వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే రాష్ట్రానికి రెన్యూ పవర్ ప్రైవేట్ లిమిటెడ్
విశాఖ సమ్మిట్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, రెన్యూ ఎనర్జీ మధ్య ఒప్పందాలు
గత ప్రభుత్వంలోనే పెట్టుబడుల ఒప్పందాలు, జీవోలపై సంతకాలు చేసిన ప్రస్తుత సీఎస్
అదే కంపెనీతో మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఎంవోయూ
రెన్యూ పెట్టుబడులు తామే రప్పించినట్లు ట్వీట్ చేసి అభాసుపాలైన లోకేశ్
సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు తరలి వచ్చేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన కృషిని 2023లో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు సాక్షిగా రెన్యూ పవర్ చైర్మన్, సీఈవో సుమంత్ సిన్హా ప్రశంసించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల కారణంగానే తాము ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు నాడు లింక్డిన్‌లోనూ స్వయంగా వెల్లడించారు.

వాస్తవం ఇలా ఉంటే.. రెన్యూ పవర్‌ని తామే రప్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నామంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. విశాఖలో అదానీ డేటా సెంటర్ పేరు మార్చి క్రెడిట్ చోరీకి పాల్పడ్డ టీడీపీ ప్రభుత్వ పెద్దలు.. పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వకపోగా, వైఎస్ జగన్ కట్టించిన ఇళ్లలోకి మళ్లీ కొత్తగా గృహ ప్రవేశాలు చేయించి, తామే కట్టించినట్లు డ్రామాలాడారు.
ఇప్పుడు విశాఖలో సీఐఐ సమ్మిట్ వేదికగా మరో క్రెడిట్ చోరీకి శ్రీకారం చుట్టారు. క్రెడిట్ చోరీలో తండ్రితో పోటీ పడుతున్న నారా లోకేశ్ రెన్యూ పవర్ విషయంలో సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేసి అడ్డంగా దొరికిపోయారు.
తరిమేసింది బాబు సర్కారే..!
విచిత్రంగా అదే రెన్యూ పవర్ సంస్థతో తాజాగా విశాఖ సదస్సుకు ఒకరోజు ముందే చంద్రబాబు సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి రెన్యూ పవర్‌ను తరిమేసింది చంద్రబాబు ప్రభుత్వమే. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేసి 600 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను కర్నూలు జిల్లాకు తరలిస్తూ ఈ ఏడాది జూలై 28న బాబు సర్కార్ జీఓ నెం.56 జారీ చేసింది. ఈ నిజాలను వెలుగులోకి తెచ్చిన నెటిజన్లు.. లోకేశ్ క్రెడిట్ చోరీకి పాల్పడ్డారంటూ మీమ్స్‌తో దుమ్మెత్తిపోస్తున్నారు.
రెన్యూ పవర్‌ను తెచ్చిందే వైఎస్ జగన్..
వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే రెన్యూ పవర్‌తో పెట్టుబడుల ఒప్పందం జరిగింది. 2023 జూన్ 20న 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో స్థాపించేందుకు రెన్యూ పవర్‌కు అనుమతిస్తూ జీవో నెం.15ను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జారీ చేసింది. అనంతరం 2024 ఫిబ్రవరి 5న అదే సంస్థను మరో 600 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతిస్తూ జీవో నెం.16ను వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసింది.
అంతేకాదు రెన్యూ సంస్థ ప్రాజెక్టులకు అవసరమైన భూములు ఆ రెండు జిల్లాల్లో కేటాయించేందుకు కూడా స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ నాడే అంగీకారం తెలిపింది. ఈ జీఓలపై నాటి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె.విజయానంద్ సంతకాలు చేశారు. దీన్నిబట్టి రెన్యూ పవర్ ప్రాజెక్టులకు వైఎస్ జగన్ హయాంలోనే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భూ కేటాయింపులతో సహా 600 మెగావాట్లు, 300 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు మంజూరయ్యాయనేది సుస్పష్టం.


