రూ.లక్షల బంగారం.. లాకర్‌లో సేఫేనా? | Is Gold Stored in Bank Lockers Truly Safe Know RBI rules | Sakshi
Sakshi News home page

రూ.లక్షల బంగారం.. లాకర్‌లో సేఫేనా?

Jan 25 2026 5:34 PM | Updated on Jan 25 2026 6:06 PM

Is Gold Stored in Bank Lockers Truly Safe Know RBI rules

ఇటీవల బంగారం ధర భారీగా పెరిగిపోయింది. ఒక్క తులం (10 గ్రాములు) బంగారమే రూ.1.5 లక్షలు దాటిపోయింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల భద్రత గురించి ఆందోళనలు సైతం ఎక్కువయ్యాయి. బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్‌లో ఉంచితే పూర్తిగా సురక్షితం అని చాలామంది భావిస్తారు.

నిజానికి, బ్యాంకు లాకర్లు బలమైన భౌతిక భద్రత అందించినప్పటికీ, ఆభరణాలు పోయినా లేదా దెబ్బతిన్నా పూర్తి ఆర్థిక రక్షణ  ఇవ్వవు.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం.. లాకర్ విషయంలో బ్యాంకుల బాధ్యత పరిమితమైనదే. చాలా సందర్భాల్లో నష్టాన్ని కస్టమరే భరించాల్సి వస్తుంది.

లాకర్‌లోని వస్తువులకు బీమా ఉంటుందా?
లాకర్‌లో ఉంచిన ఆభరణాలకు బ్యాంకు బీమా చేస్తుందనేది ఒక పెద్ద అపోహ. వాస్తవానికి, లాకర్ కంటెంట్‌కు బ్యాంకులు ఎలాంటి బీమా ఇవ్వవు. దొంగతనం, అగ్నిప్రమాదం లేదా ఇతర కారణాల వల్ల ఆభరణాలు నష్టపోయినా, బ్యాంకు ఆటోమేటిక్‌గా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.

భద్రతా వైఫల్యం, సిబ్బంది నిర్లక్ష్యం లేదా మోసం, లాకర్ నిర్వహణ లోపాలు వంటి సందర్భాల్లో మాత్రమే బ్యాంకు బాధ్యత వహిస్తుంది. బ్యాంకు తప్పిదం నిరూపితమైనా, పరిహారం మొత్తానికి పరిమితి ఉంటుంది. ఆర్బీఐ నియమాల ప్రకారం, బ్యాంకు చెల్లించే గరిష్ట పరిహారం వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లు మాత్రమే. ఉదాహరణకు మీ లాకర్ అద్దె సంవత్సరానికి రూ.4,000 అయితే, మీ ఆభరణాల విలువ ఎంత ఎక్కువైనా గరిష్ట పరిహారం రూ.4 లక్షలు మాత్రమే.

వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల లాకర్‌కు నష్టం జరిగితే, బ్యాంకు నిర్లక్ష్యం నిరూపించబడనంత వరకు బ్యాంకు బాధ్యత వహించదు. అటువంటి పరిస్థితుల్లో మొత్తం ఆర్థిక నష్టం కస్టమరుదే.

ప్రత్యేక ఆభరణాల బీమా అవసరం
విలువైన బంగారు ఆభరణాలకు ప్రత్యేక జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పాలసీలు సాధారణంగా దొంగతనం, అగ్నిప్రమాదం, డ్యామేజ్, బ్యాంకు లాకర్‌లో ఉన్నప్పుడూ జరిగే నష్టం వంటి వాటికి కవరేజ్ ఇస్తాయి.

క్లెయిమ్ సులభంగా రావాలంటే..
ఆభరణాల ఫోటోలు భద్రపరుచుకోండి. తాజా వాల్యుయేషన్ సర్టిఫికెట్లు దగ్గర ఉంచుకోండి. ఆభరణాలు లాకర్‌లో ఉన్నాయని బీమా కంపెనీకి తెలియజేయండి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం, ఇప్పుడు అన్ని బ్యాంకులు ప్రామాణిక లాకర్ ఒప్పందం అనుసరించాలి. మీరు సంతకం చేసిన అగ్రిమెంట్‌లో మీ హక్కులు, బ్యాంకు బాధ్యతలు, పరిహార నిబంధనలు స్పష్టంగా ఉన్నాయో లేదో తప్పకుండా పరిశీలించండి.

బ్యాంకు లాకర్ భౌతిక భద్రతకు మంచి ఎంపికే కానీ, పూర్తి ఆర్థిక రక్షణ ఉండదు. పరిమిత బ్యాంకు బాధ్యతలు, ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల, లాకర్ + ఆభరణాల బీమా కలిపి ఉపయోగించడమే అత్యంత సురక్షితమైన మార్గం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement