silver jewelry theft
-
మద్దూరు ఆలయంలో వెండి ఆభరణాల మాయం
నంద్యాల జిల్లా: చాగలమర్రి మండలం మద్దూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. స్వామివారికి భక్తులు, దాతలు సమర్పించిన విలువైన వెండి ఆభరణాలు అపహరణకు గురికాగా, వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. ఈ ఘటన ఆలయ పరిపాలనపై తీవ్ర విమర్శలకు దారితీసింది.సోమవారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి ఆభరణాలను పరిశీలించిన సమయంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రతి ఏడాది ఆనవాయితీగా వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి వెండి ఆభరణాలతో ప్రత్యేక అలంకరణ నిర్వహిస్తుంటారు. అనంతరం వాటిని ఆలయంలోని బీరువాలో భద్రపరుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి అలంకరణకు సిద్ధం చేస్తున్న సమయంలో అసలైన వెండి ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు ఉండటాన్ని ఆలయ అర్చకుడు మామిడి కిషోర్ శర్మ గుర్తించారు. విషయం వెంటనే ఆలయ అధికారులకు తెలియజేయగా, ప్రస్తుత ఈవో జయచంద్ర రెడ్డి ఆలయానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో జయచంద్ర రెడ్డి మాట్లాడుతూ, గత ఈవో తనకు సరైన చార్జ్ అప్పగించలేదని తెలిపారు. వెండితో తయారుచేసిన కిరీటం, హస్తాలు, శంఖం, చక్రం, పాదాల తొడుగులతో పాటు మరికొన్ని విలువైన ఆభరణాలు మాయమైనట్లు వెల్లడించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ వ్యవహారంలో విశ్రాంత ఈవోతో పాటు ఆలయ అర్చకుడు కిషోర్ శర్మ హస్తం ఉండవచ్చన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జరిగిన ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
బాన్సువాడలో పట్టపగలే చోరీ
బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. బంధువుల పెళ్లికి వెళ్లడంతో దుండగులు ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. బాధితుడు, వ్యాపారస్తుడు బెజుగం రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రాఘవేందర్‌తో పాటు కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి నిజామాబాద్‌లోని తమ బంధువుల వివాహానికి వెళ్లారు. పగలే కావడంతో కేవలం ప్రధాన ద్వారానికి మాత్రమే తాళం వేశారు. వీరు బయటకు వెళ్లినట్లు గమనించిన దొంగలు, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మొదటి అంతస్తులో ఉన్న రాఘవేందర్ ఇంటికి వెళ్లి తాళం పగులగొట్టారు. లోపలి నుంచి గొళ్లెం వేసుకున్న దొంగలు, బెడ్రూంలో ఉన్న బీరువాను పగుల గొట్టి, అందులో ఉన్న రూ. 5 లక్షలను, 5 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వెనుక భాగంలో ఉన్న తలుపును తెరిచి, ఎవరి కంట పడకుండా పారిపోయారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నిజామాబాద్ నుంచి ఇంటికి వచ్చిన రాఘవేందర్ భార్య, ఇంట్లో చోరీ జరగడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. టౌన్ ఇన్చార్జి సీఐ వెంకటరమణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ నిర్వహించారు. అలాగే బోధన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి వచ్చి పూర్తి వివరాలను సేకరించారు. క్లూస్ టీంను రప్పించి దొంగల వేలిముద్రలను సేకరించారు. బాధితుడు రాఘవేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు. కాగా చోరీ తెలిసిన వ్యక్తులే చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో ఎక్కడ ఏం ఉంటుందో తెలిసిన వారే చోరీ చేశారని, అలాగే మధ్యాహ్నం ఇంట్లోని అందరూ వివాహానికి వెళ్లిన విషయం కూడా తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.


