తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో నడిరోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్తున్న పోలీసులు (ఫైల్)
నిందితులతో రోడ్డుపై పరేడ్
వ్యక్తుల సామాజిక గౌరవానికి తూట్లు
ఏపీ పోలీసుల బరితెగింపు
సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు
సాక్షి, అమరావతి: ఇప్పటికే బరితెగించి వ్యవహరిస్తున్న ఏపీ పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం నిర్భీతిగా బేఖాతరు చేసే స్థాయికి చేరారు. రెడ్‌బుక్ రాజ్యాంగ అరాచకాలకు వత్తాసు పలకడమే ఏకైక కర్తవ్యంగా రాజ్యాంగ ధర్మాన్ని నిస్సిగ్గుగా పోలీసు శాఖ విస్మరిస్తోంది. నిందితుల అరెస్టు, న్యాయస్థానంలో హాజరుపరిచే ప్రక్రియపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై స్వయంగా డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం విస్మయపరుస్తోంది. ఆయా అంశాలకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలు ఏమిటీ?.. ఏపీ పోలీసుల బరితెగింపు ఏ స్థాయికి చేరిందన్న అంశాలు పరిశీలిస్తే...
నిందితులను పరేడ్ చేయించకూడదు
డీజీపీలకు సుప్రీంకోర్టు ఆదేశం
ఏదైనా కేసుల్లో నిందితులను అరెస్టు విషయంలో పోలీసులు కచ్చితంగా నిబంధనలకు లోబడి వ్యవహరించాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. నిందితులను అరెస్టు చేయడం, న్యాయస్థానంలో హాజరుపరిచే ప్రక్రియలో అనుసరించాల్సిన విధి విధానాలను నిర్దేశించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ ప్రకారం..
⇒ ఒక కేసులో నిందితులుగా ఉన్నంత మాత్రాన వారు నేరస్తులుగా భావించలేం. నేరం నిరూపితం కానంతవరకు నేరస్తులు కారు.
⇒ ఇక నిందితుల సామాజిక గౌరవానికి పోలీసులు భంగం కలిగించ కూడదు. వారి గౌరవాన్ని పోలీసులు కచ్చితంగా పరిరక్షించాలి. అరెస్టు చేసిన నిందితులను బహిరంగంగా నడిపిస్తూ పరేడ్ చేయించకూడదు. వారిని ప్రజలకు కనిపించేలా ప్రదర్శించకూడదు.
⇒ నిందితులను సోదా చేసే ప్రక్రియ గౌరవప్రదంగా ఉండాలి. వారి వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించకూడదు.
⇒ అరెస్టు సమయంలో పోలీసులు బల ప్రయోగం చేయడం సరికాదు.
⇒ నిందితులు తప్పించుకునేందుకు యత్నిస్తే, గాయాలు కాకుండా వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించాలి. అంతేగానీ అరెస్టు కోసమని చెప్పి గాయపరచ కూడదు.
సుప్రీం కోర్టు చెప్పినా లెక్క చేయం: ఏపీ పోలీసుల నిర్భీతి
నిందితుల గౌరవానికి భంగం కలిగించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను తాము లెక్కచేయబోమంటూ బాబు సర్కార్ హయాంలో ఏపీ పోలీసులు బరితెగిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో కక్ష పూరితంగా అరెస్టు చేసిన పలువురు నిందితులను రోడ్డుపై నడిపించి పరేడ్ చేయించడం పోలీసుల దాషీ్టకానికి నిదర్శనం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను సంప్రదాయ జాతర తరహాలో నిర్వహించిన అభిమానులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. నరికిన పొట్టేళ్ల తలలను దండగా చేసి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫ్లెక్సీకి వేసి వేడుకలు చేసిన టీడీపీ అభిమానులను పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు.
కానీ సాధారణ జాతర శైలిలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించిన వైఎస్సార్‌సీపీ అభిమానులపై మాత్రం కక్ష గట్టారు. శ్రీసత్యసాయి, అనంతపురం, ఉభయ గోదావరి తదితర జిల్లాల్లో ఏకంగా 13 కేసులు నమోదు చేశారు. ఆ కేసుల్లో నిందితులుగా ఉన్న యువకులను అరెస్టు చేశారు. అంతేకాదు...వారిని తీవ్రంగా కొట్టారు. అనంతరం వారిని నడిరోడ్డుపై నడిపిస్తూ పరేడ్ నిర్వహించారు. తద్వారా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు నిర్భీతిగా ఉల్లంఘించారు. నిందితుల సామాజిక గౌరవానికి భంగం కలిగించారు. వారి వ్యక్తిగత గోప్యత హక్కును కాలరాశారు. మొత్తం మీద సుప్రీంకోర్టు ఆదేశాలంటే తమకు ఏమాత్రం లెక్క లేదని తేల్చి చెప్పారు.
వాహనాలు లేవు.. అందుకే నడిపించాం: డీజీపీ గుప్తా బాధ్యతా రహిత స్పందన
నిందితుల గౌరవానికి భంగం కలిగించ కూడని.. వారిని రోడ్డుపై నడిపిస్తూ పరేడ్ నిర్వహించకూడదని సుప్రీంకోర్టు డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ‘సుప్రీంకోర్టు చెబితే మాత్రం మేమేందుకు చేస్తాం’ అన్నట్టుగా సాక్షాత్తూ ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా స్పందించడం విభ్రాంతి కలిగిస్తోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా నిందితులను రోడ్డుపై పరేడ్ చేయించడంపై మీడియా ప్రతినిధులు ఆయనను సోమవారం ప్రశ్నించారు. దీనిపై డీజీపీ పూర్తి బాధ్యతారహితంగా స్పందించారు. ‘నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచేందుకు పోలీసుల వద్ద వాహనాలు లేవు. అందుకే నడిపించి తీసుకువెళ్లాం’ అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
తద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర పోలీసు శాఖకు ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర పోలీసు శాఖ చీఫ్ స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. ఇక ఇతర పోలీసు అధికారుల ఎలా వ్యవహరిస్తారన్న అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో సామాన్యుల గురించి ఎందుకు పట్టించుకుంటారని, పౌర హక్కుల మాటేమిటని మేధావులు, ప్రజాస్వామ్య హితైషులు ప్రశి్నస్తున్నారు. డీజీపీ గుప్తా ఒక దుస్సంప్రదాయానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


