సాక్షి, హైదరాబాద్: ఆసుపత్రి పెట్టుబడుల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఆసుపత్రి మాజీ ఎండీపై 14 మంది సీనియర్ డాక్టర్ల ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ ఆసుపత్రి మాజీ ఎండీపై కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో రూ.38 కోట్లకు పైగా మోసం చేశారంటూ ఎండీపై ఆరోపణలు ఉన్నాయి. భారీ లాభాల ఆశ చూపి డాక్టర్లను నమ్మించారని.. మోసానికి మాజీ ఎండీతో పాటు అతని సోదరుడి పాత్ర ఉందంటూ ఫిర్యాదు చేశారు.
ప్లాస్టిక్ సర్జన్ డా. చొక్కా రాజేష్ వాసు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2014–2015 మధ్య ఆసుపత్రి ఈక్విటీ పేరిట పెట్టుబడులు పెట్టగా.. మొత్తం రూ.100 కోట్ల మేరకు డాక్టర్ల నుంచి నిధుల సమీకరణ చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదు చేసిన 14 మంది డాక్టర్ల పెట్టుబడి రూ.38 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. హామీ ఇచ్చిన లాభాలు ఇవ్వకుండా మభ్యపెట్టినట్టు డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఖాతాల్లో నష్టాలు చూపుతూ డాక్టర్లను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రోగుల సంఖ్య బాగానే ఉన్నా నష్టాలంటూ లెక్కలు చూపినట్టు ఆరోపిస్తున్నారు. కోవిడ్ సమయంలో రోగుల నుంచి అధిక బిల్లుల వసూలు ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రి ఆదాయాన్ని రియల్ ఎస్టేట్, బంగారానికి మళ్లించారని ఫిర్యాదులో పేర్కొనగా.. ఆసుపత్రి నిధుల ఉద్దేశపూర్వక దారి మళ్లింపు ఆరోపణలు ఉన్నాయి. పీఏసీ 406, 409, 477-A, 120-B సెక్షన్ల కింద సీసీఎస్ పోలీసులు కేసు చేశారు. మాజీ ఎండీ, అతని సోదరుడిపై లోతైన దర్యాప్తు చేపట్టారు. ఆధారాలపై తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయని సీసీఎస్ స్పష్టం చేసింది.


