2027లో పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాం
జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు
సాక్షి, అమరావతి : వెలిగొండ ప్రాజెక్టును 2026 సీజన్ మొదలయ్యే నాటికి పూర్తిచేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం సాగునీటి ప్రాజెక్టులపై ఆ శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తిలతో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించి రూ.456 కోట్లతో చేపట్టనున్న ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులను ప్రారంభిస్తారన్నారు.
2027 గోదావరి పుష్కరాలు నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే దిశగా పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ ప్రాజెక్టును 2027లో జాతికి అంకితం చేస్తామన్నారు. అలాగే, పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తిచేసి 2026లో అనకాపల్లి వరకు గోదావరి జలాలు తరలిస్తామన్నారు. 2019–24 మధ్య పోలవరానికి కేంద్రం రీయింబర్స్ చేసిన రూ.3,000 కోట్లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మళ్లించిందని మంత్రి నిమ్మల ఆరోపించారు.
నిధుల మళ్లింపు అంటే అడ్వాన్సును మళ్లించడం నిమ్మలా!?
విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని వంద శాతం వ్యయంతో నిర్మించి, ఏపీకి అప్పగించాల్సిన బాధ్యత కేంద్రానిదే. కానీ, కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలంటూ 2014, జూన్ నుంచి 2016 సెప్టెంబరు వరకూ కేంద్రాన్ని నాటి సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధమవడంతో 2016, సెప్టెంబరు 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి కేంద్రం అప్పగించింది.
2010–11 నాటి పరిమాణాల ప్రకారం 2013–14 ధరలతో నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని కేంద్రం పెట్టిన షరతుకు కూడా చంద్రబాబు అంగీకరించారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి తొలుత ఖర్చుచేస్తే.. ఆ తర్వాత రీయింబర్స్ చేస్తామని కేంద్రం విధించిన షరతుకు సైతం చంద్రబాబు తలొగ్గారు. అంటే.. కేంద్రం రీయింబర్స్ చేసే నిధులు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేసినవే. రాష్ట్ర ఖజానాలోని నిధులను ప్రభుత్వం ప్రాధాన్యత పనులకు ఖర్చుచేస్తుంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అదే చేసింది. నిధులను మళ్లించలేదు. రాష్ట్రం ఖర్చు చేసిన నిధులనే కేంద్రం తిరిగి ఇచ్చింది. కానీ, మంత్రి నిమ్మల మాత్రం తనకు అలవాటైన రీతిలో అలవోకగా అబద్ధాలు వల్లె వేశారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేయడానికి అడ్వాన్సుగా నిధులిచ్చి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని 2019 నుంచి నాటి సీఎం వైఎస్ జగన్ కోరుతూ వచ్చారు. 2023, జూన్ 5న ఆ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించింది.
ఆ ప్రకారమే 2024–25లో రెండు విడతలుగా రాష్ట్రానికి రూ.5,052.71 కోట్లు విడుదల చేసింది. వాటిని ఎస్‌ఎన్‌ఏ (సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో జమచేసి.. పోలవరం ప్రాజెక్టు పనులకే వ్యయంచేయాలని కేంద్రం షరతు పెట్టింది. కానీ, ఆ నిధులను చంద్రబాబు సర్కారు ఇతర అవసరాలకు మళ్లించింది. అడ్వాన్సుగా ఇచ్చిన నిధులను ఎలా మళ్లిస్తారంటూ పీపీఏ అధికారులు, కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి, సాక్షాత్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ పదేపదే ఆగ్రహం వ్యక్తంచేయడంతో పలు విడతలుగా ఇప్పటివరకూ రూ.4,352.71 కోట్లను ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో ప్రభుత్వం జమచేసి ఖర్చుపెట్టింది.
ఇప్పటికీ అడ్వాన్సుగా ఇచ్చిన నిధుల్లో రూ.700 కోట్లను ఇతర అవసరాలకు మళ్లించేసింది. నిధులను సద్వినియోగం చేసుకోకుండా ఇతర అవసరాలకు మళ్లించడంవల్లే 2025–26 బడ్జెట్‌లో పోలవరానికి రూ.5,936 కోట్లను కేంద్రం కేటాయించినా.. ఇప్పటికీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదన్నది వాస్తవం కాదా మంత్రివర్యా!?


