విశాఖపట్నం: తాము చేసిందే సంసారం.. అన్నట్టుగా ఉంది చంద్రబాబు ప్రభుత్వంలో ఆ పార్టీ స్థానిక నేతల ద్వంద్వ వైఖరి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.6 కోట్లతో ప్రతిపాదించి, నిర్మాణం ప్రారంభించిన గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రంపై అప్పట్లో నానా యాగీ చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు దాన్ని మించిన గొప్ప ప్రాజెక్టు లేదంటూ కితాబులిస్తున్నారు. నిలిచిన పనులను సత్వరమే పూర్తిచేసి, ప్రారంభిస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు.
అప్పుడు అక్రమం.. ఇప్పుడు సక్రమం
జీవీఎంసీ 13వ వార్డు పరిధి ముడసర్లోవ వద్దనున్న రోజ్ పార్కులో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి మేయర్ గొలగాని హరివెంకట కుమారి చర్యలు తీసుకున్నారు. పేదలకు ఉపయోగపడని, కేవలం ధనికుల కోసమే దీన్ని నిర్మిస్తున్నారంటూ అప్పట్లో టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అడ్డగోలుగా మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాక ఆ పనుల్ని అర్ధంతరంగా నిలిపేశారు. ఇప్పుడు మాత్రం దాన్ని చాలా గొప్ప ప్రాజెక్టుగా కీర్తిస్తూ, అదే కేంద్రాన్ని కొనసాగిస్తామని ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వెలగపూడి, మేయర్ పీలా కలసికట్టుగా చెప్పడం గమనార్హం.
శిక్షణ పార్క్ మంచిదే.. కానీ..!
బుధవారం ఇక్కడి నిర్మాణాల పరిశీలనకు వచ్చిన ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రం ఏర్పాటు మంచిదేనని, అప్పటి ప్రభుత్వం అనుసరించిన విధానం సరికాదని సెలవిచ్చారు. మేయర్ పీలా శ్రీనివాస్ అయితే మరో అడుగు ముందుకేసి మరీ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దీని ఏర్పాటును తానే వ్యతిరేకించానని, అయితే అప్పట్లో దీని గురించి జీవీఎంసీలో ‘సరిగా’తనకు ఎవరూ వివరించలేదని, అందుకో అడ్డుకున్నామని చెప్పుకొచ్చారు. దీంతో టీడీపీ నేతల తీరును స్థానికులు ఆక్షేపిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అక్రమం అన్న ప్రాజెక్టు.. ఇప్పుడు సక్రమం ఎలా అయిందంటూ.. ప్రశ్నిస్తున్నారు. వీళ్లది అధికారంలో లేకపోతే ఓ మాట, ఉంటే మరో మాట అంటూ ముక్కున వేలేసుకొంటున్నారు.
గుర్రాల శిక్షణ పార్కు అవసరమే..!
జీవీఎంసీ 13వ వార్డు పరిధి ముడసర్లోవ వద్ద రోజ్ పార్కులో అర్ధంతరంగా నిలిచిన గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రంను ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబులు బుధవారం సందర్శించారు. మధ్యలో ఆగిన నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేపట్టిన గుర్రాల శిక్షణ పార్కు అవసరమేనన్నారు. ఇక్కడ గుర్రాల శిక్షణ కేంద్రం పూర్తికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అప్పటి ప్రభుత్వం రూ.6 కోట్లతో దీని ఏర్పాటుకు సంకలి్పంచిందన్నారు. నెలకు రూ.3 వేలు తక్కువ అద్దెకు నిర్వాహకుడికి ఇచ్చేందుకు ప్రతిపాదించిందని, దాన్ని ఎక్కువ అద్దె వచ్చేలా తాము ప్రయతి్నస్తామన్నారు.


