దసరా, దీపావళి వంటి పండుగలు ముగిసినప్పటికీ.. పసిడికి ఏ మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. గత నెలతో పోలిస్తే.. ఈ నెలలో గోల్డ్ రేటు కొంత తగ్గడం కూడా బంగారం కొనుగోళ్లు పెరగడానికి కారణమయ్యాయి. అయితే ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైపోయింది. కాబట్టి గోల్డ్ ఇప్పుడు కొనాలా?, ఇంకొన్ని రోజులు వేచి చూడాలా? అని చాలామందిలో ఓ సందేహం ఏర్పడింది.
2025 నవంబర్ 1నుంచి డిసెంబర్ 14వరకు భారతదేశంలో సుమారు 48 లక్షల వివాహాలు జరగనున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించింది. ఈ సీజన్‌లో సుమారు రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని తన నివేదికలో పేర్కొంది. ఇందులో ప్రధానంగా గోల్డ్ అమ్మకాలు భారీగా ఉంటాయని స్పష్టం చేసింది.
మన దేశంలో పెళ్లిళ్లకు భారీగా ఖర్చు చేస్తారు. ఇక పెళ్లి అనగానే బంగారం కొనుగోలు తప్పకుండా ఉంటుంది. స్థాయిని బట్టి.. ప్రతి ఒక్కరూ గోల్డ్ కొనడం జరుగుతుంది. దీంతో పసిడి అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ సమయంలో బహుశా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.
ఇక బంగారం ఇప్పుడు కొనాలా?, ఇంకొన్ని రోజులు వేచి చూడాలా? అనే విషయానికి వస్తే.. గోల్డ్ కొనుగోలు చేయడం అనేది ఒక వ్యక్తి బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది.
అయితే ఇది పెళ్లిళ్ల సీజన్.. ధరలు ఇప్పుడు ఎక్కువగా ఉంటాయి, తరువాత తగ్గుతాయి.. అనుకోవడంలో ఎలాంటి ఖచ్చితత్వం లేదు. ఎందుకంటే పెళ్లిళ్ల సీజన్ తరువాత తప్పకుండా తగ్గుతాయని ఊహించలేము. పెరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. దీనికి ప్రధాన కారణం డిమాండ్. అంటే.. బంగారం అనేది సురక్షితమైన ఆస్తి కాబట్టి కొనుగోలు చేసేవాళ్లు కొంటూనే ఉంటారు. డిమాండుకు తగ్గ సరఫరా ఉన్నప్పుడు.. ధరలు తగ్గొచ్చు, డిమాండ్ ఎక్కువగా ఉండి, సరఫరా తక్కువ ఉంటే?, ధరలు పెరుగుతాయు. కాబట్టి చేతిలో డబ్బు ఉన్నప్పుడు, బంగారం కొనాలని నిర్ణయించుకున్నప్పుడు.. కొనేయడమే ఉత్తమం.
శనివారం మన దేశంలో బంగారం ధరల విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,22,020 వద్ద.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,11,850 వద్ద ఉంది. శుక్రవారం ధరలతో పోలిస్తే.. శనివారం ధరల్లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది.
ఇదీ చదవండి: 2019లో భర్తకు విడాకులు.. ఆరేళ్లుగా లక్షల కోట్లు విరాళం


