సాక్షి, అమరావతి: కూటమి ఎమ్మెల్యేలు ఇక నుంచి చేసే తప్పులకు.. తనకు ఎలాంటి సంబంధం ఉండబోదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ సచివాలయంలో సోమవారం మంత్రివర్గ సమావేశం అనంతరం కూటమి నేతల తీరుపై చర్చ జరిగింది. ఆ భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఏ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసినా ఇన్‌ఛార్జ్ మంత్రులు కఠినంగా వ్యవహరించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుతో అన్నారు. దీనికి స్పందించిన చంద్రబాబు ఆ వ్యవహారంతో ఇక తనకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన ఎమ్మెల్యేల బాధ్యత జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులే తీసుకోవాలని ఆదేశించారు.
ఇవాళ మూడున్నర గంటలపాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. అంశాలపై చర్చ అనంతరం మంత్రుల వద్ద చంద్రబాబు ఎమ్మెల్యేల పని తీరుపై చర్చ జరిగింది. ఇందులో 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లు తమ పద్దతులు మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అదే సమయంలో..
తన పార్టీ ఎమ్మెల్యేల తీరు దారుణంగా ఉందని టీడీపీ అధిష్టానం అంగీకరించింది. ఎమ్మెల్యేల అవినీతి, దోపిడీ బాగోతాలపై అంతర్గతంగా ఓ సర్వే నిర్వహించి.. ఆ నివేదికను తెప్పించుకున్న చంద్రబాబు, లోకేష్‌లు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అనవసరంగా కొందరికి టికెట్లు ఇచ్చామని మంత్రుల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అలాగే యువ తరాన్ని ప్రొత్సహించే క్రమంలో టికెట్లు ఇచ్చామని.. కానీ, ఫస్ట్ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లకు మంచి చెడులు తెలియడం లేదంటూ లోకేష్ అభిప్రాయపడ్డట్లు సమాచారం.


