breaking news
Online registration process
-
వేల వక్ఫ్ ఆస్తుల భవిష్యత్తు ప్రశ్నార్థకం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వేల వక్ఫ్ ఆస్తుల భవిష్యత్తుపై ముస్లిం సమాజంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఒకపక్క ఆన్లైన్ నమోదు ప్రక్రియలో అడ్డంకులు, మరోపక్క నమోదుకు గడువు కేవలం 20 రోజులు మాత్రమే ఉండడం దీనికి కారణం. ఈ ప్రక్రియ పూర్తికాకుంటే, వక్ఫ్ ఆస్తులు వివాదాస్పదమయ్యే ప్రమాదం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సమాజం నమోదు గడువు పెంపు కోసం ఎదురుచూస్తోంది. గడువు పొడిగించాలని ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ నేతృత్వంలోని బృందం ఇప్పటికే వక్ఫ్‌బోర్డు అధికారులను కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయాలని ముస్లిం సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 4,748 వక్ఫ్ ఆస్తులు ఉండగా, గడచిన ఐదు నెలల్లో ఆన్లైన్ అయినవి 1,809 మాత్రమే. డిసెంబర్ 5వ తేదీలోపు 2,939 ఆస్తుల ఆన్లైన్ కష్టమని అంచనా. నమోదు అవసరం ఏమిటి?కేంద్రం ఉమీద్–2025 (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్) తెచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తులను మరోసారి నమోదు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఉమీద్–2025 సెక్షన్ 3బి ప్రకారం వక్ఫ్ వివరాలను దాఖలు చేయడం, సెక్షన్ 5 ప్రకారం ఆ జాబితాను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, సెక్షన్ 36 కింద కొత్తగా వక్ఫ్ నమోదు చేయటం వంటి ప్రక్రియకు ఆరు నెలల గడువును వి«ధించారు. నమోదు ప్రక్రియలో ‘మేకర్–చెకర్–అప్రూవర్‘ విధానాన్ని అనుసరిస్తున్నారు. సంబంధిత వక్ఫ్ ఆస్తులను ఆన్లైన్ చేయడంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు ద్వారా నియమితులైన ముతవల్లి, ఏదైనా అధికారి మేకర్‌గా వ్యవహరిస్తారు. ఆ ఆస్తులను కరెక్ట్‌గా అప్లోడ్ చేశారా? లేదా? తదితర అంశాలను జిల్లా స్థాయి అధికారి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ద్వారా అధికారం పొందిన అధికారి తనిఖీ(చెకర్) చేస్తారు. ఆన్లైన్ చేసిన ఆస్తులను తుది పరిశీలన చేసి తర్వాతే రాష్ట్ర వక్ఫ్ బోర్డు ద్వారా అధికారం పొందిన ఏదైనా అధికారి ఆమోదముద్ర (అప్రూవర్) వేస్తారు.నమోదుకు అడ్డంకులు ఇవీ..» ఉమీద్ వెబ్సైట్లో వక్ఫ్ ఆస్తుల ఆన్లైన్ నమోదుకు సర్వర్ డౌన్ సమస్యతోపాటు పలు సాంకేతిక ఇబ్బందులు పెను సవాలు విసురుతున్నాయి. » సైట్ నిరంతరం ‘నిర్వహణలో ఉంది‘ అనే సమాచారం చూపిస్తోంది. » తరచూ ఓటీపీ, లాగిన్ విఫలమవుతున్నాయి.» వెబ్సైట్లో ఒక్కో ఆస్తి నమోదుకు 13 కాలమ్స్‌లో 56 పేజీలను అప్లోడ్ చేయడం ఆలస్యం అవుతోంది.» పలు సందర్భాల్లో డాక్యుమెంట్ అప్లోడ్ తిరస్కరణకు గురవుతోంది. » జీఐఎస్ మ్యాపింగ్ టూల్పనిచేయడంలేదు. » పరిశీలించి ఆమోదించాల్సిన కలెక్టర్ లాగిన్ యాక్టివ్‌గా ఉండటంలేదు. » దీనికి సంబంధించిన ప్రక్రియ వేగవంతం అయ్యేలా చూడాల్సిన హెల్ప్‌డెస్క్ అసలు రెస్పాండ్ కావడంలేదు. ప్రతి రోజు రాష్ట్ర వక్ఫ్బోర్డుతోపాటు కేంద్ర పోర్టల్‌కు సంబంధించిన వాట్సాప్ గ్రూప్‌లో సైతం ఆన్లైన్ సమస్యలుప్రస్తావిస్తున్నా పరిష్కారానికి నోచుకోవడంలేదు.» రాష్ట్ర విభజన జరిగి పన్నేండేళ్లు కావస్తున్నా తెలంగాణాలోనే ఏపీ వక్ఫ్ రికార్డులు ఉండిపోవడంతో ఆ రాష్ట్ర సహాయ నిరాకరణ కూడా అవరోధం కలిగిస్తోంది.» పలు అంశాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అవగాహన లోపం కూడా శాపంగా మారింది. -
మీ దస్తావేజుకు..మీరే లేఖరి
సాక్షి, అమరావతి: మీరు స్థిరాస్తి కొన్నారా. ఆ వెంటనే దస్తావేజు లేఖరిని సంప్రదించక్కర్లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లక్కర్లేదు. ఇక నుంచిఆస్తి కొనుగోలు దస్తావేజులను మీరే తయారు చేసుకోవచ్చు. భూములు, స్థలాలు, భవనాల వంటి స్థిరాస్తుల కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ల కోసం, డాక్యుమెంట్ల తయారీ నిమిత్తం ఇక దస్తావేజు లేఖరులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. తెలుగులో అత్యంత సులభంగా మీ దస్తావేజులను మీరే తయారు చేసుకోవడానికి వీలుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో నమూనా దస్తావేజులను అప్లోడ్ చేసింది. న్యాయ, రెవెన్యూ రంగాల నిపుణులతో చర్చించి సులభ శైలిలో ప్రజాప్రయోజనాల కోసం వీటిని రూపొందించింది. ఈ నమూనా దస్తావేజుల్లో ఖాళీలు నింపుకుంటే న్యాయబద్ధంగా చెల్లుబాటయ్యేలా స్థిరాస్తి విక్రయ రిజిస్ట్రేషన్ దస్తావేజు తయారవుతుంది. అన్ని వివరాలు నింపిన తర్వాత తప్పులేమైనా ఉన్నాయేమో సరిచూసుకుని సరిదిద్దుకునే వెసులుబాటు కూడా ఉంది. అన్నీ సక్రమంగానే ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే సదరు దస్తావేజు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ శాఖకు చేరుతుంది. ఏ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ఆ రోజుకు ముందుగానే స్లాట్ కూడా బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న రోజు అదే సమయానికి సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి అమ్మకందారులు, సాక్షులతో వెళ్లి అర గంటలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఈ సులభతర విధానం కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా అమల్లోకి రానుంది. నెలాఖరు వరకు ఇక్కడ ఎదురయ్యే అనుభవాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు, చేర్పులతో ఈ విధానాన్ని నవంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించింది. చదువుకున్న వారెవరైనా దస్తావేజులనుసొంతంగా తయారు చేసుకునే వెసులుబాటు కొత్త విధానం ద్వారా లభిస్తోంది. దస్తావేజుల తయారీ ఇలా.. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లోకి వెళితే ఎడమ వైపు కింది భాగంలో న్యూ ఇనిషియేటివ్స్ అనే బాక్సులో డాక్యుమెంట్ ప్రిపరేషన్ అని ఉంటుంది. దీనిని క్లిక్ చేసి పాస్వర్డ్, ఐడీ రిజిస్టర్ చేసుకుని డాక్యుమెంట్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో కొనుగోలుదారు పేరు, నివాస ప్రాంతం, ఆధార్ నంబరు, అమ్మకందారు పేరు, నివాస ప్రాంతం, అమ్మకందారు ఆధార్ నంబరు లాంటి వివరాలు నింపేందుకు ఖాళీలు వదిలి డాక్యుమెంటు ఉంటుంది. స్థిరాస్తి వివరాలు (సర్వే నంబరు/ఫ్లాట్ నంబరు/ప్లాట్ నంబరు, గ్రామం/ పట్టణం) లాంటి వివరాలను కూడా ఖాళీల్లో నింపితే డాక్యుమెంటు తయారవుతుంది. ఆస్తి వివరాలు నమోదు చేసిన తర్వాత దాని రిజిస్ట్రేషన్‌కు ఎంత మొత్తం చెల్లించాలో కూడా ఆన్లైన్లో ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు. ఈ ప్రకారం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ రుసుం చెల్లించాలి. ఏరోజు, ఏ సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ముందే నిర్ణయించుకుని స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఏ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోదలిచారో కూడా పేర్కొనాలి. దస్తావేజు అంతా సక్రమంగా పూరించినట్లు నిర్ధారించుకున్న తర్వాత ప్రింటవుట్ తీసుకుని సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆ దస్తావేజు సంబంధిత సబ్ రిజిస్ట్రారు కార్యాలయానికి వెళుతుంది. స్లాట్ బుకింగ్ ప్రకారం సబ్ రిజిస్ట్రారు కార్యాలయానికి వెళితే ఆన్లైన్లోని వివరాలను పరిశీలించి వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి దస్తావేజు కాపీ ఇస్తారు. -
పింఛన్.. టెన్షన్..
మంచిర్యాల రూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఆహార భద్రతా కార్డులు, పింఛన్ల కోసం చేపట్టిన ప్రక్రియ సజావుగా ముగిసినా.. ఆన్లైన్ చేసేందుకు మాత్రం తంటాలు తప్పడం లేదు. ఇటీవల కోకొల్లలుగా వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు అధికారులకు పెద్ద పరీక్షగా మారింది. కాగా.. గురువారం వరకు ఆన్లైన్ ప్రక్రియ పూర్తిచేసి.. శుక్రవారం నుంచి కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్ పూర్తికాకపోవడంతో కొత్త పింఛన్ల పంపిణీ ఎలా చేసేదని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఆటంకంగా మారిన సాంకేతిక సమస్య... గత నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆహార భద్రత, పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. 22వ తేదీ నుంచి ఈనెల 2 వరకు దరఖాస్తులదారుల ఇళ్లకు వెళ్లి అధికారులు విచారణ చేశారు. అనంతరం 3వ తేదీ నుంచి ఆ అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను ఆన్లైన్ చేసే పని ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణ, ఇంటింటి సర్వే చేసి విచారించిన అధికారులకు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా నమోదు చేయడం పెద్ద పరీక్షగా మారింది. తక్కువ సమయం ఉండడం, వివరాల నమోదుపై కంప్యూటర్ ఆపరేటర్లకు అవగాహన లేకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆన్లైన్లో పింఛన్ల వివరాలు నమోదు కావడంలో ఆలస్యం జరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఏకకాలంలో దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడం ప్రారంభించడంతో ఒక్కసారిగా సర్వర్‌పై ఒత్తిడి పెరిగి వెబ్‌పేజీలో వివరాలు ఆలస్యంగా నమోదవుతున్నాయి. ఒక్కో దరఖాస్తు పూర్తయ్యేందుకు పది నిమిషాల వరకు సమయం తీసుకుంటోంది. ఆ పది నిమిషాల తర్వాత కూడా ఆ దరఖాస్తు సేవ్ అవుతుందనే నమ్మకం కూడా లేకుండాపోయింది. ఒక్కోసారి ఒక్కో దరఖాస్తును రెండేసి మూడేసి సార్లు నమోదు చేయాల్సి వస్తోంది. వీటిని తొందరగా పూర్తి చేయాలని ఆపరేటర్లు రాత్రి, పగలు తేడా లేకుండా నాలుగు రోజులుగా కుస్తీ పడుతున్నారు. దీనికితోడు కంప్యూటర్ అవగాహన ఉన్న సిబ్బంది లేకపోవడం.. ఎక్కువ కంప్యూటర్లను సిద్ధం చేసుకోకపోవడంతోనూ ప్రక్రియ ఆలస్యం అవుతోంది. అందుబాటులో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లు, మండల పరిషత్, రెవెన్యూ, ఈజీఎస్ సిబ్బందితో ఆన్లైన్లో దరఖాస్తుల నమోదును చేపడుతున్నారు. ఒక్క రోజులో పూర్తయ్యేనా... జిల్లాలో ఆహార భద్రత కోసం 7,12,645 మంది, వివిధ రకాల పింఛన్ల కోసం 3,19,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. పింఛన్ దరఖాస్తులను అధికారులు ఆన్లైన్లో నమోదు చేసి ఈ శుక్రవారమే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అర్హులైన వారి జాబితాలను ప్రదర్శించాలి. కానీ.. అలా వీలుపడే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు. జిల్లాలోని 3,19,957 పింఛన్ దరఖాస్తులకు గాను గురువారం సాయంత్రం 6 గంటల వరకు 1,81,581 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేశా రు. ఒక్కరోజే సమయం ఉండడం, నాలుగు రోజు ల్లో 1.81 లక్షల దరఖాస్తులే ఆన్లైన్లో నమోదు చేయడంతో ఈ మిగిలిన ఒక్క రోజులో 1.38 లక్షల దరఖాస్తులను ఆన్లైన్ చేయడం కష్టంగానే మారిం ది. కంప్యూటర్లో దరఖాస్తుదారుల వివరాలను న మోదు చేసే సమయంలో జరిగిన పొరపాట్లను పరి శీలించేందుకు కూడా అధికారులకు సమయం లేకపోవడంతో, శనివారం పింఛన్ల పంపిణీలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి. ఆన్లైన్ చేస్తేనే పింఛన్.. ఇదిలా ఉంటే.. జిల్లాలో మరో 1.38 లక్షల దరఖాస్తులు ఆన్లైన్ చేసేందుకు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే.. వీరి వివరాలు ఆన్లైన్ చేస్తేనే పింఛన్ అందిస్తారా లేకుంటే దాంతో సంబంధం లేకున్నా పింఛన్ ఇస్తారా తెలీక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై డీఆర్డీఏ అడిషనల్ పీడీ గజ్జారాంను వివరణ కోరగా.. శనివారం ఆసరా కా ర్యక్రమం ప్రారంభం వరకు ఆన్లైన్ నమోదు ప్రక్రి య కొనసాగుతుందని, సమయానికి పూర్తికాకుంటే సంబంధిత తేదీ వరకు అనుమతి తీసుకుని పూర్తి చేస్తామని, ఆన్లైన్ పేర్లు నమోదు చేసిన వారికే పింఛన్లు అందుతాయని చెప్పారు.


