
శాసన మండలి సాక్షిగా బయటపడిన చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ వైఖరి
విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ తీర్మానం
ప్రవేశపెట్టిన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ
మద్దతు తెలపకుండా కూటమి ప్రభుత్వం దాటవేత
కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ వేరుగా తీర్మానం
మూజువాణి ఓటుతో వైఎస్సార్‌సీపీ తీర్మానం ఆమోదం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన విశాఖ ఉక్కు కర్మాగారంపై చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ వైఖరి మరోసారి చట్టసభ సాక్షిగా బయటపడింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పట్ల బాబు ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఇంకోసారి తేటతెల్లమైంది. విశాఖ స్టీల్ పరిరక్షణ డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ శాసన మండలిలో మంగళవారం తీర్మానం ప్రవేశపెట్టగా ప్రభుత్వం మద్దతు ప్రకటించకుండా దాటవేత ధోరణి ప్రదర్శించింది. పరిశ్రమలు, పెట్టుబడులు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై మండలిలో స్వల్పకాలిక చర్చ నిర్వహించారు.
ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణే వైఎస్సార్‌సీపీ ధ్యేయమని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ డిమాండ్‌తో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘‘విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారత ప్రభుత్వ వాటాను 100 శాతం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు, ప్రైవేటీకరణ ద్వారా నిర్వహణ నియంత్రణ బదిలీకి జరుగుతున్న యత్నాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనను వెంటనే పునఃపరిశీలించి, ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఉక్కు మంత్రిత్వ శాఖను కోరుతున్నాం.
ప్లాంట్ లాభాల్లోకి తెచ్చేలా సొంత గనుల కేటాయింపు, ఆర్థిక పునర్నిర్మాణం వంటి ఇతర కార్యకలాపాలు వెంటనే చేపట్టాలి. ఈ మేరకు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలి.’ అని తీర్మానం ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం, అన్ని రాజకీయ పక్షాలు తీర్మానానికి మద్దతు తెలపాలని బీజేపీ, టీడీపీ, జనసేన ఎమ్మెల్సీలను కోరారు. అంతకు ముందు స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి తాము మద్దతు తెలుపుతున్నట్టు బొత్స ప్రకటించారు.
కేంద్రం ప్యాకేజీ కేటాయించినా స్టీల్ ప్లాంట్ అంశంలో ప్రస్తుతం సంభవిస్తున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో వంద శాతం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తాము ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలపాలని లోకేశ్‌ను కోరారు. అయితే వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టిన తీర్మానం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేదని లోకేశ్ పేర్కొన్నారు. తీర్మానాన్ని మార్చి పెట్టాలని డిమాండ్ చేశారు.
తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతిపాదించారు. దీంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకూడదనేది సర్కారు ఉద్దేశమైతే, ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తమ తీర్మానం ఆమోదానికి మద్దతు ఇవ్వాలని బొత్స కోరారు. ప్రైవేటీకరణను వ్యతిరేకించడమే కూటమి పార్టీల అజెండా అయినప్పుడు వైఎస్సార్‌సీపీ తీర్మానానికి ఆమోదం తెలపడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు.
ఓటింగ్ చేపట్టాలన్న బొత్స.. ఆమోదం
వైఎస్సార్‌సీపీ తీర్మానానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం, కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు ఒప్పుకోకపోవడంతో వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టిన తీర్మానంపై బొత్స డివిజన్(ఓటింగ్) చేపట్టాలని కోరారు. అనంతరం మండలి చైర్మన్ మోషేన్‌రాజు మూజువాణి ఓటుతో తీర్మానాన్ని సభ ఆమోదించినట్టు ప్రకటించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం కూడా ఆమోదం పొందింది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం:బొత్స సత్యనారాయణ
మండలిలో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద, పరిశ్రమల మీద ప్రశ్నలు అడిగేతే ఎగతాళి చేస్తూ కూటమి సభ్యులు మాట్లాడారని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల మీద ప్రశ్న వేస్తే వ్యక్తిగతంగా, ఇష్టానుసారం, నాయకుల మీద సందర్భం లేకుండా కూటమి నేతలు మాటా్లడారని విమర్శించారు. దానికి నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేసి వచ్చేశామని పేర్కొన్నారు. ‘‘ప్రజలు చూస్తున్నారు. హుందాగా ఉండాలి.
2014–19 వరకూ, 2019–2024 వరకూ 2024 నుంచి గడిచిన 16 నెలల కాలంలో ఏం జరిగిందనే చర్చను సభలో పెట్టారు. గత ప్రభుత్వంపై నమ్మకం ఉండబట్టే రిలయన్స్ అంబానీ, అదానీ వంటి వారు వచ్చారని మేం చెప్పాం. లులు గ్రూపునకు విశాఖ, విజయవాడలో స్థలాలను అప్పనంగా కట్టబెడుతున్నారు. కేంద్రంతో చర్చల తర్వాతే సింగపూర్ ఒప్పందం రద్దు చేశాం. ఆ ఒప్పందంలో చంద్రబాబుతో లాలూచీపడి ఏపీకి వచ్చిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌పై అక్కడి ప్రభుత్వమే చర్యలు తీసుకుంది. అదే చెప్పాం.
టాటా చైర్మన్ వైఎస్ జగన్ హయాంలోనూ వచ్చారు. ఒప్పందం చేసుకున్నాం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు ప్రారంబోత్సవం చేస్తున్న పరిశ్రమలన్నీ వైఎస్సార్‌సీపీ హయాంలో శంకుస్థాపనలు చేసినవే. స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్లు ఇన్సెంటివ్ ఇవ్వడం ముదావహం. మేం స్వాగతిస్తున్నాం. కానీ దానిపై మాకు, ప్రజలకు అనుమానాలు ఉన్నాయి.
ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి. ఇదే విషయంపై తీర్మానం పెట్టాం. దీనికి మద్దతు తెలపడానికి కూటమి సర్కారుకు మనసు రాలేదు. ఇది చంద్రబాబు సరర్కారు ద్వంద్వ నీతికి నిదర్శనం. విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడతాం.’ అని బొత్స స్పష్టం చేశారు.