వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు, రచయిత అయిన రాబర్ట్ కియోసాకి.. ఒక వ్యక్తి ధనవంతుడు కావాలంటే.. ఏం చేయాలి?, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అనే సూచనలు ఇస్తూ ఉంటారు. ఈయన రాశిన పుస్తకాలలో ఒకటైన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' కూడా ఎలా నడుచుకుంటే.. మీరు ఉన్నత స్థాయికి చేరుతారనే విషయాలను వెల్లడిస్తుంది. ఈ కథనంలో కియోసాకి ఆర్థిక సూత్రాల గురించి తెలుసుకుందాం.
కియోసాకి ఆర్థిక సూత్రాలు
ఆస్తులు కొనండి, బాధ్యతలు తగ్గించండి: కియోసాకి ప్రకారం.. ఆస్తులు అంటే మీ జేబులోకి డబ్బు తెచ్చేవి. ఉదాహరణకు వ్యాపారం చేయడం, ఇల్లు అద్దెకు ఇవ్వడం, పెట్టుబడులు పెట్టడం లాంటివన్నమాట. ఇక బాధ్యతలు అంటే.. మీ చేతిలో ఉన్న డబ్బు ఖర్చయిపోయేవి. కారు లోన్, ఖరీదైన జీవన విధానం. దీనివల్ల డబ్బు రాదు. కాబట్టి ధనవంతులు ఆస్తులు కొనుగోలు చేస్తారు, పేదవారు బాధ్యతలనే ఆస్తులుగా భావిస్తారు.
ఆర్థిక విద్య: సంప్రదాయ విద్య.. వల్ల ఉద్యోగం వస్తుంది. కానీ మీరు నేర్చుకునే ఆర్ధిక విద్య మీకు స్వేచ్ఛను ఇస్తుంది. డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడమే విజయానికి మూలం అంటారు కియోసాకి. ఆదాయం కంటే కూడా.. ఆదాయ ప్రవాహం ఎలా ఉందో నేర్చుకోండి. డబ్బు కొంత సంపాదించిన తరువాత.. మీరు పనిచేయకపోయినా.. మరింత డబ్బు వచ్చే ఉత్తమ మార్గాలను ఎంచుకోవాలి.
నేర్చుకోవడానికి ప్రాధాన్యం: మీరు చేసేపని ప్రధానంగా డబ్బు కోసం కాకుండా.. నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే మీరు చేసే పనిలో లేదా ఉద్యోగంలో నైపుణ్యాలను పెంచుకోండి. మార్కెటింగ్, రియల్ ఎస్టేట్, స్టాక్స్, బిజినెస్ వంటి వాటి మీద పట్టు సంపాదించండి. ఇవన్నీ నేర్చుకున్న తరువాత.. ఎలా డబ్బు సంపాదించాలో మీకే అర్థమవుతుంది.
పెట్టుబడి: చాలామంది పెట్టుబడి ప్రమాదకరం అనుకుంటారు. నిజానికి ఈ ప్రమాదం అవగాహన లేకపోవడం వల్ల వస్తుంది. కాబట్టి అవగాహన ముఖ్యం. మిడిమిడి జ్ఞానంతో పనిచేస్తే ఆర్ధిక నష్టాలు చూడాల్సి వస్తుంది. అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోండి. మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోండి. తరువాత పెట్టుబడులు పెట్టండి.
డబ్బు కోసం కాదు.. మీ కోసం డబ్బు: డబ్బు కోసం మీరు పనిచేయడం కాదు, డబ్బు మీ కోసం పనిచేయాలి అంటారు కియోసాకి. ఉదాహరణకు ఒక ఉద్యోగం చేస్తారు, జీతం వస్తుంది, నెలవారీ బిల్లులు చెల్లిస్తారు. మిగిలిన డబ్బు ఖర్చు చేస్తారు. ఇదే జీవితాంతం కొనసాగుతుంది. ఇదే డబ్బు కోసం పనిచేయడం అన్నమాట.
డబ్బు మీ కోసం పనిచేయడం అంటే.. ఒక ఇల్లు కొంటారు, దాన్ని అద్దెకు ఇస్తారు. మీకు ప్రతి నెలా డబ్బు వస్తుంది. మీరు షేర్లలో పెట్టుబడి పెడితే, కంపెనీ లాభాల్లో భాగంగా డివిడెండ్ వస్తుంది. ఏదైనా వ్యాపారం ఉంటే.. మీరు పని చేయకపోయినా వ్యాపారమే మీకు డబ్బు సంపాదిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. మీరు ఒక బుక్ రాశినా, సాఫ్ట్‌వేర్ రూపొందించినా, మ్యూజిక్ క్రియేట్ చేసినా అవి అమ్ముడవుతాయి. తద్వారా మీకు డబ్బు వస్తుంది.
ఇదీ చదవండి: టెస్లా బాస్‌కు భారీ ప్యాకేజ్: దిగ్గజ సీఈఓల వేతనాలు ఇవే..


