రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో శనివారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ శనివారం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నెమ్మదిగా కదులుతోందని పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.
సోమవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మంగళవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


