
పూర్తిగా నిలిచిపోయిన ఉచిత వైద్యం
డబ్బు కడితేనే వైద్యం చేస్తామని తెగేసి చెబుతున్న ఆస్పత్రులు
ఆందోళనలో పేద, మధ్య తరగతి వర్గాలు
అయినా మొద్దు నిద్రలోనే ప్రభుత్వం
‘ఆశ’ సమ్మెకు ప్రైవేటు వైద్య డెంటల్ కళాశాలల మద్దతు
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్రంలో పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రైవేటు నెటవర్క్ ఆసుపత్రులు సేవలు నిలిపేసి శనివారం సమ్మె కొనసాగించాయి. ప్రభుత్వం రూ.మూడు వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టడంతో ఆస్పత్రుల నిర్వహణ కష్టమవుతోందని గత నెల 15 నుంచి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశ) సమ్మెలోకి వెళ్లిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో వైద్య సేవలను నిలిపేశారు.
ఆరోగ్యశ్రీ కింద కొత్త కేసులను రాష్ట్రంలో ఎక్కడా అడ్మిట్ చేసుకోవడం లేదు. దీంతో అనారోగ్యం బారినపడిన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల వారు అవస్థలు పడుతున్నారు. ఉచిత చికిత్సల కోసం నెట్‌వర్క్ ఆస్పత్రులకు వెళితే నిరాకరిస్తూ డబ్బు కడితేనే వైద్యం చేస్తామని చెబుతున్నారు. వైద్యం కోసం పేదలు అప్పులు చేయాల్సిన దుస్థితిని చంద్రబాబు ప్రభుత్వం సృష్టించింది. ఆరోగ్యశ్రీ నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు.
బిల్లులు చెల్లించి సేవలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవడం లేదు. సమ్మె తీవ్రతరం చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆశ ప్రతినిధులు చెప్పారు. ఆశ సమ్మెకు ఏపీ ప్రైవేటు, మెడికల్ కళాశాలల యజమానుల సంఘం మద్దతు ప్రకటించింది. తామూ ఆశ తరహాలో సమ్మెకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని ఆరోగ్యశ్రీ సీఈవోకు లేఖ రాసింది. సంఘంలో 15 వైద్య, డెంటల్ కాలేజీలున్నాయి.
స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ సమ్మె విరమించం
» ఏడో రోజుకు చేరిన పీహెచ్‌సీ వైద్యుల రిలే దీక్షలు
» దీక్షా ప్రాంగణంలో రౌండ్‌టేబుల్ సమావేశం
» మద్దతు తెలిపిన ప్రజా, ఉద్యోగ సంఘాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యుల సమ్మె కొనసాగుతోంది. రాష్ట్రంలోని 2,700 మంది వైద్యులు విధులు బహిష్కరించి విజయవాడ ధర్నా చౌక్‌లో చేపట్టిన రిలే దీక్షలు ఏడో రోజు శనివారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా వైద్యులు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ హాస్పిటల్స్ అసోసియేషన్, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, 108, 104, 102 అసోసియేషన్స్, సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ అసోసియేషన్, ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్, ప్రజారోగ్య వేదిక, కేవీపీఎస్, ఏపీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏపీ హెల్త్ సూపరై్వజర్స్ అసోసియేషన్, ఎన్‌హెచ్‌ఎం జేఏసీ, ఏపీ గవర్నమెంట్ స్టాఫ్ నర్స్ అసోసియేషన్, ఏపీ పీఎం సేవ తదితర సంఘాలు పాల్గొని బేషరతుగా మద్దతు తెలిపాయి.
ఈ నెల 13 నుంచి పీహెచ్‌సీల వద్ద తమ సిబ్బంది అంతా నల్ల బ్యాడ్జీలు ధరించి వైద్యుల పోరాటానికి సంఘీభావం తెలుపుతామని, రానున్న రోజుల్లో లంచ్ అవర్ డిమోని్రస్టేషన్‌తో పాటు ప్రభుత్వం పీహెచ్‌సీ వైద్యుల సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే సమ్మెకి మద్దతుగా తమ కార్యాచరణ ప్రకటిస్తామని తీర్మానం చేశాయి. వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాయక్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిషోర్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ గోపీనాథ్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రాహుల్ తదితరులు సమావేశంలో ప్రసంగించారు.
ఈ పోరాటం తమ ప్రాథమిక హక్కులు సాధించేవరకు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఇచి్చన మాట కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. ప్రఅప్పటివరకు సమ్మె విరమిచంబోమని స్పష్టం చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.