సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో పనిచేస్తున్న వ్యక్తిపై వంద కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం జిల్లాకు చెందిన భీమర శెట్టి రమణబాబు అనే వ్యక్తి ఈ ఆరోపణలు చేశారు.
రమణబాబు తెలిపిన వివరాల ప్రకారం, అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని అచ్చుతాపురం మండలం దుప్పుతూరు గ్రామంలో తనకు చెందిన 11 ఎకరాల 30 సెంట్ల భూమిని కబ్జా చేసేందుకు సురేష్ అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. సురేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో పనిచేస్తున్నారని తెలిపారు.
ఈ భూమిపై 2004 నుంచి కోర్టు కేసులు నడుస్తున్నాయని, హైకోర్టు, సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పులు ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ భూమిని తమకు అప్పగించకపోవడం బాధాకరమని రమణబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సత్య అనే వ్యక్తితో పాటు మరొకరు ఈ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, వీరికి సురేష్ అండగా ఉన్నారని ఆరోపించారు. తన భూమికి సంబంధించి పాస్‌బుక్‌లు ఇవ్వకుండా సురేష్ అడ్డుపడుతున్నాడని, చుట్టుపక్కల భూములకు పాస్‌బుక్‌లు వచ్చినా తన భూమికి మాత్రం ఇవ్వకపోవడం అన్యాయమని రమణబాబు అన్నారు. తన భూమి విలువ రూ.110 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని, తన పేషీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని రమణబాబు కోరారు. నా భూమిని నాకు అప్పగించకపోతే, పవన్ కళ్యాణ్‌ను కలసి, ఆయన పేషీలో జరుగుతున్న విషయాలను బహిరంగంగా వెల్లడిస్తాను’ అని హెచ్చరించారు. ఓవైపు అవినీతి, భూకబ్జాలపై పోరాడతానని చెబుతున్న పవన్ కళ్యాణ్, తన పేషీలోనే ఇలాంటి వ్యవహారాలు జరుగుతుంటే ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? అని రమణబాబు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.


