నంద్యాల జిల్లా: చాగలమర్రి మండలం మద్దూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. స్వామివారికి భక్తులు, దాతలు సమర్పించిన విలువైన వెండి ఆభరణాలు అపహరణకు గురికాగా, వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. ఈ ఘటన ఆలయ పరిపాలనపై తీవ్ర విమర్శలకు దారితీసింది.
సోమవారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి ఆభరణాలను పరిశీలించిన సమయంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రతి ఏడాది ఆనవాయితీగా వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి వెండి ఆభరణాలతో ప్రత్యేక అలంకరణ నిర్వహిస్తుంటారు. అనంతరం వాటిని ఆలయంలోని బీరువాలో భద్రపరుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి అలంకరణకు సిద్ధం చేస్తున్న సమయంలో అసలైన వెండి ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు ఉండటాన్ని ఆలయ అర్చకుడు మామిడి కిషోర్ శర్మ గుర్తించారు. విషయం వెంటనే ఆలయ అధికారులకు తెలియజేయగా, ప్రస్తుత ఈవో జయచంద్ర రెడ్డి ఆలయానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో జయచంద్ర రెడ్డి మాట్లాడుతూ, గత ఈవో తనకు సరైన చార్జ్ అప్పగించలేదని తెలిపారు.
వెండితో తయారుచేసిన కిరీటం, హస్తాలు, శంఖం, చక్రం, పాదాల తొడుగులతో పాటు మరికొన్ని విలువైన ఆభరణాలు మాయమైనట్లు వెల్లడించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ వ్యవహారంలో విశ్రాంత ఈవోతో పాటు ఆలయ అర్చకుడు కిషోర్ శర్మ హస్తం ఉండవచ్చన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జరిగిన ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.


