ఒకే ఒక్క రూల్.. ప్రపంచ మార్కెట్లను ఎన్నో ఏళ్లుగా ఏలుతోంది. సగటు ఇన్వెస్టర్లు ధనవంతులు అయ్యేందుకు రామ బాణంలా పనిచేస్తూ వస్తోంది. అదే వారెన్ బఫెట్ ప్రతిపాదించిన 90/10 పెట్టుబడి వ్యూహం. వ్యక్తిగత మదుపరులకు అందుబాటులో ఉన్న అత్యంత సరళమైన, ప్రభావవంతమైన విధానాలలో ఒకటిగా ఇది నిలిచింది. అధిక రుసుములు, అనవసరమైన సంక్లిష్టతను నివారిస్తూ, దీర్ఘకాలంలో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి నుంచి లాభపడేందుకు సగటు మదుపరులకు సహాయపడాలనే ఉద్దేశంతో బఫెట్ ఈ నియమాన్ని సూచించారు.
మార్కెట్ను అంచనా వేయడంలో చాలా మంది యాక్టివ్ ఫండ్ మేనేజర్లు విఫలమవుతున్నారని చాలా కాలంగా విమర్శిస్తూ వచ్చిన బఫెట్.. చారిత్రక మార్కెట్ డేటా, సహనం, కాంపౌండింగ్ శక్తిపై ఆధారపడేలా పెట్టుబడి ప్యూహాన్ని ప్రతిపాదించారు. 90/10 వ్యూహం పెట్టుబడిదారులకు వృద్ధిని గరిష్టంగా పొందే అవకాశం ఇస్తూనే, చిన్న భద్రతా వలయాన్ని కూడా కల్పిస్తుంది. తక్కువ నిర్వహణ, దీర్ఘకాలికంగా నిలకడైన, అమలు సాధ్యమైన వ్యూహంగా దీన్ని రూపొందించారు.
ఏమిటీ 90/10 రూల్?
మదుపరులు పెట్టే పెట్టుబడుల్లో 90 శాతం తక్కువ ఖర్చుతో కూడిన ఎస్& పి 500 ఇండెక్స్ ఫండ్లో మిగిలిన 10 శాతం స్వల్పకాలిక అమెరికా ప్రభుత్వ ట్రెజరీ బిల్లుల్లో ఇన్వెస్ట్ చేయాలనేది ఈ నియమం సారాంశం.
బఫెట్ 2013లో తన బెర్క్ షైర్ హాత్వే వాటాదారులకు రాసిన లేఖలో ఈ నియమాన్ని మొదటిసారిగా బహిరంగంగా వివరించారు. బెంజమిన్ గ్రాహం బోధనలను ఆధారంగా తీసుకుని, చాలా మంది వ్యక్తిగత మదుపరులకు స్టాక్స్‌ను లోతుగా విశ్లేషించే సమయం లేదా నైపుణ్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. గెలుపు గుర్రాల్లాంటి స్టాక్స్‌ను ఎంచుకోవడానికి ప్రయత్నించడంకన్నా, విస్తృత మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం మెరుగైన మార్గం అనేది బఫెట్ అభిప్రాయం.
తన భార్య కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్కు సంబంధించిన పెట్టుబడులకు కూడా ఇదే సూత్రాన్ని పాటించారు బఫెట్. దీంతో ఈ వ్యూహంపై ఇన్వెస్టర్లకు నమ్మకం మరింత బలపడింది.
బఫెట్ లాజిక్ ఇదే..
కాలక్రమేణా అమెరికన్ వ్యాపార రంగం పెరుగుతుందనేది బఫెట్ నమ్మకం. ఆ వృద్ధిని సంపూర్ణంగా పొందాలంటే విస్తృత మార్కెట్ బహిర్గతం అవసరం. అధిక ఫీజులు, భావోద్వేగ నిర్ణయాలు, తప్పుడు టైమింగ్ వంటి అంశాలు మదుపరుల రాబడులను తగ్గిస్తాయి. ఇండెక్స్ ఫండ్లు ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తాయి.
బఫెట్ తరచూ చెప్పే మాట ఒక్కటే ‘చిన్నపాటి ఫీజులు కూడా దీర్ఘకాలంలో భారీ నష్టాలకు దారి తీస్తాయి.’
ప్రయోజనాలు.. పరిమితులు
90/10 వ్యూహం అనేక స్పష్టమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఎస్&పీ 500 దాదాపు ఒక శతాబ్దంలో స్థిరమైన వృద్ధిని అందించిందని దీర్ఘకాలిక డేటా చూపిస్తోంది. దాని విస్తృత వైవిధ్యం.. అధిక ఈక్విటీ కేటాయింపుతో వచ్చే రిస్క్ను కూడా పరిమితం చేస్తుంది. తక్కువ నిర్వహణ రుసుములు కాంపౌండింగ్ను మరింత పెంచుతాయి. కాలక్రమేణా పోర్ట్ ఫోలియోకు వేలాది డాలర్లను జోడిస్తాయి.
అయితే ఈక్విటీలకు 90 శాతం కేటాయింపు అందరికీ తగినది కాదని విమర్శకులు గమనించారు. ఇది పదవీ విరమణ చేసిన వారికి లేదా రిస్క్ సహనం తక్కువ ఉన్నవారికి దూకుడుగా ఉండవచ్చు.


