విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం వింత షరతు
గతంలో ఎన్నడూ సాధించని లక్ష్యాలను ముందుంచి.. వాటికి అనుగుణంగా జీతాలిస్తామంటున్నారని ఉద్యోగుల ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: ఉద్యోగులు కార్మికుల మెడపై ఎప్పటికప్పుడు కత్తి పెట్టి ప్రైవేటీకరణ దిశగా ప్లాంట్ నడుపుతున్న విశాఖ ఉక్కు యాజమాన్యం మరో వింత షరతు విధించింది. ఇప్పటికే పూర్తిస్థాయి జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్న యాజమాన్యం తాజాగా మరో సర్క్యులర్ విడుదల చేసి వారి జీవితాలతో ఆటలాడుకుంటోంది. ఉత్పత్తి లక్ష్యాల శాతాలకు అనుగుణంగా ఇకపై జీతాల పంపిణీ ఉంటుందని, విభాగాల వారీగా ఇచ్చిన టార్గెట్లకి అనుగుణంగా ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
రోజు వారీ లక్ష్యాలు ఎంతమేర అందుకోనున్నారనేదానిపై గణించిన అనంతరం జీతం ఎంత ఇవ్వాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్‌లో ఉత్పత్తి లక్ష్యాల్ని చేరుకోకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉక్కు యాజమాన్యం స్పష్టం చేసింది. దీనిపై ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఎన్నడూ సాధించలేని లక్ష్యాలను ముందుంచి.. దానికనుగుణంగా జీతాలిస్తామని చెప్పడం గర్హనీయమంటూ ఉద్యోగ సంఘాల నాయకుడు అయోధ్యరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.


