటమి పాలన
సాక్షి, అమరావతి: నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు పాలన పెను శాపంగా మారింది. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారినపడితే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు లభించని దుస్థితి రాష్ట్రంలో దాపురించింది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవడంతో మరోమారు ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మె బాట పట్టాయి. శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేస్తున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశ) ప్రకటించింది. బాబు గద్దెనెక్కాక ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులు అధికారికంగా ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా నిలిపేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
సెప్టెంబర్ 15 నుంచే కీలక వైద్య సేవల నిలిపివేత
నిజానికి సెప్టెంబర్ 15వ తేదీ నుంచే అన్ని ఆస్పత్రుల్లో ఉచిత ఓపీ, డయగ్నోస్టిక్స్, ఇన్వెస్టిగేషన్ సేవలను నిలిపేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే అక్టోబర్ 10వ తేదీ నుంచి పూర్తి స్థాయి వైద్య సేవలను నిలిపేస్తామని గత నెల 24వ తేదీనే ఆశ ప్రతినిధులు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు.
సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉన్న రూ.670 కోట్లను పూర్తిగా చెల్లించి, మిగిలిన నిధుల విడుదలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వారితో చర్చలు జరిపి సేవలు నిలవకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. వెరసి పేద, మధ్యతరగతి ఉచిత వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తాయి.
నిర్వీర్యమే లక్ష్యం
ఆరోగ్యశ్రీని బీమా విధానంలో అమలు చేస్తామని గద్దెనెక్కిన వెంటనే చంద్రబాబు ప్రకటించారు. అప్పటి నుంచే పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పథకాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసే చర్యలకు దిగారు. ఇందులో భాగంగా నెట్‌వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లు చెల్లింపులు నిలిపేశారు.
ఆరోగ్యశ్రీ, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌కు సంబంధించి రూ. మూడు వేల కోట్లకు పైగా ప్రభుత్వం బకాయి పెట్టింది. పెద్ద ఎత్తున బిల్లులు ఆగిపోవడంతో ఆస్పత్రులను నిర్వహించలేని దయనీయ పరిస్థితుల్లోకి యాజమానులు వెళ్లిపోయారు. బకాయిలు నెలనెలా పెరగడమే తప్ప తరగడం లేదు.
ఆరు నెలల్లో రెండవసారి
మందులు, సర్జికల్స్ కొనుగోలు, వైద్యులు, సిబ్బందికి జీతాల చెల్లింపులతో పాటు, ఆస్పత్రుల విద్యుత్ బిల్లులు చెల్లించడానికి తీవ్ర అగచాట్లు పడుతున్నామని, పలు మార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందన లేకపోవడంతో విసిగిపోయి మరోమారు యాజమాన్యాలు సమ్మెబాట పట్టాల్సిన పరిస్థితి తలెత్తిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బకాయిల చెల్లింపు డిమాండ్‌తో ఏప్రిల్‌లో సమ్మెలోకి వెళ్లాయి. అప్పట్లో సీఎం స్థాయిలో చర్చలు జరిపి బిల్లులు చెల్లిస్తామని హామీలు ఇచ్చారు. అనంతరం కూడా ఎటువంటి మార్పు రాకపోవడంతో మళ్లీ ఇప్పుడు ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్తున్నాయి.

చేతల్లో కనబడని ప్రభుత్వ ప్రకటనలు
ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలు పెట్టడంతో ఏడాదిగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇన్ని రోజులు పంటి బిగువునా కష్టాలను భరిస్తూ సేవలను కొనసాగిస్తూ వస్తున్నాం. ఇక భరించడం సాధ్యం కావడం లేదు. అందుకే సేవలను నిలిపేస్తున్నాం. ఆస్పత్రులకు బకాయిలపై అసెంబ్లీ సాక్షిగా ప్రకటనలు చేసిన ప్రభుత్వం చెల్లింపుల్లో మాత్రం చొరవ చూపడం లేదు. మా ఆందోళన కారణంగా సామన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – ఆశ ప్రతినిధులు