ఆ మాటలు దారుణం.. దుర్మార్గం | Steel Plant Workers Fires On Chandrababu: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆ మాటలు దారుణం.. దుర్మార్గం

Nov 17 2025 4:34 AM | Updated on Nov 17 2025 4:34 AM

Steel Plant Workers Fires On Chandrababu: Andhra Pradesh

స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు పని చేయక పోవడం మీరు చూశారా?

చంద్రబాబు వ్యాఖ్యలపై ఉద్యోగ, కార్మిక, వామపక్ష నేతల మండిపాటు

విశాఖ ఉక్కుపై ఎన్నికలకు ముందు ఏం చెప్పారు.. ఏం చేశారు?

విశాఖ ఉక్కు ఉద్యోగి సగటు ప్రొడక్టివిటీ 785 టన్నులు.. సెయిల్‌లో అది 625 టన్నులే

మేం పని చేస్తున్నామనడానికి ఈ గణాంకాలే నిదర్శనం

3.4 నుంచి 7.3 మిలియన్‌ టన్నులకు మేం పని చేయకుండానే ఉత్పత్తి పెరిగిందా?

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కాపాడే బాధ్యతను భుజస్కందాలపైకి ఎత్తుకొని.. కేంద్రంతో పోరాడాల్సిన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి.. ఉద్యోగులు పని చేయడం లేదనడం దారుణం, దుర్మార్గం అని ఉద్యోగ, కార్మిక, వామపక్ష నేతలు మండిపడుతు­న్నారు. పని చేయకుండా ఎలా జీతాలివ్వాలని, తెల్ల ఏనుగులా మారారని విశాఖ ఉక్కు కార్మికులపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎం బాధ్యత లేకుండా అలా ఎలా మాట్లాడారని... ఇది బాబు నిర్వాకమే అ­ని ఆదివారం కార్మిక వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.

సీఎం చేసిన వ్యాఖ్యలను స్టీల్‌ ప్లాంట్‌ జేఏసీ, వామపక్షాల నేతలు తిప్పి కొడుతూ వాస్తవా­లు వివరించారు. ‘చంద్రబాబు ప్రభుత్వం అధికా­రంలోకి వచ్చిన సమయంలో గంగవరం పోర్టులో స్ట్రైక్‌ జరిగింది. ఆ సమయంలోనే ప్రోడక్టివిటీ 29 శాతానికి పడిపో­యింది. సమ్మె ముగిసిన తర్వాత.. మళ్లీ రా మెటీ­రియల్‌ రావడంతో ఉత్పత్తి పెరగడం మొదలైంది. ఇప్పుడు 70 శాతానికి చేరుకుంది. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చొరవ ఏదీ లేదు. స్టీల్‌ ప్లాంట్‌ ఈ దుస్థితిలో ఉండటానికి గల కారణాలను వారింకా ఇలా వివరించారు.

అన్‌సీజన్‌లో ఫర్నేస్‌లు ఎందుకు ప్రారంభించారు?
‘ఉత్పత్తి చెయ్యడంలో ఉద్యోగులు విఫలమయ్యా­ర­నడం సరికాదు. గతేడాది సింగిల్‌ ఫర్నేస్‌ మాత్రమే అందుబాటులో ఉంది. రెండు ఫర్నేస్‌లు షట్‌డౌన్‌ చేశారు. సింగిల్‌ ఫర్నేస్‌ లక్ష్యానికి అనుగుణంగా అప్పుడే 90 శాతం ఉత్పత్తి సాధించింది. సాధార­ణంగా వర్షాకాలం అన్‌ సీజన్‌ ఉంటుంది. ఇది ప్లాంట్‌ ప్రారంభించినప్పటి నుంచి జరిగింది. కానీ.. ఈ సారి విచిత్రంగా జూన్‌ నెలలోనే షట్‌డౌన్‌లో ఉన్న రెండో ఫర్నేస్‌ని ప్రారంభించారు. రా మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ పాయింట్‌లో వర్షాకాలంలో ఇబ్బందు­లు వస్తాయి. ఎక్విప్‌మెంట్‌ ఆపరేటింగ్‌కు ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పట్లో 4 వేల మంది కార్మికుల్ని తొలగించారు. వర్షాకా­లంలో మార్కెట్‌ లేదు. ఈ కారణంగా ఉత్పత్తి తగ్గు­ముఖం పట్టిందే తప్ప.. ఉద్యోగులు పని చేయక పోవడం వల్ల కాద­న్న విషయం బాబు తెలుసుకో­వాలి. 

ఉద్యోగి ప్రొడక్టివిటీ ఎంతో తెలుసా?
ప్రతి స్టీల్‌ ప్లాంట్‌లోనూ ప్రొడక్టివిటీకి ఒక కొలబద్ద ఉంటుందన్న విషయం సీఎంగా చంద్రబాబు తెలుసు­కోవాలి. ఒక ఉద్యోగి సంవత్సరానికి సగటు­న ఎన్ని టన్నులు ప్రొడ్యూస్‌ చేశారన్నదానితో ప్రొడక్టివిటీని అంచనా వేస్తుంటారు. 2024 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి వరకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగి సగటు ప్రొడక్టివిటీ 785 టన్నులుగా ఉంది. సెయిల్‌లో 625 టన్నులు మాత్రమే. ఈ లెక్కన ఎవరు పని చేస్తు­న్నారు.. ఎవరు పని చెయ్యడం లేదో ఇప్పుడు చెప్పండి చంద్రబాబూ. ప్రతిసారీ జీతాలివ్వాలంటే ఎలా.. అని చంద్రబాబు మాట్లాడ­టం సరికాదు. ఇప్పటికీ.. ప్లాంట్‌లో పని చేసిన వా­రి­కి జీతాలు, పెన్షన్లు మూడున్నర నెలలు పెండింగ్‌లో పెట్టారు. 800 మంది వితంతువుల పెన్షన్లు కూడా పెండింగ్‌లో ఉన్నా­యి.

వీరి నుంచి రూ.200 కోట్లు డిపాజిట్లు తీసు­కున్నా.. పెన్షన్లు మాత్రం ఇవ్వలేకపోతున్నారెందుకు? ఎంతసే­పూ రూ.12 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చామని చెబుతున్నారే.. అసలీ ప్యాకేజీ డబ్బులు ఎక్కడికి వెళ్లాయో తెలుసా? ఇచ్చిన ప్యాకేజీ మొత్తం బ్యాంకుల రుణాల చెల్లింపు­లకే సరిపోయాయి. ఐదేళ్ల నుంచి ప్రమోషన్లు లేవు. ఈడీలు 15 మంది ఉండాల్సి ఉండగా.. ఒక్కరూ లే­రు. ఇన్ని లోపాలు పెట్టుకొని.. ఈ లోపాలన్నీ ఉ­ద్యో­గు­లవే అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడటం టాపిక్‌ను డైవర్షన్‌ కోసమే’ అని మండిపడ్డారు.

మీ ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకే.. 
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం కూడబలుక్కొని నష్టాల్లోకి నెడుతున్నాయి. ఈ ద్రోహాన్ని కప్పి పుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులపై అభాండాలు వేశారు. కార్మికులు పని చేయకపోతే గవర్నమెంట్‌ ఎక్కడ నుండి డబ్బులు తెస్తుందని సీఎం మాట్లడటం సరికాదు. స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు, ఉద్యోగులు పని చేయకపోతే ప్లాంట్‌ 3.4 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం నుంచి 7.3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి ఎలా పెరిగింది? – సీహెచ్‌ నర్సింగరావు, స్టీల్‌ ప్లాంట్‌ జేఏసీ చైర్మన్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ప్యాకేజీలో పెట్టిన ఆంక్షలు తెలీదా?
విశాఖ ఉక్కు కోసం రూ.12 వేల కోట్ల నిధులు సమకూర్చారని చంద్రబాబు మాట్లా­డా­రు. ఈ నిధులు జీఎస్టీకి, బ్యాంకు అప్పులు, ఇతర అప్పులు తీర్చ­డానికి మాత్రమే. ఉద్యోగులు, కార్మికులు తొలగింపునకు, సంస్థ ఉత్పత్తికి, ముడి సరకుకు, యంత్రాల మరమ్మతులకు, కొత్త యంత్రాలు, స్పేర్‌ పార్ట్స్‌ కొనుగోలుకు, ఉద్యోగుల జీత భత్యాలకు చెల్లించరాదని ఆంక్షలు పెట్టిన సంగతి సీఎంకి తెలియదా? – జగ్గునాయుడు, స్టీల్‌ ప్లాంట్‌ అఖిల పక్ష కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement