ఆన్‌లైన్ నమోదు ప్రక్రియలో అడ్డంకులు
పొరుగు రాష్ట్ర సహాయ నిరాకరణ కూడా ఇబ్బందిగా మారిన పరిస్థితి
ఇప్పటికీ రికార్డులు తెలంగాణలోనే
20 రోజుల్లో ముగియనున్న నమోదు గడువు
రాష్ట్రంలో మొత్తం 4,748 వక్ఫ్ ఆస్తులు
ఐదు నెలల్లో ఆన్‌లైన్ అయినవి 1,809 మాత్రమే
గడువులోపు మిగిలిన 2,939 ఆస్తుల ఆన్‌లైన్ కష్టమని అంచనా
దీంతో వక్ఫ్ ఆస్తులు కోల్పోతామని ముస్లిం సమాజంలో ఆందోళన
గడువు పొడిగింపునకు కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయాలని డిమాండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వేల వక్ఫ్ ఆస్తుల భవిష్యత్తుపై ముస్లిం సమాజంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఒకపక్క ఆన్‌లైన్ నమోదు ప్రక్రియలో అడ్డంకులు, మరోపక్క నమోదుకు గడువు కేవలం 20 రోజులు మాత్రమే ఉండడం దీనికి కారణం. ఈ ప్రక్రియ పూర్తికాకుంటే, వక్ఫ్ ఆస్తులు వివాదాస్పదమయ్యే ప్రమాదం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సమాజం నమోదు గడువు పెంపు కోసం ఎదురుచూస్తోంది.
గడువు పొడిగించాలని ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ నేతృత్వంలోని బృందం ఇప్పటికే వక్ఫ్‌బోర్డు అధికారులను కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయాలని ముస్లిం సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 4,748 వక్ఫ్ ఆస్తులు ఉండగా, గడచిన ఐదు నెలల్లో ఆన్‌లైన్ అయినవి 1,809 మాత్రమే. డిసెంబర్ 5వ తేదీలోపు 2,939 ఆస్తుల ఆన్‌లైన్ కష్టమని అంచనా.
నమోదు అవసరం ఏమిటి?
కేంద్రం ఉమీద్–2025 (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్) తెచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తులను మరోసారి నమోదు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఉమీద్–2025 సెక్షన్ 3బి ప్రకారం వక్ఫ్ వివరాలను దాఖలు చేయడం, సెక్షన్ 5 ప్రకారం ఆ జాబితాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం, సెక్షన్ 36 కింద కొత్తగా వక్ఫ్ నమోదు చేయటం వంటి ప్రక్రియకు ఆరు నెలల గడువును వి«ధించారు. నమోదు ప్రక్రియలో ‘మేకర్–చెకర్–అప్రూవర్‘ విధానాన్ని అనుసరిస్తున్నారు.
సంబంధిత వక్ఫ్ ఆస్తులను ఆన్‌లైన్ చేయడంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు ద్వారా నియమితులైన ముతవల్లి, ఏదైనా అధికారి మేకర్‌గా వ్యవహరిస్తారు. ఆ ఆస్తులను కరెక్ట్‌గా అప్‌లోడ్ చేశారా? లేదా? తదితర అంశాలను జిల్లా స్థాయి అధికారి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ద్వారా అధికారం పొందిన అధికారి తనిఖీ(చెకర్) చేస్తారు. ఆన్‌లైన్ చేసిన ఆస్తులను తుది పరిశీలన చేసి తర్వాతే రాష్ట్ర వక్ఫ్ బోర్డు ద్వారా అధికారం పొందిన ఏదైనా అధికారి ఆమోదముద్ర (అప్రూవర్) వేస్తారు.
నమోదుకు అడ్డంకులు ఇవీ..
» ఉమీద్ వెబ్‌సైట్‌లో వక్ఫ్ ఆస్తుల ఆన్‌లైన్ నమోదుకు సర్వర్ డౌన్ సమస్యతోపాటు పలు సాంకేతిక ఇబ్బందులు పెను సవాలు విసురుతున్నాయి.
» సైట్ నిరంతరం ‘నిర్వహణలో ఉంది‘ అనే సమాచారం చూపిస్తోంది.
» తరచూ ఓటీపీ, లాగిన్ విఫలమవుతున్నాయి.
» వెబ్‌సైట్‌లో ఒక్కో ఆస్తి నమోదుకు 13 కాలమ్స్‌లో 56 పేజీలను అప్‌లోడ్ చేయడం ఆలస్యం అవుతోంది.
» పలు సందర్భాల్లో డాక్యుమెంట్ అప్‌లోడ్ తిరస్కరణకు గురవుతోంది.
» జీఐఎస్ మ్యాపింగ్ టూల్‌పనిచేయడంలేదు.
» పరిశీలించి ఆమోదించాల్సిన కలెక్టర్ లాగిన్ యాక్టివ్‌గా ఉండటంలేదు.
» దీనికి సంబంధించిన ప్రక్రియ వేగవంతం అయ్యేలా చూడాల్సిన హెల్ప్‌డెస్క్ అసలు రెస్పాండ్ కావడంలేదు.
ప్రతి రోజు రాష్ట్ర వక్ఫ్‌బోర్డుతోపాటు కేంద్ర పోర్టల్‌కు సంబంధించిన వాట్సాప్ గ్రూప్‌లో సైతం ఆన్‌లైన్ సమస్యలు
ప్రస్తావిస్తున్నా పరిష్కారానికి నోచుకోవడంలేదు.
» రాష్ట్ర విభజన జరిగి పన్నేండేళ్లు కావస్తున్నా తెలంగాణాలోనే ఏపీ వక్ఫ్ రికార్డులు ఉండిపోవడంతో ఆ రాష్ట్ర సహాయ నిరాకరణ కూడా అవరోధం కలిగిస్తోంది.
» పలు అంశాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అవగాహన లోపం కూడా శాపంగా మారింది.


