పులివెందుల బోధనాస్పత్రిలోని పరికరాలను తరలించేస్తున్న ప్రభుత్వం
కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌కు కట్టబెట్టేస్తూ ఆస్పత్రుల్లో సేవలకు మంగళం
సాక్షి, అమరావతి: కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తూ ప్రభుత్వ ఆస్తులను పచ్చ గద్దలకు దోచిపెట్టేందుకు పీపీపీని తెరపైకి తెచ్చిన టీడీపీ పెద్దలు ఏకంగా బోధనాస్పత్రుల నిర్వీర్యానికి ఒడిగట్టారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని బోధనాస్పత్రుల్లో వైద్య పరికరాలను తొలగించి పేదల ఉన్నత వైద్యానికి ఉరి బిగించేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటులో భాగంగా నాలుగు చోట్ల ఏపీవీవీపీ ఆస్పత్రులను 350 పడకల సామర్థ్యంతో బోధనాస్పత్రులుగా తీర్చిదిద్దారు. అన్ని ఆస్పత్రుల్లో అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ స్థాయి సీనియర్ వైద్యులను నియమించి వైద్య సేవలను బలోపేతం చేశారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు చేరువలో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్న సమయంలో చంద్రబాబు గద్దెనెక్కడంతో అంతా తలకిందులు అయింది. కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టాలని కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయం పేదల ఆరోగ్య భద్రతకు గొడ్డలిపెట్టులా మారింది.
ఆధునిక పరికరాలన్నీ తొలగింపు
2024–25 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించడానికి వీలుగా వైఎస్సార్‌సీపీ హయాంలో సిద్ధమైన పులివెందుల వైద్య కళాశాలకు ఎన్‌ఎంసీ గతేడాదే 50 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసినా చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుని లేఖలు రాసి రద్దు చేయించింది. అంతేకాకుండా పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని బోధనాస్పత్రుల నిర్వీర్యానికి అడుగులు వేసింది. ఈ క్రమంలో తొలుత ఆయా ఆస్పత్రుల్లోని అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ స్థాయి సీనియర్ వైద్యులను ప్రభుత్వం పాత జీజీహెచ్‌లకు సర్దుబాటు చేసింది. దీంతో ఒక్కసారిగా వైద్య సేవలు పతనం అయ్యాయి.
పది ప్రభుత్వ కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టాలని నిర్ణయించిన కూటమి సర్కారు తొలి విడతలో పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని వైద్య కళాశాలలను బలి పెడుతోంది. ఇందులో భాగంగా ఆ నాలుగు చోట్ల బోధనాస్పత్రులకు గత ప్రభుత్వం సమకూర్చిన అత్యాధునిక పరికరాలను తొలగించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా నాలుగు ఆస్పత్రుల్లో 51 రకాల అత్యాధునిక వైద్య పరికరాలు పాత జీజీహెచ్‌లకు తరలింపు పనులను వైద్య శాఖ ముమ్మరం చేసింది.
గైనిక్, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ లాంటి స్పెషాలిటీ విభాగాల్లో రోగులకు నాణ్యమైన వైద్య సేవల కోసం బోధనాస్పత్రులకు అత్యాధునిక పరికరాలను గత ప్రభుత్వం సమకూర్చింది. కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని ప్రజలంతా డిమాండ్ చేస్తున్నా లెక్క చేయకుండా మొండిగా వ్యవహరిస్తూ వైద్య పరికరాలను సైతం తొలగిస్తూ పేదలకు వైద్యం సేవలను మమ అనిపించడం నివ్వెరపరుస్తోంది.
మదనపల్లె మెడికల్ కళాశాలకు చెందిన కంటిపరీక్షల యంత్రం
టెరిషరీ కేర్ బలోపేతానికి తూట్లు
ప్రభుత్వ వైద్య రంగంలో ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ.. మూడు లేయర్లుగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ విస్తరించి ఉంటుంది. ప్రైమరీ కేర్‌లో విలేజ్ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు ఉంటాయి. సెకండరీ కేర్‌లో సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రులుంటాయి. టెరిషరీ కేర్‌లో బోధనాస్పత్రులు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు ఉంటాయి. తీవ్రమైన జబ్బుల బారినపడిన వారికి మెరుగైన చికిత్సలు అందించడంలో టెరిషరీ కేర్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.
2019 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు, వీటికి అనుబంధంగా బోధనాస్పత్రులు మాత్రమే ఉండేవి. దీంతో మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు మెరుగైన చికిత్సల కోసం 100 నుంచి 150 కి.మీ దూరంలో ఉండే పాత జీజీహెచ్‌లకు వ్యయ ప్రయాసలకోర్చి చేరుకోవాల్సి వచ్చేది. అక్కడా రోగుల తాకిడి తగ్గట్టుగా పడకలు, వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో చికిత్సల కోసం నరకం చూడాల్సిన దుస్థితి ఉండేది.
ఈ పరిస్థితులకు చెక్ పెడుతూ టెరిషరీ కేర్ బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు చేరువలో చికిత్సలు అందించడం కోసం ఏకంగా రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం ప్రారంభించారు. తద్వారా అప్పటి వరకూ జిల్లా, ఏరియా, సీహెచ్‌సీలున్న చోట ప్రభుత్వం ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో బోధనాస్పత్రి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళిక రచించారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలోనే గుండె, మెదడు, కిడ్నీ, కాలేయ సంబంధిత జబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధులకు ఉచిత చికిత్సలు అందుబాటులోకి తెచ్చేలా వైద్యులు, ఇతర సిబ్బంది, అధునాతన పరికరాలు సమకూర్చేలా కార్యాచరణ రూపొందించారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేసేలా అడుగులు వేశారు. ఆ కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టబెడుతూ టెరిషరీ కేర్‌కు చంద్రబాబు సర్కారు తూట్లు పొడుస్తోంది. వైద్యం పేరిట కార్పొరేట్ శక్తులు ప్రభుత్వ ఖజానా, ప్రజలను దోచుకునేందుకు పచ్చజెండా ఊపుతోంది.
మదనపల్లె ప్రభుత్వ వైద్య కళాశాల సామగ్రి తరలింపు
మదనపల్లె రూరల్: అన్నమయ్యజిల్లా మదనపల్లె ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించిన సామగ్రిని బుధవారం ప్రభుత్వం అక్కడి నుంచి తరలించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని, సర్వజన బోధనాసుపత్రిగా మార్చినప్పుడు డీఎంఈ నుంచి వైద్యకళాశాలకు సామగ్రి వచ్చిందన్నారు. ప్రస్తుతం డీఎంఈ కార్యాలయ ఉత్తర్వుల మేరకు హైక్యాస్ట్ ఎక్విప్‌మెంట్‌ను ప్రభుత్వ మెడికల్ కళాశాల నుంచి పంపాల్సిందిగా ఆదేశాలు రావడంతో సామగ్రిని తరలించామని తెలిపారు.


