పండుగ సీజన్, డాలర్ విలువ తగ్గడం, స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం వంటి కారణాల వల్ల ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే ప్రస్తుతం గోల్డ్ రేటు స్వల్ప తగ్గుదలను నమోదు చేస్తోంది. వెండి కూడా అదే బాటలో నడుస్తోంది. డిసెంబర్ నెలలో పసిడి ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ ఆర్థిక పరిణామాలు బంగారం ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌లోని కమోడిటీ రీసెర్చ్ సీనియర్ విశ్లేషకుడు మానవ్ మోదీ అన్నారు. అమెరికా ఫెడ్ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తరువాత.. బంగారం 4000 డాలర్ల మార్కు దగ్గర కదలాడాయి. డిసెంబర్‌లో కూడా ఫెడ్ రేటు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి బంగారం ధర తగ్గే సూచనలు ఉన్నాయని ఆయన అన్నారు.
చైనాలో, బంగారు రిటైలర్లకు వ్యాట్ ఆఫ్‌సెట్‌లను తొలగించడం, మినహాయింపులను 13 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడం వలన ప్రధాన బ్యాంకులు కొత్త రిటైల్ ఖాతాలను స్తంభింపజేయడానికి దారితీశాయి. ఇది ప్రపంచంలోని అగ్ర బంగారు మార్కెట్‌లో డిమాండ్‌ను తగ్గించే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో అమెరికా తన కీలకమైన ఖనిజాల జాబితాలో యురేనియం, రాగి, వెండిని కూడా చేర్చింది. కాబట్టి గోల్డ్ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది.
నేటి బంగారం, వెండి ధరలు ఇలా..
నవంబర్ 10న మన దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,23,220 వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,12,950 వద్ద ఉన్నాయి. మొత్తం మీద ఈ నెల (నవంబర్) ప్రారంభం నుంచి గోల్డ్ రేటు తగ్గుతూ.. పెరుగుతూ ఉందని స్పష్టమవుతోంది.
వెండి ధరల విషయానికి వస్తే.. ఈ రోజు (సోమవారం) సిల్వర్ రేటు రూ. 2000 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 1.67 లక్షలకు చేరింది. అంటే ఒక గ్రామ్ వెండి రేటు 167 రూపాయల దగ్గర ఉంది. గత నెలలో రూ. 2 లక్షలు దాటేసిన సిల్వర్ ధర.. ఇప్పుడిప్పుడే కొంత తగ్గుతూ ఉంది.
ఇదీ చదవండి: బంగారం: ఇప్పుడు కొనాలా.. ఇంకొన్ని రోజులు వేచి చూడాలా?


