వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ధ్వజం
స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా పార్టీ ఉంటుందని స్పష్టికరణ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పెట్టుబడుల సదస్సు అట్టర్ ఫ్లాప్ కావడంతో సీఎం చంద్రబాబు ఆ కోపాన్ని, అసహనాన్ని స్టీల్ ప్లాంట్ కార్మికులపై ప్రదర్శిçÜ్తున్నారని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఖరీదైన భూములను ఇప్పటికే తమ వారికి పప్పుబెల్లాల్లా కట్టబెట్టిన చంద్రబాబు కన్ను ఇప్పుడు రూ.లక్షల కోట్ల ఖరీదైన స్టీల్ ప్లాంట్ భూములపై పడిందన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా వైఎస్సార్ సీపీ పోరాడుతుందని, కార్మికులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే, ‘కుమారుడు లోకేశ్ రాజకీయ భవిష్యత్ కోసం ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్రబాబు కేంద్రానికి సహకరిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వనని గతంలో హామీ ఇచి్చన చంద్రబాబు ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలకు, ప్లాంట్ ఉద్యోగులకు వెన్నుపోటు పొడుస్తున్నారు. మూడు నెలలుగా సీఐఐ సమ్మిట్ పేరిట దేశ, విదేశాల్లో సైతం పర్యటించినా సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రభుత్వ హడావుడి తప్ప నిర్దేశించుకున్న లక్ష్యంలో కనీసం 50 శాతం పెట్టుబడులు కూడా రాలేదనే విమర్శలున్నాయి. దానికి నిన్న చంద్రబాబు సమ్మిట్‌లో విశాఖ ఉక్కు గురించి అసహనంతో మాట్లాడిన మాటలే నిదర్శనం.
స్టీల్ ప్లాంట్‌ను తెల్ల ఏనుగుతో పోల్చుతూ... ప్లాంట్ కార్మికులే నష్టాలకు కారణమనడం దారుణం. ఆయన మాటలు వింటుంటే అసలు స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడమే కాకుండా, విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉంచుతారా? లేదా? అన్న అంశంపైసైతం సందేహం కలుగుతోంది. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని కార్మికులకు క్షమాపణ చెప్పాలి’ అని పేర్కొన్నారు. సమావేశంలో సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల శ్రీనివాస్ దేవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


