సమాజంలో యువత, విద్యార్థుల పాత్ర అత్యంత కీలకం: వైఎస్ జగన్
మంచి రాజకీయాలకు విద్యార్థి దశ నుంచే బీజం
ఓ నాయకుడి గురించి కాలర్ ఎగరేసుకుని చెప్పేలా ఉండాలి
మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు...
చూసీ చూడనట్లు వదిలేశామంటే ఎప్పటికీ ఇలాగే ఉంటుంది
విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేలా మొట్టమొదటి సారిగా అడుగులు పడింది మన ప్రభుత్వంలోనే.. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు
నాడు – నేడుతో కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు
విద్యా దీవెన, వసతి దీవెన కోసమే రూ.16,800 కోట్లు వ్యయం చేశాం
మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా కరిక్యులమ్
జీఈఆర్‌లో గణనీయమైన ప్రగతి.. కూటమి ప్రభుత్వంలో మొత్తం రివర్స్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం.. రూ.2.50 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో వాటిని పూర్తి చేసేందుకు ఐదేళ్లలో రూ.ఐదు వేల కోట్లు ఇవ్వలేరా?
మీరు తీసుకురాకపోగా స్కామ్‌ల కోసం మెడికల్ కాలేజీలను అమ్మేస్తారా చంద్రబాబూ?
పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిప్పులు
ఇది సోషల్ మీడియా యుగం.. ఈ యుగంలో డ్రైవ్ చేసేది యువతే.. యువత చేతుల్లోనే భవిష్యత్ ఉంది.. వారెలా డిసైడ్ చేస్తే, ఆ గవర్నమెంట్ వస్తుంది.. ఆ ప్రభుత్వం.. మీరు సిట్ అంటే సిట్! స్టాండ్ అంటే స్టాండ్! దటీజ్ ద పవర్ ఆఫ్ యంగ్‌స్టర్స్.
గత 18 నెలలుగా అంతా తిరోగమనం. స్కూళ్ల దగ్గరి నుంచి మొదలు పెడితే.. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం ఆగిపోయాయి. టోఫెల్ క్లాస్‌లు ఎత్తివేశారు. సబ్జెక్టు టీచర్ కాన్సెప్టు గాలికి ఎగిరిపోయింది. 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్‌లు ఆపేశారు. గోరుముద్ద కింద నాసిరకం ఆహారం పెడుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన రెండింటికి కలిపి చంద్రబాబు దాదాపు రూ.6,400 కోట్లు బకాయి పెట్టారు. దీంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు. సర్టిఫికెట్లు రాని పరిస్థితి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోంది.
– వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘భావితరానికి మీరే దిక్సూచి.. రాజకీయాల్లో విద్యార్థులు, యువత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి..’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోషల్ మీడియా యుగంలో డ్రైవ్ చేసేది యువతేనని, వారి చేతుల్లోనే భవిష్యత్ ఉందన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం సమావేశం జరిగింది. విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశమైన వైఎస్ జగన్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపై చర్చించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలోవైఎస్ జగన్ ఏమన్నారంటే..
తులసి మొక్కల్లా ఎదగాలి..
ఒక నాయకుడి గొప్పతనానికి యువత, విద్యార్థి దశ నుంచే బీజం పడుతుంది. మీరంతా జనరేషన్–జీ లో ఉన్నారు. భావి తరానికి దిక్సూచీ కాబోతున్నారు. బహుశా ఒకటి, రెండు టరమ్స్‌లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తారు. మీరు రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి. మీరంతా సోషల్ మీడియాను అత్యధికంగా అనుసరించేవారు, దాన్ని నడిపించేవారు, 90 కి.మీ. వేగంతో ప్రయాణించే మనసు ఉన్నవారే! రాజకీయాలు ఎలా ఉండాలంటే.. ఫలానా వ్యక్తి మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకుని చెప్పేలా, యువతరం మనవైపు చూసేలా ఉండాలి. మనలో ఆ క్యారెక్టర్, గుణాలు కనిపించినప్పుడే ఆ పరిస్థితులు వస్తాయి. రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతోందో అందరం చూస్తున్నాం.
సరైన విత్తనం వేయకపోతే పరిస్థితి మారదు..
విద్యార్థులు, యువత గట్టిగా అడుగులు ముందుకు వేస్తే.. దేశాలలో ప్రభుత్వాలు కూడా మారిపోతున్నాయి. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడం పాత కథ అయితే.. బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చే కార్యక్రమాలు జరిగాయి. అంత శక్తిసామర్థ్యాలు ఉన్నవారు యువకులు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే.. మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి.. ఏం జరుగుతోంది..? అనేది మనమంతా చూడాల్సి ఉంది. రాష్ట్రం బాగుండాలని అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి ఇక్కడి రాజకీయ పరిణామాలను గమనించాల్సిన అవసరం ఉంది.
ఈ రోజు ఒక యువకుడు గొప్పగా ఎదిగి భావి ప్రపంచంతో పోటీ పడి ఉద్యోగాన్ని అవలీలగా సంపాదించుకునే పరిస్థితి ఉందా? మీ మనస్సాక్షినే అడగండి. ఏదైనా రాత్రికి రాత్రే జరగదు. ఒక నాయకుడు ప్రణాళికాబద్ధంగా ఒక అడుగు వేస్తే.. ఆ విత్తనం చెట్టుగా కావడానికి, విజన్ ట్రాన్స్‌లేట్ కావడానికి కనీసం 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. అదే ఈరోజు సరైన విత్తనం వేయకపోతే ఎన్నేళ్లు గడిచినా పరిస్థితి మారదు. 10, 15 ఏళ్ల తర్వాత కూడా మన బతుకులు మారవు.
ఇదే మాదిరిగా ఉంటాం. మనం లీడర్లుగా కాబోతున్నప్పుడు.. అలాంటి మంచి విత్తనాలు వేసే ఆలోచన మన మనసులో మెదలాలి. మనం చేసే పని వల్ల భవిష్యత్ తరాలు మారాలి. మరి విద్యా వ్యవస్థ మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది? గత 18 నెలలుగా ఎలాంటి అడుగులు పడుతున్నాయి? అనే తేడాను గమనించాల్సిన అవసరం చాలా ఉంది. 
సమావేశానికి హాజరైన వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు ప్రసంగిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
మన హయాంలోనే ఆ అడుగులు..
యువకులుగా మన పాత్ర కీలకమన్నది గుర్తు పెట్టుకోవాలి. మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు. మనం మార్చడానికి అడుగులు ముందుకు వేస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది. మనం చూసీచూడనట్లు వదిలేశామంటే ఈ వ్యవస్థ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఆ దిశగా మొట్టమొదటి సారిగా అడుగులు పడింది మన హయాంలోనే అని గర్వంగా చెప్పగలను. విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేలా విద్యా రంగంలో మనం చాలా మార్పులు చేశాం. కేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేదాకా ఆ పిల్లాడికి ఎలాంటి చదువులు ఉండాలి? వారు భావితరంతో పోటీపడి నిలబడటమే కాకుండా విజయం సాధించాలనే ఆలోచన చేసింది ఒక్క వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రమే.
ఆ ఆలోచన చేయగలిగిన వాడే.. లీడర్
విద్యార్థులకు ఓటుహక్కు ఉండదు కాబట్టి ఏ రాజకీయ నాయకుడూ వారి గురించి ఆలోచన చేయడు. కానీ వారే రేప్పొద్దున భవిష్యత్తు అని ఆలోచన చేయగలిన వారు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు.. లీడర్ అవుతారు. అలాంటి అడుగులు పడింది వైఎస్సార్‌సీపీ హయాంలోనే అని గొప్పగా చెప్పగలుగుతా. మొట్టమొదట అడుగులు.. ఇంగ్లిష్ మీడియం వైపు పడ్డాయి. ఎవరైనా నారాయణ.. శ్రీచైతన్య.. వంటి ప్రైవేట్ స్కూళ్లకు ఎందుకు వెళ్లాలి? మన గవర్నమెంట్ స్కూళ్లు ఎందుకు అలా లేవు? అవి ప్రైవేట్ స్కూళ్లతో పోటీపడే పరిస్థితి ఎందుకు లేదు? ప్రైవేట్ స్కూళ్లే.. గవర్నమెంట్ స్కూళ్లతో పోటీపడే పరిస్థితిని తీసుకొచ్చినప్పుడు పేదవాడి జీవితం బాగు పడుతుందని భావించి మొట్టమొదటి విత్తనం అక్కడ నుంచి పడింది.
అందులో భాగంగా వేగంగా అడుగులు వేస్తూ గవర్నమెంట్ స్కూళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. తొలిసారిగా గవర్నమెంట్ స్కూళ్లలో తప్పనిసరి ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్చాం. 3వ తరగతి నుంచే ఒక పీరియడ్‌గా టోఫెల్, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ప్రతి పిల్లవాడి చేతికి పుస్తకాలతోపాటు తెలుగు–ఇంగ్లిష్ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ కూడా ఇచ్చాం.
8వ తరగతి నుంచి ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబులు పెట్టి ప్రైవేట్ స్కూళ్ల కంటే గొప్పగా అడుగులు వేయించాం. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈనే కాదు.. ఏకంగా ఐబీని కూడా తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలకు పరిచయం చేశాం. జెనీవా నుంచి ఐబీ టీమ్ వచ్చి మన ప్రభుత్వంతో కలసి పని చేసింది. 2025లో ఫస్ట్ క్లాస్.. 2026లో సెకండ్ క్లాస్.. 2027లో థర్డ్ క్లాస్.. ఇలా 2035 నాటికి మన పిల్లలు టెన్త్ క్లాస్ పరీక్షలు ఐబీలో రాసే విధంగా జెనీవా నుంచి వచ్చిన ఐబీ బృందం మన ప్రభుత్వంతో కలసి పని చేసింది.
ఎందుకివన్నీ జరిగాయంటే.. ఆ స్థాయి విద్యను మన పిల్లలకు ఇవ్వగలిగితే ఆంధ్రా కాదు.. ప్రపంచంతోనే పోటీ పడగలుగుతారు. ప్రపంచంతోనే పోటీ పడుతున్నప్పుడు.. మన పిల్లల చదువులు అక్కడి నుంచి మొదలవుతున్నాయా? లేదా? అనేది అత్యంత ముఖ్యమైన విషయం. అందుకే విద్యా వ్యవస్థను మార్చుకుంటూ వచ్చాం. 
ఉన్నత విద్యలో విప్లవం..
ప్రభుత్వ స్కూళ్లలో నాడు–నేడుతో శ్రీకారం చుట్టి.. అమ్మ ఒడితో పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించాం. 75 శాతం హాజరు తప్పనిసరి చేశాం. గోరుముద్ద ద్వారా రోజుకో మెనూతో పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించాం. ఈ మార్పులను ఉన్నత విద్య వరకు తీసుకెళ్లాం. తొలిసారిగా ఉన్నత విద్యలో జాబ్ ఓరియెంటెడ్ కరికులమ్ తీసుకొచ్చింది వైఎస్సార్‌సీపీ హయాంలోనే. మన చదువుల్లో లేనిది ఏమిటి? బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నది ఏమిటి? అని మొట్టమొదటిసారిగా బేరీజు వేశాం.
అక్కడున్న కోర్సులు ఇక్కడ ఎందుకు లేవు? డిగ్రీ అనేది ఇక్కడ నామ్‌కేవాస్తే చదువుగా ఎందుకు ఉంది? అక్కడి డిగ్రీకి విలువ ఎందుకు ఉంది? అనే విషయంపై అసెస్ చేసి ఎడెక్స్‌ను తీసుకొచ్చాం. ప్రముఖ ‘ఐవీ లీగ్’ కాలేజీలు, స్టాన్‌ఫర్డ్, ఎంఐటీ లాంటి పెద్ద యూనివర్సీటీల డిగ్రీలను మన కోర్సులో భాగం చేస్తూ.. సర్టిఫికెట్లు కూడా వారి దగ్గరి నుంచే వచ్చే విధంగా.. క్రెడిట్లు కూడా వారే ఇచ్చేలా భాగస్వాములను చేస్తూ ఎడెక్స్ ద్వారా మన డిగ్రీలను ఆన్‌లైన్ కరికులమ్‌లో భాగం చేశాం. డిగ్రీలో నాణ్యతను పెంపొందిస్తూ తొలిసారి తప్పనిసరి అప్రెంటిస్ విధానం తీసుకొచ్చాం.
విద్యాదీవెన, వసతి దీవెనకు రూ.16,800 కోట్లు ఇచ్చాం..
కాలేజీల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను మెరుగుపరుస్తూ ‘నాక్’ (నేషనల్ ఎస్సెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్) రిజి్రస్టేషన్ చేయించాం. మనం అధికారంలోకి రాకముందు 2019 నాటికి కేవలం 257 కాలేజీలకు నాక్ రిజి్రస్టేషన్ ఉంటే 2024 ఫిబ్రవరి నాటికి వాటి సంఖ్య 437కి తీసుకెళ్లాం. అంతేకాకుండా పిల్లల చదువుల కోసం ఏ తల్లిదండ్రులూ ఇబ్బంది పడకూడదని, అప్పులపాలు కాకూడదని తాపత్రయపడుతూ మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విద్యాదీవెన పథకాన్ని తీసుకొచ్చాం.
ఆ ఒక్క పథకం కిందనే రూ.12,609 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి త్రైమాసికం అయిపోగానే దానికి సంబంధించిన ఫీజులు క్రమం తప్పకుండా పిల్లల తల్లుల ఖాతాల్లో వేశాం. హాస్టల్ ఖర్చుల కింద వసతి దీవెన ద్వారా క్రమం తప్పకుండా ఇచ్చాం. డిగ్రీ పిల్లలకు ఏటా రూ.20 వేలు రెండు విడతల్లో ఇచ్చాం. ఏటా రూ.1,100 కోట్లు ఏప్రిల్‌లో ఇచ్చేలా అడుగులు పడ్డాయి.
ఒక్క వసతి దీవెన కింద మొత్తం రూ.4,275 కోట్లు ఇచ్చాం. ఇలా పిల్లలు గొప్ప చదువులు చదవాలని భావిస్తూ ఉన్నత విద్యా రంగంలో విద్యాదీవెన, వసతి దీవెన కింద రెండు పథకాల కోసం ఏకంగా రూ.16,800 కోట్లు ఖర్చు చేసింది ఒక్క వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. దీనివల్ల పేద, మధ్య విద్యార్థులు ఎవరూ ఫీజులు కట్టలేక చదువులు మానేయాల్సిన పరిస్థితులు రాకుండా అడుగులు పడ్డాయి.
12న నియోజకవర్గాల్లో ర్యాలీలను విజయవంతం చేయాలి
చంద్రబాబు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు పార్టీ కార్యాచరణ చేపట్టింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా సాగుతోంది. ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు అన్నింటిలో ఇన్‌వాల్వ్ కావాలి. తటస్థులను కూడా కూడగట్టి నడవాలి. ఈనెల 12న నియోజకవర్గాల్లో ర్యాలీలను విజయవంతం చేయాలి.
సీఎం చంద్రబాబు షాక్ తిని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే స్థాయిలో నిర్వహించాలి. డిసెంబరులో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఆందోళన చేపట్టి చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచుదాం. పార్టీ పరంగా అన్ని కమిటీల నిర్మాణం జరుగుతోంది. గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు అవుతున్నాయి. గ్రామస్థాయిలో విద్యార్థి, యువజన అనుబంధ విభాగం కూడా రావాలి. చైతన్యం అక్కణ్నుంచే మొదలు కావాలి.
18 నెలలుగా అంతా తిరోగమనం..
ఈ రోజు ఏం జరుగుతోంది? గత 18 నెలలుగా అంతా తిరోగమనం. స్కూళ్ల దగ్గరి నుంచి మొదలు పెడితే.. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం ఆగిపోయింది. టోఫెల్ క్లాస్‌లు ఎత్తివేశారు. సబ్జెక్టు టీచర్ కాన్సెప్టు గాలికి ఎగిరిపోయింది. 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్‌లు ఆపేశారు. గోరుముద్ద కింద నాసిరకం ఆహారం పెడుతున్నారు. ఉన్నత విద్యా రంగం పరిస్థితి చూస్తే.. పిల్లలు బాగా చదివితే వాళ్లెక్కడ గొప్పవారు అవుతారనే బాధ చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తోంది.
ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సెపె్టంబరు చివరి వరకు ఏడు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలే! గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏప్రిల్‌లో వెరిఫై చేసి మే నెలలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాసి దాన్ని ఆపించాడు. ఎన్నికల తరువాతైనా చంద్రబాబు ఇవ్వాలి కదా? అక్కడి నుంచి ఫీజులకు బ్రేక్ పడింది. ఇప్పటికి ఏడు త్రైమాసికాలు.
డిసెంబరుతో మరో త్రైమాసికం జోడవుతుంది. ఒక్కో త్రైమాసికానికి రూ.650 కోట్ల నుంచి రూ.700 కోట్లు. ఏకంగా దాదాపు రూ.4,900 కోట్లు పెండింగ్‌లో ఉంటే ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు మాత్రమే. అంటే రూ.4,200 కోట్లు బకాయి పెట్టారు. ఈ డిసెంబరు వస్తే మరో రూ.700 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. వసతి దీవెన కింద ఏటా రూ.1,100 కోట్లు ఇవ్వాలి. రెండేళ్లలో రూ.2,200 కోట్లు బకాయి పెట్టారు. రెండింటికి కలిపి చంద్రబాబు దాదాపు రూ.6,400 కోట్లు బకాయి పెట్టారు. దీంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు.
సర్టిఫికెట్లు రాని పరిస్థితి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు తోడుగా వైఎస్సార్‌సీపీ నాయకత్వం తీసుకోకపోతే చదువులు మానేస్తారు. ఒక చిన్న ఉదాహరణ చెబుతా.. జీఈఆర్ (గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో) అంటే . మీ అందరికీ తెలుసు.
ఇంటర్ తర్వాత ఉన్నత విద్యలో ఎంతమంది చేరుతున్నారని చూస్తే.. మన ప్రభుత్వం రాక ముందు 2018–19లో జీఈఆర్ 27.86 శాతం ఉంటే, మన ప్రభుత్వం వచ్చాక 2023–24 నాటికి జీఈఆర్ 37 శాతానికి పెరిగింది. అది ఇప్పుడు మళ్లీ రివర్స్ అయింది. ఫీజులు కట్టలేక పిల్లలు వెనక్కి తగ్గుతున్నారు. చదువులు ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. మరోవైపు ఉద్యోగాలు, పిల్లల భవిష్యత్ చూస్తే ఆందోళనకరం.
స్వయం ఉపాధికి ప్రోత్సాహం..
నిజంగా మెరుగైన ఉద్యోగాలు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్‌లో (స్వయం ఉపాధి రంగం) వస్తాయి. అది ఒక విప్లవం. ఆ దిశగానే ఆసరా, సున్నా వడ్డీకే రుణాలు, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అమలు చేశాం. అక్కచెల్లెమ్మలు తమ కాళ్ల మీద నిలబడేలా ఐటీసీ, పీ అండ్ జీ, రిలయన్స్, అమూల్ లాంటి సంస్థలతో టై అప్ చేశాం. చేయూత ద్వారా దాదాపు 26 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు.. ఆసరా, సున్నా వడ్డీ ద్వారా దాదాపు కోటి మందికిపైగా మేలు జరిగింది. నేతన్న నేస్తం, వాహనమిత్ర, తోడు, చేదోడు ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
వ్యవసాయం దండగ కాదు.. పండగ
రాష్ట్రంలో దాదాపు 62 శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. చంద్రబాబు నోటి నుంచి వ్యవసాయం దండగ అనే మాటలు వస్తే.. మేం పండగ అని చేసి చూపాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్న ప్రతి అడుగులో చేయి పట్టుకుని నడిపించాం. రైతులకు ఏ విపత్తు, ఆపద వచ్చినా వెంటనే ఆదుకున్నాం. గతంలో రాష్ట్రంలో 6 పోర్టులు మాత్రమే ఉంటే, కోవిడ్ ఉన్నప్పటికీ మన హయాంలో మరో 4 కొత్త పోర్టులకు శ్రీకారం చుట్టాం.
అందులో మూడు ప్రభుత్వ రంగంలోనివే. మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల పనులు చాలా వేగంగా జరిగాయి. సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఒక్క కాకినాడ పోర్టు మాత్రం ప్రైవేటు రంగంలో అభివృద్ధి జరుగుతోంది. ఇంకా 10 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల పనులు చురుగ్గా కొనసాగాయి.
నాడే అదానీ డేటా సెంటర్..
మన హయాంలోనే అదానీ డేటా సెంటర్ ప్రాసెస్ జరిగింది. అసలు డేటా రావాలంటే కేబుల్ కావాలి కదా? సింగపూర్ నుంచి సముద్రంలో కేబుల్ ఏర్పాటు ప్రక్రియకు నాడే శ్రీకారం చుట్టడం జరిగింది. సింగపూర్ ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ హయాంలోనే లేఖ కూడా రాశాం. అవన్నీ జరిగాయి, మనం చేశాం కాబట్టే ఇప్పుడు డేటా సెంటర్ వస్తోంది. విశాఖ అభివృద్ధికి అడుగులు వేశాం కాబట్టే గూగుల్ వస్తోంది. భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ చేసి, వేగంగా అన్ని అనుమతులు పొంది, పనులు కూడా చేశాం. అందుకోసం దాదాపు రూ.900 కోట్లు ఖర్చు చేశాం. అవన్నీ మనం చేశాం కాబట్టి పురోగతి కనిపిస్తోంది. అలా మంచి విత్తనాలు నాటాం. విత్తనం వేయకపోతే చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది?
మేం ఎన్ని ఉద్యోగాలిచ్చామో మీ లెక్కలే చెబుతున్నాయి..
వైఎస్సార్‌సీపీ హయాంలో ఒక్క ప్రభుత్వ రంగంలోనే దాదాపు 6.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ రంగంలో శాశ్వత ఉద్యోగాలు 2,13,662 ఇచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో మన కళ్లెదుటే కనిపిస్తారు. వాటిలో దాదాపు 1.26 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. వైద్య ఆరోగ్య రంగంలో జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. ఆస్పత్రుల్లో స్పెషలిస్టుల కొరత లేకుండా చేశాం.
దేశంలో 61 శాతం స్పెషలిస్టు వైద్య నిపుణుల కొరత ఉంటే, మన హయాంలో ఏపీలో అది కేవలం 4 శాతం మాత్రమే ఉంది. అలా 17 వేల మందిని నియమించాం. పాఠశాల విద్యలో 10,300 పోస్టులు భర్తీ చేశాం. టీచర్ పోస్టులు ఇచ్చాం. డీఎస్సీ సమస్యలన్నీ పరిష్కరించి ఉద్యోగాలు ఇచ్చాం. ఇవి కాకుండా 2.66 లక్షల మంది వలంటీర్లు. ఆప్కాస్‌లో మరో లక్ష మంది, 18 వేల మంది బెవరేజెస్ కార్పొరేషన్‌లో, రేషన్ డోర్ డెలివరీ వాహనాల్లో 20 వేల ఉద్యోగాలు కల్పించాం.
ఇవి కాకుండా ఎంఎస్‌ఎంఈలు 4.78 లక్షల యూనిట్లు గ్రౌండ్ చేయడం ద్వారా దాదాపు 33 లక్షల ఉద్యోగాలను సృష్టించగలిగాం. మన హయాంలో వాటికి క్రమం తప్పకుండా రాయితీలు ఇచ్చి భరోసా కల్పించి నిలబెట్టాం. ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈలది చాలా కీలక పాత్ర. వీటిలో పెట్టుబడి తక్కువే అయినా ఉద్యోగాలు ఎక్కువ. అదే పెద్ద పెద్ద కంపెనీల్లో పెట్టుబడి ఎక్కువ.. ఉద్యోగాలు తక్కువ. ఇంకా లార్జ్ అండ్ మెగా రంగంలో మరో లక్ష ఉద్యోగాల కల్పన. అన్నీ కలిపితే.. 40,13,552 ఉద్యోగాలు ఒక్క వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సృష్టించగలిగాం. ఇవి మనం చెప్పే లెక్కలు కాదు. వాళ్లు తయారు చేసుకున్న సామాజిక సర్వే నివేదికలో చూపించిన లెక్కలే ఇవన్నీ!
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం..
చంద్రబాబు చేస్తున్న మరో దారుణమైన పని.. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. ఆయన మంచి చేయకపోగా చెడు చేస్తున్నారు. స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులను గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందో ఆలోచన చేశారా? ప్రభుత్వం వాటిని నిర్వహించకుంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పేదలు దోపిడీకి గురవుతారు. దీనికి చెక్ పడాలంటే ప్రభుత్వమే వాటిని నిర్వహించాలి.
1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు కేవలం 12 మాత్రమే. వాటిలో ఒక్కటి కూడా చంద్రబాబు కట్టలేదు. మన ప్రభుత్వ హయాంలో కోవిడ్ ఉన్నప్పటికీ, ఏకంగా 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టాం. ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశాం. ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటైతే స్థానికంగా సూపర్ స్పెషాలిటీ సేవలు టీచింగ్ ఆస్పత్రి మాదిరిగా అందుబాటులోకి వస్తుంది.
ఆ స్థాయిలో వైద్య సేవలందుతాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, స్టూడెంట్లు, మెడికోస్, నర్సింగ్ విద్యార్థులు వీరంతా అక్కడే పని చేస్తారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం చేరువలో అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడైతే అవన్నీ అందుబాటులోకి వస్తాయో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ ఆగిపోతుంది. 50 కి.మీ. లోపే పేదలకు అత్యాధునిక వైద్యం ఉచితంగా అందుతున్నప్పుడు ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.లక్షలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
పేదలకు, మధ్య తరగతికి ఒకవైపు మంచి చేస్తూ మరోవైపు ఆ 17 మెడికల్ కాలేజీల ద్వారా 2,550 మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయి. సగం సీట్లు ఫ్రీగా పిల్లలకు దక్కుతాయి. మిగిలిన సీట్లు కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీల కంటే తక్కువ ఫీజుకే అందుబాటులోకి వస్తాయి. మన పిల్లలు ఇక్కడే డాక్టర్లుగా మారి మన ప్రాంతంలోనే సేవలు కూడా అందిస్తారు.
మనం చేపట్టిన మెడికల్ కాలేజీల్లో మన హయాంలోనే 7 కాలేజీలు పూర్తయ్యాయి. 5 కాలేజీల్లో తరగతులు కూడా మొదలై మూడు బ్యాచ్‌లు జరిగాయి. పాడేరు మెడికల్ కాలేజీలో గత ఏడాది క్లాస్‌లు ప్రారంభమయ్యాయి. గత ఏడాది పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇస్తామంటే వద్దని అడ్డుపడి చంద్రబాబు లేఖ రాశారు. కొత్త మెడికల్ కాలేజీల కోసం రూ.3,000 కోట్లు ఖర్చు చేశాం. మిగిలిన 10 కాలేజీలకు మరో రూ.5 వేల కోట్లు అవసరం.
అది కూడా ఐదేళ్లలో ఖర్చు చేస్తే చాలు. అంటే ఏటా రూ.1,000 కోట్లు మాత్రమే వెచ్చించాలి. కానీ ఆ మనిíÙకి మనసు రాదు.. అది కూడా ఖర్చు చేయకుండా ఏకంగా వాటిని అమ్మేస్తున్నాడు. రాష్ట్ర బడ్జెట్ చూస్తే రూ.2.50 లక్షల కోట్లు. మెడికల్ కాలేజీలకు కావాల్సింది ఏటా కేవలం రూ.1000 కోట్లు. ఆయన పెట్టపోతే పోయే..! మేం వచ్చిన తరువాత చేసుకుంటాం. కానీ ఇలా స్కామ్‌లు చేస్తూ అమ్మడం ఏమిటి? ఈ స్థాయికి దిగజారిపోయిన వ్యక్తిని నిలదీయడం యువత నుంచే మొదలు కావాలి!!
ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎ.రవిచంద్ర, తోట రాంజీ, శ్రీవాత్సవ, చెవిరెడ్డి హర్షిత్, ప్రణయ్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్స్ ఓబుల్‌రెడ్డి, నీలి ఆనంద్, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


