వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి
సాక్షి, అమరావతి: ‘మోంథా తుపానుతో తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజలు, రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. చంద్రబాబు విదేశాలకు, ఆయన కొడుకు మంత్రి లోకేశ్ క్రికెట్ మ్యాచ్‌లకు ప్రత్యేక విమానాల్లో వెళ్లి షికార్లు చేశారు. దీనిపై విమర్శలు రావడంతో డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియా ద్వారా అబద్ధపు కథనాలను వండి వార్చుతున్నారు’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మోంథా తుపానుతో 8 మంది చనిపోయారని, 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని, వారికి ప్రభుత్వం అండగా నిలవలేదన్నారు. తండ్రీ కొడుకుల టూర్లపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో గ్రీవెన్స్ డ్రామా మొదలు పెట్టారని.. లోకేశ్ 4 గంటల్లోనే 4 వేల అర్జీలను పరిశీలించారంటూ జాకీలెత్తి ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ‘అసలు అన్ని అర్జీలు పరిశీలించడం సాధ్యమా? ఇద్దరూ అతిపెద్ద ఈవెంట్ మేనేజర్లుగా మారి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నారు. పాలనను గాలికొదిలేసి పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారు’ అని మండిపడ్డారు. ప్రజాధనంతో చంద్రబాబు 75 సార్లు, లోకేశ్ 80 సార్లు హైదారాబాద్‌కు స్పెషల్ ఫ్లైట్లలో తిరిగారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 120 సార్లకు పైగానే వెళ్లారని అన్నారు.


