బండరాయితో తలపై మోది చంపేశారు
ల్యాండ్ సెటిల్మెంట్లే కారణమని అనుమానం
పరవాడ: లంకెలపాలెం దరి శ్రీరామనగర్ కాలనీ వద్ద మంగళవారం అర్ధరాత్రి కాలనీకి చెందిన ఈగల వెంకినాయుడు(40) దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనకు సంబంధించి పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపిన వివరాలు.. లంకెలపాలెం దరి శ్రీరామనగర్‌కాలనీ(విలేకరుల కాలనీ)కి చెందిన వెంకినాయుడు.. మొల్లి సరస్వతి అనే మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. హతుడి భార్య, ఇద్దరు పిల్లలు పెద్దినాయుడుపాలెం ఉంటారు. మృతుడు ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడంతో పాటు కూర్మన్నపాలెంలోని ఓ జిమ్‌లో కోచ్. మంగళవారం రాత్రి కాలనీలోని ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. రాత్రి 1 గంట సమయంలో తేజ అనే వ్యక్తి వచ్చి వెంకినాయుడును బయటకు రమ్మని పిలిచాడు.
హతుడు స్వెటర్ వేసుకుని వెళ్లడం చూసిన సరస్వతి, ఏదో పని మీద బయటకు వెళుతున్నారని భావించి నిద్రపోయింది. వేకువ జామున లేచి వెంకినాయుడుకు, తేజకు ఫోన్ చేసింది. అటునుంచి సమాధానం రాలేదు. ఉదయానికి వెంకినాయుడు మృతదేహం సమీపంలోని లేఅవుట్‌లో పడి ఉందని స్థానికులు చెప్పడంతో.. వెళ్లి చూసి, హత్యకు గురైంది వెంకినాయుడేనని నిర్ధారించుకుని పరవాడ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి షర్ట్ చిరిగి ఉండటంతో స్నేహితుల మధ్య పెనుగులాట జరిగి ఉంటుందని, సమీపంలో లభ్యమైన 10 కిలోల బరువుండే బండ రాయితో తలపై గట్టిగా మోదడంతో తల నుజ్జుయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
ఘటనా స్థలాన్ని పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్, సీఐ ఆర్.మల్లికార్జునరావు సందర్శించారు. క్లూస్ టీంను రంగంలోకి దించి వివరాలు రాబట్టారు. స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి హత్యకు గల కారణాలను ఆరా తీశారు. ల్యాండ్ సెటిల్మెంట్లే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదుచేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.


