డబ్బు సంపాదించే కొద్దీ ఇంకా పోగుచేసుకుందాం అనే ఆలోచన కొందరికి, సంపాదించే దాంట్లోనే నలుగురికి సహాయం చేసేద్దాం అనుకునే మనుషులు ఇంకొంతమంది. ఇలాంటి కోవకు చెందినవారిలో ఒకరు జెఫ్ బెజోస్ మాజీ భార్య 'మెకెంజీ స్కాట్'. 2020 నుంచి ఈమె 19 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విరాళంగా ఇచ్చినట్లు.. ఫోర్బ్స్ నివేదించింది.
2019లో మెకెంజీ స్కాట్ & జెఫ్ బెజోస్ విడాకులు తీసుకున్నప్పుడు.. అమెజాన్‌లో ఆమె వాటా దాదాపు 4 శాతం. ఎందుకంటే ఆమె ఈ-కామర్స్ దిగ్గజం స్థాపన, ప్రారంభ కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించింది. ఆ సమయంలో ఈ నాలుగు శాతం వాటా దాదాపు 139 మిలియన్ షేర్లకు సమానం.
2019 నుంచి స్కాట్ తన వాటాలో 42 శాతం.. దాదాపు 58 మిలియన్ షేర్ల విలువను విరాళంగా ఇచ్చారు. మొత్తం మీద 19.25 బిలియన్ డాలర్లను (రూ.1.70 లక్షల కోట్లు) విరాళంగా ఇచ్చినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. దీనికోసం ఆమె అమెజాన్‌లో తన వాటాను అమ్ముతూనే ఉంది. భారీ మొత్తంలో విరాళాలు అందిస్తున్నప్పటికీ.. మెకెంజీ స్కాట్ నికర ఆస్తుల విలువ 35.6 బిలియన్ డాలర్లు (రూ. 3.15 లక్షల కోట్లు)గా ఉంది.
మెకెంజీ స్కాట్ విరాళాలు
మెకెంజీ స్కాట్.. హోవార్డ్ విశ్వవిద్యాలయానికి 80 మిలియన్ డాలర్లు, వర్జీనియా స్టేట్ విశ్వవిద్యాలయానికి 50 మిలియన్ డాలర్లు, ఆల్కార్న్ స్టేట్ విశ్వవిద్యాలయానికి 42 మిలియన్ డాలర్లు, స్పెల్మాన్ కళాశాలకు 38 మిలియన్ డాలర్లు, యునైటెడ్ నీగ్రో కళాశాల నిధి (UNCF)కి 70 మిలియన్ డాలర్లు, ఆఫ్రికన్ అమెరికన్ కల్చరల్ హెరిటేజ్ యాక్షన్ ఫండ్‌కు 40 మిలియన్ డాలర్లు, సెంటర్ ఫర్ డిజాస్టర్ ఫిలాంత్రోపీకి 60 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు.
ఇదీ చదవండి: కియోసాకి ఆర్ధిక సూత్రాలు: ధనవంతులయ్యే మార్గాలు


