కష్టపడకుండా తెల్ల ఏనుగులా మారితే ఎలా?
విశాఖ ఉక్కు కార్మికులపై రెచ్చిపోయిన సీఎం చంద్రబాబు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎన్నిసార్లు డబ్బులివ్వాలి?
పబ్లిక్ సెక్టార్‌లో ఉంటూ బెదిరిస్తారా?
ఒక కెమికల్ కంపెనీలో ఇలానే చేస్తే పీడీ యాక్ట్ పెట్టి దారిలోకి తీసుకొచ్చా.. అన్ని కంపెనీలు లాభాల్లో ఉంటే విశాఖ స్టీల్ ఒక్కటే ఎందుకు నష్టాల్లో ఉంది?
గోల్డ్ మైన్ లాంటి కంపెనీని మీరంతా కలిసి నష్టాల్లోకి నెట్టేశారు.. పక్కనే కొత్త స్టీల్ ప్లాంట్ వస్తోంది.. అది లాభాల్లో నడుస్తుంది చూడండి
మిట్టల్ స్టీల్ కోసం ప్రధానిపై ఒత్తిడి చేసి ముడి ఇనుము సరఫరా చేయిస్తున్నా.. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎన్నో చూశానని మండిపాటు
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దుర్మార్గం, కుట్రపూరితమంటూ కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం
సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు కార్మికులపై సీఎం చంద్రబాబు నోరు పారేసుకున్నారు. ఏ పనీ చేయకుండా పడుకొని జీతాలు ఇవ్వమంటే ఎలా సాధ్యమవుతుందని మండిపడ్డారు. ‘మేం పని చేయం.. అయినా కేంద్రం, రాష్ట్రం డబ్బులు ఇవ్వాలంటే కుదరదు’ అంటూ రెచ్చిపోయారు. శనివారం సీఐఐ పెట్టుబడుల సమావేశ వివరాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓ విలేకరి విశాఖ స్టీల్ పరిశ్రమ పరిస్థితిపై ప్రశ్న అడగ్గానే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్తగా వస్తున్న ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను మెచ్చుకుంటూ కార్మికుల వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నష్టాలు వస్తున్నాయంటూ శివాలెత్తారు. దేశ వ్యాప్తంగా అన్ని స్టీల్ ప్లాంటులు లాభాల్లో నడుస్తుంటే ఒక్క వైజాగ్ స్టీల్ మాత్రమే ఎందుకు నష్టాల్లో నడుస్తోంది.. ఇందుకు మీరు బాధ్యులు కారా అంటూ నిలదీశారు. ‘ఇప్పటికే రూ.12,000 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించాం.. ప్రాపర్టీ ట్యాక్స్ వదులుకున్నాం.. సెక్యురిటీలిచ్చాం.. ఇలా ప్రతిసారి పని చేయం.. అయినా డబ్బులు ఇవ్వాలంటే ఎలా? ఎన్నిసార్లు డబ్బులివ్వాలి మీకు? ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ.. మనం కష్టపడి పని చేయాలి.. పని చేయకుండా తెల్ల ఏనుగులా మారితే ఎలా?’ అని అన్నారు.
పక్కనే కొత్తగా మరో స్టీల్ ప్లాంట్ వస్తోందని, అది లాభాల్లో నడుస్తుంది చూడండని చెప్పారు. ‘ పబ్లిక్ సెక్టార్ కంపెనీలో ఉండి బెదిరిస్తే ఎలా? ఇలాగే ఈ మధ్య ఒక కెమికల్ కంపెనీలో చేస్తే వెంటనే పీడీ యాక్ట్ తీసుకొచ్చి వారిని దారిలోకి తెచ్చా’ అని విశాఖ కార్మికులను హెచ్చరించారు. ఇక నుంచి ప్రతి 3 నెలలకోసారి విశాఖ స్టీల్‌పై సమీక్షిస్తానని, 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వాటిని ఎన్నో చూశానన్నారు. విశాఖ స్టీల్ కార్మికులు పద్ధ్దతి మార్చుకోకపోతే కంపెనీ వేరే రాష్ట్రాలకు పోతుందన్నారు.
మిట్టల్ స్టీల్‌పై ప్రేమ
ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ప్రశ్న అడిగిన విలేకరిపై నువ్వు చదువుకున్నవాడివేనా అంటూ ఎగతాళి చేస్తూ విశాఖ స్టీల్ కార్మికులపై ఒంటికాలిపై లేచిన చంద్రబాబు ఆర్సెలర్ మిట్టల్ స్టీల్‌పై తనకున్న ఆవ్యాజ ప్రేమను పలుమార్లు వ్యక్తం చేశారు. లోకేశ్ మాట్లాడి ఈ కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చాడన్నారు. ఈ కంపెనీకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ ముడి ఇనుమును లారీల ద్వారా సరఫరా చేస్తానంటే మిట్టల్ స్టీల్ గొట్టాలు (స్లరీ) ద్వారా సరఫరా చేయాలని కోరిందని చెప్పారు.
అయితే దీనిపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో తాను స్వయంగా మాట్లాడినా పనికాకపోతే.. ప్రధాని మోదీని కలిసి ఒకటికి రెండుసార్లు గట్టిగా చెప్పి పనిచేయించానని తెలిపారు. చరిత్రలో ఎక్కడా జరగనంత వేగంగా అన్ని అనుమతులు మంజూరు చేయించామన్నారు. ఈ కంపెనీ త్వరలోనే లాభాల్లోకి వస్తుందంటూ కితాబు ఇచ్చారు.
చంద్రబాబు బుకాయిస్తున్నారు
స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం చంద్రబాబు బుకాయిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం, కుట్రపూరితం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.12,500 కోట్లలో కార్మికుల సంక్షేమానికి 10 రూపాయలు కూడా ఉపయోగించలేదు. ఆ డబ్బులు మొత్తం బ్యాంకులకు కట్టడానికే సరిపోయాయి. పరిశ్రమ నడుస్తున్నప్పుడు ఎవరూ ప్రశ్నించరు. ప్రభుత్వం చేయకపోతేనే అడుగుతారు. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కార్మికులకు జీతాలు ఆగలేదు. ఇప్పుడు నడవడం లేదు కాబట్టి అడుగుతున్నాం.
స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని ఒక పక్క కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. చంద్రబాబు బుకాయిస్తే ఎలా? ఎంపీలు అడిగితే ప్రైవేటీకరణ చేస్తామని రాత పూర్వకంగా చెబుతోంది. తాము అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ నుంచి తప్పిస్తామని మీరు మా నిరసన టెంట్‌వ ద్దకు వచ్చి చెప్పలేదా? ఇప్పుడు ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోవడం లేదు? ముడిసరుకు పూర్తి స్థాయిలో ఇస్తే ప్రభుత్వాలను డబ్బులు అడగాల్సిన అవసరం లేదు. గనులు లేవు కాబట్టి ఉత్పత్తి తగ్గుతోంది. – డి.వి.రమణారెడ్డి, వైఎస్సార్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి
కార్మికులపై నెపం నెట్టడం తగదు
స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి రాకపోవడానికి కార్మికులు కారణం కాదు. ప్రభుత్వ, యాజమాన్య విధానాల వల్ల మాత్రమే ఈ పరిస్థితి తలెత్తింది. పరిశ్రమలో 45 రోజులకు సరిపడా ముడి సరుకు నిల్వ ఉండాలి. ఈరోజు లైమ్ లేకపోవడం వల్ల ఉత్పత్తి ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఎవరన్నది చంద్రబాబే చెప్పాలి. దీనికి నూరు శాతం యాజమాన్యానిదే బాధ్యత. ప్లాంట్‌లో మెషినరీ పాతదైపోయింది. మరమ్మతులకు సంబంధించి స్పేర్ పార్ట్స్ కూడా ఇవ్వడం లేదు. ఉత్పత్తి కోసం యాజమాన్యం, ప్రభుత్వం ప్లానింగ్ చేయాలి. అది మానేసి కార్మికులపై తోసేయడం సరికాదు. – జె.అయోధ్యరామ్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి
వైట్ ఎలిఫెంట్‌తో పోల్చడం తగదు
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను చంద్రబాబు వైట్ ఎలిఫెంట్ (తెల్ల ఏనుగు)తో పోల్చడం ఆయన స్థాయికి తగదు. ఈ పరిశ్రమ లక్ష కోట్ల రూపాయలు ఈ దేశానికి చెల్లించి ఉపయోగపడింది. సొంత గనులు లేకపోయినా లాభాలు సాధించింది. పథకం ప్రకారం ఈ కంపెనీని నీరుగార్చుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబు ఈ ప్రకటన చేయడం కార్మికులను కించపరచడమే.
దేశంలో నష్టాలు వచ్చిన అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలకు రూ.వేల కోట్ల సహాయం చేశారు. భద్రావతి, సేలం, బిలాయ్ స్టీల్ ప్లాంట్‌లకు రూ.65 వేల కోట్లు ప్యాకేజీ ఇచ్చారు. సొంత మైన్స్ ఉన్నప్పటికీ అవి 30 ఏళ్ల నుంచి నష్టాల్లోనే ఉన్నాయి. మైన్స్ లేకుండా లాభాల్లో ఉన్న కంపెనీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్కటే. వరుసగా అందరినీ ఇళ్లకు పంపిస్తూ ఇలా మాట్లాడటం భావ్యం కాదు. – డి.ఆదినారాయణ, ఉక్కు గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి
ప్లాంట్‌ను చంపేయాలని చూస్తున్నారు
విశాఖ స్టీల్ ప్లాంట్ 3 మిలియన్ టన్నుల స్థాయి ఉన్నప్పుడు బ్రహ్మాండమైన ఉత్పత్తిని సాధించి రూ.12 వేల కోట్ల రిజర్వు ఫండ్ ఉండేది. ఆ తర్వాత విస్తరణకు తీసుకెళ్లాం. కేంద్రానికి రూ.50 వేల కోట్ల పన్నులు చెల్లించాం. ఇంత మొత్తంలో ఏ ప్రైవేట్ సంస్థ కట్టింది? రాష్ట్రానికి, కేంద్రానికి పన్నులు, జీఎస్‌టీలు నిరంతరం వెళ్లాయి. ఈ కంపెనీ ప్రగతిపై, ఉత్పత్తిపై కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళికంటూ లేదు.
ఉన్న ప్రణాళికల్లా ఈ కంపెనీని ఎలా చంపేయాలని చూడటమే. కార్మికుల సంఖ్య 20 వేల నుంచి 10 వేలకు తగ్గించారు. కార్మికులు అహరి్నశలు కష్టపడి పని చేస్తున్నారు. ఈ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చిన వారెవరో చంద్రబాబు బయట పెట్టాలి. అసలు విశాఖ ప్లాంట్‌కు ఎందుకు మైన్స్ అడగడం లేదు? – మంత్రి రాజశేఖర్, ఐఎన్‌టీయూసీ చీఫ్ ప్యాట్రన్
చంద్రబాబు గాలి కబుర్లు మానుకోవాలి
స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు తప్పుడు మాటలు మానుకోవాలి. కేంద్రం నుంచి రూ.12 వేల కోట్లు తీసుకొచ్చాననడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. రూ.12 వేల కోట్లు ఎవరికిచ్చారు? అలాగైతే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేదు? స్టీల్ ప్లాంటుపై చంద్రబాబు ఇలాంటి గాలి కబుర్లు మానుకోవాలి. చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. – జేవీ సత్యనారాయణమూర్తి, సీపీఐ జాతీయ నేత


